Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

మంటగలసిన మానవత్వం

కేజీహెచ్‌లో ఘోరం
. శిశువు మృతి చెందితే అంబులెన్సు ఇవ్వని ఆస్పత్రి సిబ్బంది
. ప్రాథేయపడ్డా కనికరించని వైనం
. స్కూటీపైనే 100 కిలోమీటర్లు మృతదేహం తరలింపు

ప్రభుత్వాస్పత్రుల్లో సిబ్బంది నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందనడానికి ఈ ఘటనే నిదర్శనం. అనారోగ్యంతో మృతి చెందిన శిశువును తరలించేందుకు అంబులెన్స్‌ అడిగితే ఆస్పత్రి సిబ్బంది స్పందించలేదు. కాళ్లా, వేళ్లా పడ్డా కనికరించలేదు. ప్రైవేట్‌ అంబులెన్స్‌కు ఇచ్చేందుకు చిల్లిగవ్వలేకపోవడంతో ఆ తండ్రి, తన శిశువు మృతదేహాన్ని స్కూటీపైనే తరలించాడు. మనసుల్ని కుదిపేస్తున్న ఈ ఘటన విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో చోటుచేసుకుంది.

విశాలాంధ్ర-పాడేరు: గిరిజన ప్రాంతంలో సరైన వైద్య సదుపాయాలు లేక పెద్ద ఆసుపత్రిగా పేరు ఉన్న కేజీహెచ్‌కు రోగులు వస్తే తీవ్ర నిర్లక్ష్యం చోటు చేసుకుంటోంది. కనీసం మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్‌ సైతం ఇవ్వకపోవడాన్ని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఆలస్యంగా ఓ విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. అల్లూరి జిల్లాలోని ముంచంగిపుట్టు మండలం, దారేలా గ్రామానికి చెందిన సీహెచ్‌ మల్లేశ్వరి, రాజారావు దంపతులకు పుట్టిన శిశువు అనారోగ్యానికి గురవడంతో, వైద్యం నిమిత్తం పాడేరు జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. శిశువు తీవ్ర అనారోగ్యంతో ఉందని, మెరుగైన వైద్యం ఇప్పించాలని వారు సూచించడంతో ఈనెల 2న విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. శిశువు శ్వాశకోస సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో వెంటిలేటర్‌పై వైద్యసేవలందిస్తున్నారు. సుమారు 15 రోజులుగా కేజీహెచ్‌లోనే ఉంచారు. ఈక్రమంలో శిశువు పరిస్థితి విషయమించి గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మృతి చెందింది. మృతదేహాన్ని స్వగ్రామం తరలించేందుకు అంబులెన్స్‌ సదుపాయం కల్పించాలని రాజారావు ఆస్పత్రి సిబ్బందిని కోరారు. ఆఖరుకు తమకు ప్రత్యేకంగా కేటాయించిన ఎస్టీ సెల్‌ సిబ్బందిని కూడా బతిమలాడారు. అయినా ఏ ఒక్కరూ స్పందించలేదు. కాళ్లావేళ్లా పడ్డా వారికి కనికరించలేదు. ప్రైవేటు అంబులెన్స్‌కు డబ్బు చెల్లించలేని పరిస్థితిలో చివరకు ఆ తండ్రి తన స్కూటీపైనే మృతదేహాన్ని తరలించేందుకు నిర్ణయించారు. సుమారు 100 కిలోమీటర్ల మేర ప్రయాణించిన అనంతరం పాడేరు వచ్చారు. ఈ హృదయ విదారక ఘటన సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. విషయం తెలుసుకున్న పాడేరు ఆస్పత్రి సిబ్బంది స్పందించి పాడేరు నుంచి శిశువు స్వగ్రామం దారేలా వరకు మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు. దీనిపై జిల్లా అదనపు వైద్యాధికారి లీలాప్రసాద్‌ మాట్లాడుతూ సమాచార లోపంతో ఇలా జరిగిందనీ, అధికారులను సంప్రదిస్తే అంబులెన్స్‌ ఏర్పాటు చేసేవాళ్లమని పేర్కొన్నారు. తల్లిదండ్రులకు అంబులెన్స్‌ నమోదు ప్రక్రియ తెలియలేదని వివరణ ఇచ్చారు.
పేరుకే పెద్దాస్పత్రి…: విశాఖ కేజీహెచ్‌ పేరుకే పెద్దసుపత్రి. ఏజెన్సీ నుంచి మెరుగైన వైద్య సేవలు కొరకు రోగులను కేజీహెచ్‌కు తరలిస్తుంటారు. ఈక్రమంలో వెనుకబడిన వర్గాలైన ఎస్టీలకు కేజీహెచ్‌లో ప్రత్యేకంగా పాడేరు ఐటీడీఏ పీఓ ఆదేశాలతో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు ఎచేశారు. ఈ సెల్‌లో ఎస్టీ రోగులకు మెరుగైన వైద్యం, రోగులకు వచ్చిన సమస్యలు పరిష్కారం కొరకు సిబ్బంది కృషి చేయాల్సి ఉంటుంది. కానీ వారు ఎటువంటి సేవలు అందించడం లేదు. అంతులేని నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. కేజీహెచ్‌లో పదుల సంఖ్యలో ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఎస్టీ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యాశాఖ మంత్రి, ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్‌ చైర్మన్‌, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ గతంలో కె జి హెచ్‌ను సందర్శించి స్పష్టమైనా ఆదేశాలు జారీ చేసినా, ఇక్కడున్న సిబ్బంది ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా ఉన్నతధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా తగిన చర్యలు చేపట్టి, చోటుచేసుకున్న ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యలైన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img