Friday, December 2, 2022
Friday, December 2, 2022

భద్రతా వలయంలో విశాఖ

. మోదీ కాన్వాయ్‌కి ప్రత్యేక పోలీసు దళం
. దిల్లీ నుంచి 50 మంది అధికారుల రాక
. చోళా సూట్‌, ఎయిర్‌పోర్ట్‌, ఏయూ వద్ద స్పెషల్‌ ఫోర్స్‌
. వారం రోజులు చిరు వ్యాపారాలు బంద్‌

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజులపాటు విశాఖ నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననుండడంతో మహానగరం ఎస్పీజీ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూపు) పోలీసుల భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. అంతర్జాతీయ విమానాశ్రయం, నేవీ పరిధిలోని చోళాసూట్‌, ఏయూ గ్రౌండ్స్‌ ప్రాంతాలన్నీ ప్రత్యేక అధికారులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. మరోపక్క దాదాపు ఐదువేల మందికి పైగా పోలీసులు నగరాన్ని చుట్టుముట్టారు. అన్ని దారులు పోలీసుల వలయంలో చిక్కుకున్నాయి. మోదీ పర్యటన ఈ నెల 11,12 తేదీల్లో విశాఖలో ఉండడంతో దిల్లీ నుంచి ప్రత్యేక బలగాలు నగరానికి చేరుకున్నాయి. 50 మంది ప్రత్యేక అధికారులు రానున్నారు. మోదీ కాన్వాయ్‌కు మరో ప్రత్యేక దళం రానుంది. ప్రధానంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిరసన సెగ ప్రధానికి తగలకుండా ఉండాలనే లక్ష్యంతోనే భారీ భద్రత చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. స్టీల్‌ ప్లాంట్‌ జంక్షన్‌ నుంచి నగరంలో ప్రతి కూడలి వద్ద వందలాది మంది పోలీసులు ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేశారు. మూడు రోజుల ముందునుంచే బందోబస్తు నిర్వహణలో పోలీసులు తనమునకలై ఉన్నారు.
మధురవాడ, పెందుర్తి, రహదారుల మీదుగా వచ్చే ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తున్నారు. దీంతో సాధారణ జనజీవనానికి తీవ్రతరాయం ఏర్పడిరది. విద్యార్థులు, ఉద్యోగులు, పర్యాటకులకు పోలీస్‌ ఆంక్షలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మరోపక్క రోడ్లపై చిరు వ్యాపారాలను పోలీసులు బంద్‌ చేశారు. కాన్వాయ్‌ రహదారి గుండా ఇరువైపులా ఉన్న షాపులను మూయించేశారు. అటు బీచ్‌ రోడ్‌ లో, ఇటు నగరంలో అనేక కూడళ్లలో వారం రోజులపాటు నిర్వహించకూడదని పోలీసులు ఆంక్షల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదని చిరు వ్యాపారులు లబోదిబోమంటున్నారు. మరోపక్క ముందస్తు అరెస్టులకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
వివిధ రాజకీయ పక్షాల నేతలను, కార్మిక ,ఉద్యోగ , ప్రజాసంఘాల నేతలను 11వ తేదీ ఉదయాన్నే అరెస్టు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img