Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

బ్యాంకుల ప్రైవేటీకరణ వెనక్కి

సవరణ చట్టాలు ఉపసంహరించాల్సిందే
సీపీఐ డిమాండు
ప్రధానికి డి.రాజా లేఖ

న్యూదిల్లీ : దేశానికి, సమాజంలోని వెనుకబడిన వర్గాల ప్రయోజనాల దృష్ట్యా జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మార్చుకోవాలని, ఆ మేరకు ప్రతిపాదించించిన సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) డిమాండు చేసింది. బ్యాంకింగ్‌ చట్టాల (సవరణలు) బిల్లు, 2021ని ఉపసంహరించుకోవాలని డిమాండు చేస్తూ సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా గురువారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. 29 నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశంలో బ్యాంకింగ్‌ చట్టాల (సవరణ) బిల్లు 2021ని ప్రవేశపెట్టేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధం కావడంతో రాజా స్పందించారు. ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీ)ల ప్రైవేటీకరణకు కేంద్ర బడ్జెట్‌ 2021`22లో చేసిన ప్రతిపాదన మేరకు ఈ బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. దేశ ఆర్థికాభివృద్ధిలో పీఎస్‌బీలు కీలకం.. వ్యవసాయం, చిన్న వ్యాపారాలు, ఎస్‌ఎస్‌ఐ, రవాణా, బలహీన వర్గాల అభ్యున్నతికి జాతీయ బ్యాంకులు కీలకం. సామాన్యులు బ్యాంకింగ్‌ క్షేత్రంలో భాగమై అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారు’ అని లేఖలో రాజా పేర్కొన్నారు. 2008లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలు అయినప్పుడు భారతీయ ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగా నిలబెట్టినది పీఎస్‌బీలేనని మరువరాదన్నారు. బడా వ్యాపారులు, కార్పొరేట్లు తీసుకున్న రుణాలను చెల్లించకపోవడంతో నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) పెరిగిపోయి పీఎస్‌బీలు నష్టాల్లో కూరుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. రుణ వసూళ్ల కోసం రికవరీ ట్రిబ్యునళ్లు, ఎస్‌ఏఆర్‌ఎఫ్‌, ఈఎస్‌ఐ చట్టం, ఐబీసీ తదితర చర్యలను కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు తీసుకున్నాగానీ అవేవీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని, ఫలితంగా బ్యాంకులన్నీ తీవ్రంగా నష్టపోయాయని రాజా తెలిపారు. బ్యాంకులను జాతీయీకరించడం వల్ల కాదు కార్పొరేట్లు, బడా వ్యాపారవేత్తలు తీసుకున్న డబ్బు ఎగొట్టడం వల్లే నష్టాలు వస్తున్నాయని రుజువైందని వ్యాఖ్యానించారు. ‘గ్లోబల్‌ ట్రస్ట్‌ బ్యాంకు, యునైటెడ్‌ వెస్ట్రరన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ కర్నాడ్‌ తదితర ప్రైవేటు రంగ బ్యాంకులను గట్టెక్కించేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులను వాడుకున్నారు. ఈ మధ్యనే యస్‌ బ్యాంకును ఎస్‌బీఐ గెట్టెక్కించింది. ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ కలిసి ప్రైవేటు రంగంలోనే అతిపెద్ద ఎన్‌బీఎఫ్‌సీ, ఐఎల్‌Êఎఫ్‌ఎస్‌లను నష్టాల్లో నుంచి బయటకు తెచ్చాయి. ప్రైవేటు రంగానికి చెందిన ఆర్‌బీఎల్‌ బ్యాంకు, బంధన్‌ బ్యాంకు, మరో నాలుగు చిన్న బ్యాంకులు నష్టాల్లో కూరుకుపోయాయి. సుభద్రా లోకల్‌ ఏరియా బ్యాంకు లైసెన్సును ఆర్బీఐ రద్దు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో తమ కష్టార్జీతాన్ని ప్రైవేటు బ్యాంకుల్లో పెడితే నష్టపోతామన్న భయం సామాన్యుల్లో ఉంది’ ప్రధాని దృష్టికి రాజా తీసుకువెళ్లారు. ‘నిరుద్యోగ యువత కోసం జన్‌ధన్‌, ముద్రా, వీధి విక్రేతల కోసం స్వాధాన్‌, అలాగే, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన, ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి యోజన, ప్రధాన మంత్రి జీవన్‌ సురక్ష యోజన, నేరుగా నగదు బదిలీ పథకాలైన ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన, ప్రధానమంత్రి కిసాన్‌ కల్యాణ్‌ యోజన, అటల్‌ పింఛన్‌ యోజన తదితరాలను సమాజంలోని వెనుకబడిన వర్గాల కోసం అమలు చేస్తున్నట్లు మీ ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకాల అమలులో పీఎస్‌బీలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.
మహమ్మారి కాలంలోనూ ఎలాంటి అవరోధాలు లేకుండా వినియోగదారులకు సేవలు అందించినది ప్రభుత్వ రంగ బ్యాంకులే అని రాజా పేర్కొన్నారు. ఈ అన్ని అంశాల దృష్ట్యా ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటుకు అప్పగించడం వల్ల సామాన్యులు, వెనుకబడిన వర్గాల ప్రయోజనాలకు గండి కొట్టినట్టే అవుతుంది కాబట్టే దీనిని వ్యతిరేకిస్తున్నామని రాజా వెల్లడిరచారు. పీఎస్‌బీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పున:పరిశీలించాలని, దేశం, సామాన్యుల ప్రయోజనార్థం ఆ మేరకు ప్రతిపాదించిన బిల్లును ఉపసంహరించుకోవాలని సీపీఐ డిమాండు చేస్తోందని ప్రధానికి రాసిన లేఖలో డి.రాజా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img