Friday, June 2, 2023
Friday, June 2, 2023

మరో కొత్త జిల్లా ?

. 27కి చేరనున్న ఏపీ జిల్లాల సంఖ్య
. మూడు జిల్లాలుగా అరకు
. లక్కీ నంబరు కోసమేనంటూ అధికారవర్గాల్లో చర్చ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఆవిర్భవించనుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని 2019 ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానం మేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి 25కి ఒకటి అదనంగా 26 జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం విదితమే. గత ఏడాది ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పాలన సైతం ప్రారంభం కాగా, ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం అధికారవర్గాలు సంబరాలు జరుపుకున్నాయి. అయితే భౌగోళికంగా అతిపెద్ద నియోజకవర్గమైన అరకు పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ప్రభుత్వం రెండు జిల్లాలుగా ఏర్పాటుచేసినప్పటికీ మిగిలిన జిల్లాలతో పోలిస్తే విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో, పాలనా సౌలభ్యం కోసం ఇందులోనే మరో జిల్లా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు డిప్యూటీ సీఎం రాజన్న దొర సమాచారాన్ని లీక్‌ చేశారు. దీంతో అరకు ఎంపీ సీటునే మరో జిల్లాగా విభజించబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఇందుకోసం ప్రభుత్వం తెరవెనుక కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోలవరం పరిధిలోకి వచ్చే గ్రామాలతో పాటు మరికొన్ని ప్రాంతాలను కలుపుతూ ఈ కొత్త జిల్లా ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. జలవనరులశాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలవరం ముంపు గ్రామాలతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని మీడియా సమావేశంలో చెప్పారు. ఈ అవకాశాన్ని వారికి ఇవ్వకుండా అధికారపార్టీ తొందరపడుతోంది. దీనినిబట్టి త్వరలో మరో కొత్త జిల్లా రావడం ఖాయమని స్పష్టమవుతోంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పాలనా సౌలభ్యమే లక్ష్యంగా ఈ జిల్లా ఏర్పాటు కానున్నట్లు అధికారపార్టీ నేతలు చెబుతుండగా, లక్కీ నెంబరు 9 కోసమే ప్రభుత్వం మరో జిల్లా ఏర్పాటుకు ఉత్సాహం చూపుతోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. వాస్తవానికి గతంలోనే మొత్తం 27 జిల్లాలు రాబోతున్నట్లు ప్రచారం జరిగింది. కాని చివరి నిముషంలో దీనిపై కసరత్తు చేసేందుకు అధికారులు కూడా బిజీగా ఉండటంతో ఈ ప్రతిపాదన తాత్కాలికంగా వాయిదా పడిరది. అరకు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపాం నియోజకవర్గాలతో పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటు కాగా, పాడేరు, అరకు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటైంది. కొత్త జిల్లా ఏర్పాటుతో ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో చీలిక రానుంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత దాదాపు 118 నియోజకవర్గాల పరిధిలో జరిగిన గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం చెందడాన్ని అధికారపార్టీ అధిష్ఠానం జీర్ణించుకోలేకపోతోంది. దీనికి లక్కీ నంబరును విస్మరిస్తూ జరిగిన జిల్లాల విభజనను ఒక కారణంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లక్కీ నంబరు 9 వచ్చేలా 27వ జిల్లా ఏర్పాటు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి నెలలో టోటల్‌ 9 వచ్చేలా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రూ.2,79,279.27 కోట్లతో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ పద్దును కూడా వారు ఉదహరిస్తున్నారు. ఏదిఏమైనా త్వరలోనే మరో కొత్త జిల్లా ఏర్పాటుతో ఏపీ జిల్లాల సంఖ్య 27కి చేరబోతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img