ఇప్పటికైనా జెడ్ క్యాటగిరీ భద్రతను అంగీకరించాలని కోరుతున్నా..అమిత్‌షా
ఇటీవల ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటన చేశారు.ఘటన జరిగిన వెంటనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకున్నామని చెప్పారు. దీనికి ముందు కేంద్ర భద్రతా సంస్థల సమాచారం మేరకు ఒవైసీకి భద్రత కల్పించాలని కేంద్రం ఆదేశించినట్టు చెప్పారు. అయితే, అందుకు ఒవైసీ ఇష్టపడలేదని, ఢల్లీి, తెలంగాణ పోలీసులు ఆయనకు భద్రత కల్పించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదని చెప్పారు. అసదుద్దీన్ యూపీలోని హాపూర్ జిల్లా పర్యటన ముందుగా షెడ్యూలు చేసుకున్నది కాదన్నారు. ఆయన పర్యటన గురించి ఆ జిల్లా కంట్రోల్ రూమ్‌కు ముందుగా సమాచారం కూడా లేదన్నారు. కారుపై కాల్పుల ఘటన తర్వాత ఆయన సురక్షితంగా బయటపడి దిల్లీకి చేరుకున్నారని తెలిపారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రెండు తుపాకులు, ఆల్టోకారు స్వాధీనం చేసుకున్నారని వెల్లడిరచారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని ఫోరెన్సిక్ బృందం సునిశితంగా పరిశీలించి ఆధారాలు సేకరించిందన్నారు. ఒవైసీకి ఇప్పటికీ ముప్పు ఉందన్న సమాచారంతో ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం, జడ్ కేటగిరీ భద్రతను కేంద్రం కల్పించిందని చెప్పారు. కానీ దాన్ని తిరస్కరిస్తున్నట్టు ఆయన మౌఖికంగా చెప్పారన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కల్పించిన భద్రతకు ఒవైసీ సమ్మతించాలని విజ్ఞప్తి చేశారు.