Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

బొమ్మై ప్రభుత్వానికి ‘అవినీతి’ తలనొప్పి

మఠాల నిధుల్లో 30 శాతం లంచాలకే…
ఇవ్వడం కుదరదంటే గ్రాంట్ల నిలిపివేత

మఠాధిపతి దింగళేశ్వర్‌ స్వామిజీ ఆరోపణలు కాషాయ పార్టీ నయా దైవభక్తి బెంగళూరు : కర్ణాటకలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. రాష్ట్రంలోని బెలగావి జిల్లాకు చెందిన సంతోష్‌ పాటిల్‌ అనే కాంట్రాక్టర్‌ అనుమానాస్పద మృతి నేపథ్యంలో బీజేపీ సీనియర్‌ నాయకుడు, రాష్ట్ర మంత్రి కె.ఎస్‌.ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణల తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో మరోసారి అవే ఆరోపణలు ఎదుర్కొంటోంది. రాష్ట్రంలోని మతపరమైన సంస్థలు కూడా తమకు విడుదల చేసిన నిధుల్లో 30 శాతం లంచాల రూపంలో వదులుకోవాల్సి వస్తోందని గడగ్‌లోని చారిత్రక ఫకీరేశ్వర మఠానికి చెందిన దింగళేశ్వర స్వామి ఆదివారం ఆరోపించారు. ‘ఇది నాకు కూడా బాగా తెలుసు. ఒక మఠానికి నిధులు విడుదల చేస్తే, అది మఠానికి చేరే సమయానికి దానిలో 30 శాతం ఇప్పటికే పోయింది. నిధులు ఇవ్వకుంటే పనులు పూర్తికావని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు అవినీతి జరిగింది’ అని దింగళేశ్వర స్వామి తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ మఠ సిద్ధాంతాలను కర్ణాటక, మహారాష్ట్రలోని కోటి మందికి పైగా లింగాయత్‌లు అనుసరిస్తారు. ఈ క్రమంలో స్వామీజీ తాజా ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పోలీసు నియామక కుంభకోణానికి సంబంధించి కల్బుర్గిలోని బీజేపీ మహిళా విభాగం మాజీ జిల్లా అధ్యక్షురాలు ఆస్తులపై నేర దర్యాప్తు విభాగం (సీఐడీ) అధికారులు దాడులు చేసిన రోజే ఈ స్వామిజీ ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా హోస్పేటలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉండటం విశేషం. ఉత్తర కర్ణాటకలో సాగునీటి ప్రాజెక్టుల అమలు కోసం కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఎస్‌.ఆర్‌.పాటిల్‌, రైతు సంఘాల అధ్వర్యంలో ‘కృష్ణామహదాయి`నవలి సంకల్ప యాత్ర’ కార్యక్రమంలో గడగ్‌లో మత సామరస్యానికి చిహ్నంగా నిలిచిన 400 ఏళ్ల చరిత్ర కలిగిన లింగాయత్‌ మఠానికి చెందిన స్వామిజీ దింగళేశ్వర్‌ రాష్ట్ర ప్రభుత్వంపై ఈ అవినీతి ఆరోపణలు చేశారు. గొలుసుకట్టులో ఉన్న ప్రతి ఒక్కరూ నిధులను ఎలా తింటారు అనేదానికి ఒక ఉదాహరణను ఉటంకిస్తూ, ‘బెంగళూరులో ఐస్‌క్రీం ఇస్తే, అది మన వద్దకు వచ్చే సమయానికి దానిలో మిగిలేది కర్ర మాత్రమే’ అని స్వామిజీ పేర్కొన్నారు. ఇప్పటికే తమ నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణలతో బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్‌కు దింగళేశ్వర స్వామి చేసిన ఆరోపణలు మరొక ఆయుధంగా మారాయి. కాగా ధర్మాన్ని పరిరక్షిస్తున్నామంటూ ప్రచారం చేసుకొనే బీజేపీ.. మఠాలు, ఆలయాల నుంచి కమీషన్‌ను దండుకోవడం సిగ్గుచేటని మాజీ సీఎం సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. కర్ణాటక బీజేపీ సర్కారును 40 శాతం కమీషన్‌ ప్రభుత్వంగా అభివర్ణించారు. అవినీతి దందాలో స్వామీజీలను కూడా బీజేపీ ప్రభుత్వం విడిచిపెట్టట్లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దినేశ్‌ గుండూరావు మండిపడ్డారు. ఇలా అయితే పవిత్రత ఇంకా ఎక్కడ మిగిలి ఉంటుందని ప్రశ్నించారు. ‘బీజేపీ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నది. ఆ డబ్బుతో ఎన్నికల్లో గెలుస్తున్నది. మఠాలకు నిధులు ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకొనే ప్రభుత్వం.. అందులో కూడా కమీషన్‌ను తీసుకొంటున్నది’ అని అన్నారు. ప్రజలందరికీ తెలిసిన ప్రఖ్యాత స్వామీజీనే కమీషన్‌ తీసుకొంటున్నారని చెబుతున్నప్పుడు ఇంకా సాక్ష్యాలు ఎందుకోసమని? ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైని ప్రశ్నించారు. స్వామీజీ ఆరోపణలపై సీఎం బొమ్మై స్పందించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిపారు. దింగలేశ్వర్‌ స్వామీజీ ఓ గొప్ప వ్యక్తి అని, ఆయన గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని పేర్కొంటూ ‘ఒక మఠం అధిపతి కేవలం ప్రకటన జారీ చేస్తే సరిపోదు. ఎవరు కమీషన్‌ డిమాండ్‌ చేశారు. ఎవరికి చెల్లించారు. ఎంత చెల్లించారు. దానికి సంబంధించిన అన్ని వివరాలను ఆయన అందజేస్తే, నేను సమగ్ర విచారణకు హామీ ఇస్తాను’ అని తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ఉడిపిలో కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ అనుమానాస్పద ఆత్మహత్యపై కర్ణాటకలోని కాంగ్రెస్‌ ఇప్పటికే ప్రశ్నలను లేవనెత్తింది. పేమెంట్‌ ఆర్డర్‌ ఇవ్వడానికి కర్ణాటక పంచాయతీరాజ్‌ మంత్రి ఈశ్వరప్ప 40 శాతం కమీషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని పాటిల్‌ అంతకుముందు ఆరోపించారు. దీంతో ఈశ్వరప్ప కారణంగానే సంతోష్‌ ఆత్మహత్య చేసుకొన్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే అంశంపై ఈశ్వరప్పపై కేసు కూడా నమోదయింది. అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు రావడంతో మంత్రి పదవికి ఆయన రాజీనామా కూడా చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తున్న కమీషన్‌ 45 శాతాన్ని మించిపోతున్నదని కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు కెంపన్న ఆరోపించడం ఇటీవల చర్చనీయాంశమైంది.
ప్రతి కుంభకోణంలో బీజేపీ నాయకుడు, మంత్రికి ఉమ్మడి బంధం
పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ర్యాంక్‌ ప్రవేశ పరీక్షల నిర్వహణలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు రావడంతో హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర సీఐడీ విచారణకు ఆదేశించారు. ఆదివారం కల్బుర్గిలోని బీజేపీ మహిళా విభాగం మాజీ జిల్లా అధ్యక్షురాలు దివ్య హగరాగి నివాసంపై సీఐడీ అధికారులు దాడులు చేశారు. అప్పటి నుంచి హగరాగి పరారీలో ఉన్నారు. ఈ కుంభకోణంలో ఆమె భర్త రాజేష్‌ను సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. హగరాగికి చెందిన విద్యా సంస్థ, జ్ఞాన్‌ జోతి విద్యా సంస్థ ఈ నియామక కుంభకోణానికి కేంద్రంగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. హగరాగి సంస్థలో పరీక్ష రాసిన అభ్యర్థి 21 మార్కులకు మాత్రమే ప్రశ్నలను ప్రయత్నించినప్పటికీ 100 మార్కులు సాధించడంతో సీఐడీ కేసు దర్యాప్తు చేస్తోంది. నమోదయిన ఎఫ్‌ఐఆర్‌లో సీఐడీ అధికారులు కొంతమంది అభ్యర్థుల మార్కులను నకిలీ చేసినట్లు తెలుస్తోంది. 545 పీఎస్‌ఐ ఖాళీలను భర్తీ చేసేందుకు గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన పరీక్షలకు 52 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షలో ఉత్తీర్ణులైన నలుగురు అభ్యర్థులు, ముగ్గురు ఇన్విజిలేటర్లతో సహా ఈ కేసులో ఇప్పటివరకు కనీసం ఏడుగురిని అరెస్టు చేశారు. ఇదిలాఉండగా, బీజేపీ హగరాగి తమ పార్టీ సభ్యురాలు కాదని చెప్పేందుకు ప్రయత్నించింది. ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న వారిని విచారణ చేస్తామని సీఎం బొమ్మై చెప్పారు. అయితే, హగరాగి హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్రకు సన్నిహితంగా ఉన్నట్లు కాంగ్రెస్‌ సూచించింది. ‘బొమ్మై ప్రభుత్వాన్ని ‘కుంభకోణాల ప్రభుత్వం’గా మార్చాలి. ప్రతి స్కామ్‌లో ఒక బీజేపీ నాయకుడికి, ఒక మంత్రికి ఉమ్మడి బంధం ఉంది. పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పరీక్షలో 70 వేల మంది అభ్యర్థుల భవిష్యత్తు ‘పేపర్‌ మాఫియా’కి బహిరంగంగా అమ్ముడుపోయింది. అయినప్పటికీ, నిందితుడి ఇంట్లో హోం మంత్రి అల్పాహారం తీసుకున్నారు’ అని కర్ణాటక ఇన్‌ఛార్జి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్‌ సూర్జేవాలా సోమవారం ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img