Friday, June 9, 2023
Friday, June 9, 2023

మళ్లీ ఐటీ దాడుల కలకలం

. తెలుగు రాష్ట్రాల్లో 40 బృందాల విస్తృత తనిఖీలు
. షాపింగ్‌ మాల్స్‌ లక్ష్యంగా సోదాలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి/హైదరాబాద్‌ : ఆదాయపు పన్ను శాఖ అధికారుల ఆకస్మిక దాడులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం కలకలం రేపాయి. గతంలో రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, సినిమా రంగానికి చెందిన వివిధ నిర్మాణ సంస్థలలో దాడులు నిర్వహించిన ఐటీ అధికారులు తాజాగా ప్రముఖ షాపింగ్‌ మాల్స్‌ లక్ష్యంగా దాడులు నిర్వహించారు. వీటిలో కూడా అన్నీ వస్త్ర దుకాణాలు కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని ముఖ్యమైన అన్ని నగరాల్లో బ్రాంచిలు కలిగిన కళామందిర్‌, కాంచీపురం సిల్క్‌, కె.ఎల్‌.ఎమ్‌ ఫ్యాషన్‌ మాల్‌, వరమహాలక్ష్మి వంటి షాపింగ్‌ మాల్స్‌ కార్యాలయాలు, యజమానులు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. ఐటీ అధికారులు సుమారు 40 బృందాలుగా ఏర్పడి తెల్లవారుజామునుంచే సోదాలు ప్రారంభించారు. ఉదయం 6 గంటలకే డైరెక్టర్ల ఇళ్లకి చేరుకున్న ఐటీ అధికారులు, అడుగడుగునా విస్తృత తనిఖీలు నిర్వహించారు. చాలా షాపింగ్‌ మాల్స్‌ యజమానులు ఆదాయపు పన్ను శాఖకు చెల్లించాల్సిన పన్ను చెల్లించకుండా, పెద్దమొత్తంలో ఎగరవేస్తున్నారన్న ఆరోపణలపై ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ఐటీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. బుధవారం కూడా ఈ దాడులు కొనసాగే అవకాశం ఉంది. తనిఖీలు పూర్తయిన అనంతరం అధికారులు వివరాలు వెల్లడిరచనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img