Friday, March 31, 2023
Friday, March 31, 2023

మరో సమరానికి సైరన్‌

. ఏపీలో 13, తెలంగాణలో 2 స్థానాలు
. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ షెడ్యూలు
. 23 వరకు నామినేషన్ల స్వీకరణ
. మార్చి 13న పోలింగ్‌`16న కౌంటింగ్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల సమరానికి తెరలేచింది. ఎన్నడూలేని విధంగా ఒకేసారి శాసనమండలిలో 14 స్థానాల ఎన్నికల నిర్వహణకు ఈసీ గురువారం షెడ్యూల్‌ విడుదల చేసింది. అందులో మూడు పట్టభద్రులు..రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలు.. ఎనిమిది స్థానిక సంస్థల కోటా నుంచి అభ్యర్థులు ఎన్నిక కావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఈ నెల 16న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 27 నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. మార్చి 13న పోలింగ్‌, 16న కౌంటింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు నియోజకవర్గంతో పాటుగా కడప-అనంతపురం-కర్నూలు నియోజకవర్గానికి షెడ్యూల్‌ విడుదలైంది. ఈ రెండు స్థానాల్లో ప్రస్తుతం సభ్యులుగా ఉన్న బాలసుబ్రమణ్యం..కత్తి నరసింహారెడ్డి మార్చి 29న పదవీ విరమణ చేయనున్నారు. మూడు పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాసుల రెడ్డి, కడప- అనంతపురం- కర్నూలు ఎమ్మెల్సీ గోపాలరెడ్డి, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ నేత మాధవ్‌ కూడా మార్చి 29న పదవీ విరమణ చేయనున్నారు. వీటితో పాటు స్థానిక సంస్థల నియోజకవర్గాలకు సంబంధించి 8 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ 8 సీట్లు టీడీపీకి చెందినవే. ఇందులో ఇద్దరు మార్చి 29, మరో ఆరుగురు మే 1వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. స్థానిక సంస్థల కోటాలో అనంతపురం నుంచి దీపక్‌ రెడ్డి, కడప నుంచి బీటెక్‌ రవి స్థానాల్లో ఎన్నిక జరగనుంది. నెల్లూరు నుంచి వాకాటి నారాయణరెడ్డి, పశ్చిమ గోదావరి నుంచి అంగర రామ్మోహన్‌ రావు, మంతెన వెంకట సత్యనారాయణ రాజు, తూర్పు గోదావరి నుంచి చిక్కాల రామచంద్రరావు, శ్రీకాకుళం నుంచి శత్రుచర్ల విజయరామ రాజు, చిత్తూరు నుంచి రాజనర్సింహులు, కర్నూలు నుంచి కేఈ ప్రభాకర్‌ అదే రోజు రిటైర్‌ కానున్నారు. ఈ స్థానాలకు మార్చి 13న పోలింగ్‌ జరగనుంది. వీటితో పాటు తెలంగాణలో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి, స్థానిక సంస్థల నియోజకవర్గానికి ఎన్నికల సంఘం అదే రోజు ఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూలు విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img