. ప్రత్యేక హోదాతోనే మేలు
. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సరికాదు
. ప్రజా ఉద్యమాలపై కేసులు ఎత్తివేయాలి
. సీఎం చంద్రబాబుకు సీపీఐ నేతల విజ్ఞప్తి
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ చేయించాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ తెలిపారు. అన్నమయ్యజిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం ఘటనలో తాము గుర్తించిన అంశాలతోపాటు వివిధ సంఘటనలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కబ్జాకు గురైన భూములను తిరిగి హక్కుదారులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో చంద్రబాబును నారాయణతోపాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీఎస్‌ఎన్ మూర్తి, కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్ (మాజీ ఎమ్మెల్సీ), అక్కినేని వనజ, ఓబులేసు కలిసి వివిధ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అమరావతి, పోలవరం నిర్మాణం, విద్యుత్, ఆర్టీసీ చార్జీల భారాలు, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడినందుకు సీపీఐ, అనుబంధ సంఘాల నేతలపై గత ప్రభుత్వం బనాయించిన కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. పోలవరాన్ని మొదటి దశ వరకే పరిమితం చేయాలనే నిర్ణయాన్ని గత ప్రభుత్వం సమర్థించడం విచారకరమని, 45.72 మీటర్ల ఎత్తులోనే నిర్మాణం జరగాలని కోరారు. ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం కాకుండా చూడాలని కోరారు. సీఎంను కలిసిన అనంతరం పార్టీ నేతలతో కలసి నారాయణ మీడియాతో మాట్లాడారు. వివిధ ప్రజాఉద్యమాల్లో గత ప్రభుత్వం నమోదు చేసిన కేసులు ఎత్తేయాలని చంద్రబాబును కోరినట్లు చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చే ముందు ఫైళ్లు తగలబెట్టడం పరిపాటిగా మారిందన్నారు. ఇటీవల మదనపల్లెలో తాము పర్యటించామని, ఆ చుట్టుపక్కల జిల్లా మొత్తం భూమిని దోచేశారని గుర్తించామన్నారు. 22ఏలో పెట్టీ ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్ట్రేషన్ చేసేశారన్నారు. మదనపల్ల్లె ఫైళ్లు మొత్తం తగలబడలేదని, ఎంపిక చేసినవే తగలబడ్డాయని చెప్పారు. గత ప్రభుత్వంలో వేధింపులు ఎన్నో జరిగాయని, ప్రభుత్వమే వాటిని సమీక్షించాలని, ప్రజలు కూడా ముందుకు రావాల్సిన అవసరముందన్నారు. మదనపల్లెలో ఒక ప్రాంతంలో మాత్రమే అగ్నిప్రమాదం జరిగిందని, ఈ సంఘటనపై ఆగస్టు 4వ తేదీన మదనపల్లెలో బాధితులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం విజయవాడలోను, మిగిలిన జిల్లాల్లోను భూములు కోల్పోయిన బాధితులతో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ… పాత కాంట్రాక్టర్లే పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా భూ లావాదేవీలకు సంబంధించిన అక్రమ కేసుల విషయంలో ప్రజల్ని సమీకరిస్తామన్నారు. ప్రభుత్వం మారినా కిందిస్థాయిలో అధికారులు మారడం లేదని చెప్పారు. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు, నితీశ్‌కుమార్ మద్దతు లేకుంటే… మోదీ పని అయిపోయినట్లేనన్నారు. రాష్ట్రానికి కేంద్రమంత్రి పదవులు దక్కడం వల్ల ఉపయోగం ఏమిటని, అందులో సత్తా గల శాఖలు లేవన్నారు. ఏపీకి బడ్జెట్లో ఏ మొచ్చిందని, కేటాయింపులు సరిగ్గా లేవని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేస్తేనే అన్ని విధాలా ఫలితం ఉంటుందని పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదా రాజ్యాంగ పరమైన హక్కు అని, దాన్ని కాదని 15 వేల కోట్ల రూపాయలు అప్పుగా ఇస్తామన్నారని, రాష్ట్రానికి పచ్చళ్లు, కూరలు వేసి అన్నం పెట్టలేదని నారాయణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రత్యేక హోదా వస్తే మన హక్కులకు రక్షణ ఉంటుందని నొక్కిచెప్పారు. ప్రపంచ బ్యాంక్ రుణం వివాదంగా మారిందని, ప్రతి బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని, ఖర్చులు మాత్రం పెట్టబోరని చెప్పారు. అదే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక హక్కుగా వస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసినా తాము ప్రశ్నిస్తామని, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అందంగా అబద్ధాలు చెబుతారని ఎద్దేవా చేశారు. జాతీయ రహదారుల గురించి మాట్లాడుతున్నారు గానీ… సర్వీస్ రోడ్లు పట్టించుకోవడం లేదన్నారు. దీంతో రైతు ఒక పొలం నుంచి మరో పొలంలోకి వెళ్లే పరిస్థితి ఉండబోదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదని చెప్పారు. కేంద్రం చేస్తున్న సాయం శాశ్వతమైనది కాదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో బాధితులు బయటకు రాలేదని, ఇప్పుడు పూర్తి వివరాలతో తాము సీఎం వద్దకు వచ్చామని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరముందని సూచించారు. గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి భారీగా సంక్షేమ పథకాలు ఇచ్చారని, అయినా దారుణంగా ఓటమి చెందారన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయపక్షంగా ఒక వైఖరి తీసుకున్న వాళ్లే గెలిచారని, తీసుకోకుండా తొండాట ఆడిన వారు ఓడిపోయారన్నారు. మాయావతి, నవీన్ పట్నాయక్, కేసీఆర్, జగన్ ఓడిపోయారని వ్యాఖ్యానించారు.
సీఎం, నారాయణ మధ్య ఆసక్తికర చర్చ
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు, సీపీఐ నేత నారాయణ మధ్య కాలేజీ రోజుల అంశంపై ఆసక్తికరచర్చ జరిగింది. నాడు చేసిన రాజకీయ పోరాటాలు, విద్యార్థి రాజకీయాలను నెమరువేసుకుని కాసేపు ఉల్లాసంగా గడిపారు.
సీఎం దృష్టికి విశాఖ ఉక్కు, రైల్వేజోన్: రామకృష్ణ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ వామపక్షాల అధ్వర్యంలో తలపెట్టిన పోరాటాలను గత ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసిందన్నారు. తమ ప్రజా ఉద్యమాలకు సంబంధించి 26 జిల్లాల్లో కేసులు పెట్టారని, వాటిని వెనక్కి తీసుకోవాలని కోరగా… సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారన్నారు. విశాఖ ఉక్కు, రైల్వే జోన్ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని, చివరకు మఠం భూములను కూడా దోచేశారని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేప్టివ్ మైన్స్ ఇవ్వాలని, సెయిల్ అధ్వర్యంలో నడపాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూములు పోగొట్టుకున్న వారందర్నీ సమీకరిస్తున్నామని తెలిపారు. వారం, పది రోజుల్లో బాధితులతో ఈ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. మూడు రాజధానుల పేరుతోనూ విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో వేలాది ఎకరాలు అన్యాక్రాంతం చేసిన వైనాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చామని తెలిపారు. పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలను బెదిరించి గత పాలకులు భూములు కాజేశారని తెలిపారు. భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని, భూ కుంభకోణానికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.