Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

మండలి చైర్మన్‌ ఎవరు?

వైసీపీ ఎమ్మెల్సీల్లో ఉత్కంఠ బ సెప్టెంబరు రెండోవారంలో అసెంబ్లీ
ఈలోగా ఎంపిక ప్రక్రియ పూర్తికి అధిష్ఠానం కసరత్తు
తొలుత డిప్యూటీ చైర్మన్‌ నియామకం?

అమరావతి : సెప్టెంబరు రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈలోగా ఖాళీగా ఉన్న శాసన మండలి చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌ పదవులు భర్తీ చేసేందుకు అధిష్ఠానం కసరత్తు చేస్తుండగా, వైసీపీ ఎమ్మెల్సీల్లోని ఆశావహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. మొన్నటివరకు చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్లుగా వ్యవహరించిన టీడీపీకి చెందిన ఎండీ షరీఫ్‌, రెడ్డి సుబ్రహ్మణ్యం పదవీ విరమణతో ప్రొటెం స్పీకర్‌గా పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యంను నియమించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలతో ఆయనే ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం మండలిలో అధికారపార్టీ సభ్యులదే మెజార్టీ అయింది. దీంతో చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌ పదవులు వైసీపీ ఎమ్మెల్సీలను వరించనున్నాయి. శాసనమండలి సమావేశాల తొలి రోజునే కొత్త చైర్మన్‌ ఎన్నిక నిర్వహిస్తారు. ఇప్పటికే వైసీపీ నుండి సామాజిక వర్గాల వారీగా పదవులు కేటాయిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి, ఈ పదవుల ఎంపికలోనూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శాసనసభలో బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌కు స్పీకర్‌ పదవి ఇవ్వటంతో మండలి చైర్మన్‌ పదవి ఓసీలకు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీలో సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అయితే ఈ పదవికి వన్నె తెస్తారని, సభను సజావుగా, సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆ పార్టీలో సీనియర్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మారెడ్డిని చైర్మన్‌గా నియమిస్తే పెద్దలసభకు మరింత హూందాతనం వస్తుందని చెపుతున్నారు. అయితే ఉమ్మారెడ్డి గతనెలలోనే ఎమ్మెల్సీగా పదవీ విరమణ చేశారు. అందువల్ల ఆయనకు చైర్మన్‌ అయ్యే అవకాశం లేదని వైసీపీలో కొందరు ఎమ్మెల్సీలు వాదిస్తున్నారు. ఆయనను మండలి చైర్మన్‌గా నియమించే ఉద్దేశం ముఖ్యమంత్రికి ఉంటే…ఇటీవల ఎమ్మెల్యేల కోటాలో ఆయనకు తిరిగి అవకాశం కల్పించేవారని విశ్లేషిస్తున్నారు. చైర్మన్‌ పదవి కచ్చితంగా ఎస్సీ లేదా ముస్లిం మైనార్టీలకు దక్కుతుందంటున్నారు. అప్పటికి మండలిలో వైసీపీకి మెజార్టీ లభిస్తుందన్న ఆలోచన లేకపోవడం వల్లే సీఎం దానిపై దృష్టి పెట్టలేదని, త్వరలో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీల ఎన్నికల నోటిఫికేషన్‌ రానుండటంతో కచ్చితంగా ఉమ్మారెడ్డిని ఎంపిక చేసి చైర్మన్‌ పదవి ఇస్తారని వెంకటేశ్వర్లు అనుయాయులు విశ్వసిస్తు న్నారు. మండలి చైర్మన్‌ పదవి ఎంత కీలకమైనదో… సీఆర్‌డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లుల విషయంలో అధికార పార్టీ ప్రత్యక్షంగా చవిచూసింది. మండలిలో ప్రతిపక్ష నేతగా రాజకీయ అనుభవజ్ఞుడైన యనమల రామకృష్ణుడు ఉన్నారు. మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ మండలిలోనే ఉన్నారు. అధికారపార్టీని ఇరుకున పెట్టగల నేర్పు, వ్యూహకర్త అయిన యనమల నేతృత్వంలో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవా లంటే సభా నిబంధనలపై పూర్తి అవగాహన, సభ్యులందరిపై పట్టు కల్గిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి సీనియర్‌ నేత ఎంపికే సరైన నిర్ణయమవుతుం దన్న భావన వైసీపీలోని మెజార్టీ సభ్యుల్లో వ్యక్తమవుతోంది. వచ్చే నెల జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్సీ పదవిలేని ఉమ్మారెడ్డిని చైర్మన్‌గా ఎన్నుకునే అవకాశం లేదు. వర్షాకాల సమావేశాలను డిప్యూటీ చైర్మన్‌తో నిర్వహించి, ఆ తర్వాత చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది. ఉమ్మారెడ్డికి చైర్మన్‌ ఖాయమనుకున్న పరిస్థితుల్లో డిప్యూటీ చైర్మన్‌ పదవి ఎస్సీ లేదా మైనార్టీ వర్గానికి కేటాయిస్తారు. ఈ పదవికి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మోషేన్‌ రాజు పేరు బలంగా వినపడుతోంది. జగన్‌ పార్టీ ప్రకటన తరువాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తొలి వ్యక్తిగా మోషేన్‌ రాజు అప్పట్లో గుర్తింపు పొందారు. ఆయన గత ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. అందుకే ఆయనకు ఇటీవల గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి కేటాయించారు. డిప్యూటీ చైర్మన్‌ రేసులో మోషేన్‌ రాజు పేరు వినపడుతోంది. మైనార్టీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీకి ఇవ్వాలని సీఎం భావిస్తే హిందూపురంలో నందమూరి బాలకృష్ణపై పోటీ చేసి ఓటమి చెందిన ఎండీ ఇక్బాల్‌కి అవకాశం దక్కుతుంది. ఆయన కూడా ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.మండలి చైర్మన్‌ పదవి ఓసీలకు కాకుండా ఎస్సీలకు ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తే ఎస్సీ ఎమ్మెల్సీల్లో సీనియర్‌, సమర్థుడు డొక్కా మాణిక్యవరప్రసాద్‌కి అవకాశం దక్కవచ్చని అంచనా వేస్తున్నారు. మరో వారంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img