ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విరుచుకుపడ్డారు.దేశ ప్రయోజనాల దృష్ట్యా తమ పార్టీ యూపీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించినట్లు మమతా చెప్పారు. అఖిలేష్ యాదవ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ ప్రచారం కోసం మమతాబెనర్జీ యూపీకి వచ్చారు. ‘‘యూపీలో మహిళలను సజీవ దహనం చేస్తారు, రైతులను హతమారుస్తారు, యూపీ సీఎం యోగి కాదు భోగి, భారతదేశాన్ని రక్షించాలంటే మొదట యూపీని రక్షించాలి’’ అని బెనర్జీ అన్నారు. మొదటి దశ పోలింగులో అఖిలేష్ పార్టీ 57 సీట్లలో 37 సీట్లను గెలుచుకుంటుందని భావిస్తున్నానని తెలిపారు. వారణాసిలో ర్యాలీ నిర్వహించేందుకు మార్చి 3న మరోసారి ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నట్లు తెలిపారు. గోవా ఎన్నికల్లో తమ పార్టీ కూడా మంచి ఫలితాలు సాధిస్తుందని చెప్పారు.