Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

మంత్రుల నిష్క్రమణ

కేబినెట్‌ భేటీ తర్వాత సీఎం జగన్‌కు రాజీనామాల సమర్పణ
సొంత వాహనాల్లోనే ఇళ్లకు పయనం
11న కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం
సచివాలయంలో చురుగ్గా ఏర్పాట్లు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్ర మంత్రివర్గం మిడిల్‌ డ్రాప్‌ ప్రక్రియ విజయవంతమైంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి తొలుత చెప్పిన విధంగా, కొంత ఆలస్యమైనప్పటికీ పక్కాగా అమలు చేశారు. ఆమేరకు గురువారం మంత్రివర్గంలోని మొత్తం 24 మంది మంత్రులు రాజీనామాలు చేశారు. ఇదే వారికి చివరి సమావేశమైంది. సచివాలయంలో కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం సీఎం జగన్‌కు తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. సుమారు వీరంతా వెయ్యి రోజుల పాటు మంత్రి పదవులు అనుభవించారు. సాయంత్రం 3 గంటలకు అమరావతి సచివాలయంలో ఒకటవ బ్లాక్‌లో మంత్రివర్గ సమావేశానికి తమ లెటర్‌ హెడ్లతో హాజరైన మంత్రులు, సమావేశం ముగిసిన తర్వాత జగన్‌ కోరినట్లుగా రాజీనామా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కొద్దిసేపు వారితో సరదాగా మాట్లాడారు. మంత్రుల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తొలి విడత మంత్రివర్గంలో మీ అందరికీ అవకాశం ఇచ్చినట్లు సీఎం తెలిపారు. ఇప్పుడు మీరంతా పార్టీ బాధ్యతల్లోకి వెళ్తారని, మీకున్న విశేష అనుభవాన్ని పార్టీ కోసం వినియోగించుకోవాలని సూచించారు. అందరికీ జిల్లాల్లో పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడిరచారు. మంత్రులను ముందుగానే మానసికంగా సిద్ధం చేయడంతో వారు కూడా తమ పదవులు ఊడుతున్నాయన్న బాధ కనబర్చలేదు. గత మూడేళ్లుగా ప్రభుత్వంలో మాకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించామని మంత్రులు సీఎంకు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లామన్న సంతృప్తి మాలో ఉందని తెలియజేశారు. ఇక మిగిలిన రెండేళ్లపాటు ముఖ్యమంత్రి ఆదేశాలే శిరోధార్యంగా భావించి, పార్టీ కోసం పనిచేస్తామని, పార్టీని మరింత పటిష్టం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కూడా మంత్రులను పేరు పేరునా పలకరిస్తూ, అందరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. అయితే రాజీనామాల అంశం తనకు బాధాకరంగా ఉన్నప్పటికీ, ముందుగా చెప్పిన ప్రకారం పార్టీ కోసం తప్పడం లేదని మంత్రులతో వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు పనిచేసిన విధంగానే వచ్చే రెండేళ్లు కూడా పనిచేయాలని, పార్టీ అధికారంలోకి రాగానే మీకు మరలా మంచి భవిష్యత్‌ ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మంత్రులు బయటికి వచ్చేశారు. మంత్రులు చేసిన రాజీనామాల్ని జీఏడీ కార్యదర్శి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు స్వయంగా అందించనున్నారు. వాటికి వెంటనే ఆమోదముద్ర పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజీనామాల అనంతరం మంత్రులు తమ సొంత వాహనాల్లోనే సచివాలయం నుంచి వెళ్లిపోయారు. కేబినెట్‌ భేటీకి ముందు, తర్వాత కూడా మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, సీదిరి అప్పలరాజు ప్రభృతులు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. మంత్రివర్గంలో మీరు మళ్లీ కొనసాగే అవకాశం ఉందా ? అని ప్రశ్నించగా, తనకు తక్కువ అవకాశాలే ఉన్నాయని కొడాలి నాని వెల్లడిరచారు. అయితే కుల సమీకరణలు, సీనియారిటీలను పరిగణనలోకి తీసుకుని పాతవారిలో నలుగురైదుగురు కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. బొత్స సత్యనారాయణ మాత్రం మంత్రివర్గంలో ఎవరిని కొనసాగించాలనే విషయాన్ని సీఎం నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ఎవరికి ఎలాంటి బాధ్యత అప్పగించాలనే విషయంపై పార్టీ అధ్యక్షుడికి స్వేచ్ఛ ఉంటుందని, అలాగే మంత్రివర్గంలో ఎవరిని కొనసాగించాలనేది ఆయన ఇష్టమని తెలిపారు. పాత కేబినెట్‌ తరహాలోనే కొత్త మంత్రివర్గం కూడా సామాజిక సమీకరణల కూర్పుతో ఉంటుందని చెప్పారు. ఇక ఈనెల 11వ తేదీ కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకార ఉత్సవానికి మూహూర్తం ఖరారు కావడంతో ఆమేరకు సచివాలయంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి గవర్నర్‌కు కూడా సీఎం జగన్‌ ఇప్పటికే సమాచారం అందించడంతో పాటు, మంత్రుల ప్రమాణ స్వీకారానికి గవర్నర్‌ను అధికారికంగా ఆహ్వానించిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img