Monday, January 30, 2023
Monday, January 30, 2023

మళ్లీ తొక్కిసలాట

ముగ్గురి మృతి… 13 మందికి గాయాలు
గుంటూరు చంద్రన్న కానుక పంపిణీలో అపశ్రుతి

. మాదే నైతిక బాధ్యత: ఉయ్యూరు ఫౌండేషన్‌
. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఆర్ధిక సాయం

విశాలాంధ్రగుంటూరు కార్పొరేషన్‌: గుంటూరులోని వికాస్‌ నగర్‌లో ఉయ్యూరు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్‌ జనతా వస్త్రాలు చంద్రన్న సంక్రాంతి కానుక కిట్‌ల పంపిణీ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. చంద్రబాబు సభ ముగిసి ఆయన వెళ్లిపోయిన తర్వాత సభా ప్రాంగణంలో కానుకలు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. సుమారు 30వేల మందికి కానుకల పంపిణీకి 24 కౌంటర్లు ఏర్పాటు చేశారు. సభకు హాజరైన మహిళలందరికి ఫౌండేషన్‌ వారు ముందుగానే టోకెన్లు పంపిణీ చేశారు. టోకెన్లతో హాజరైన వారిని మాత్రమే సభా ప్రాంగణంలోని గ్యాలరీలలోకి అనుమతించారు. చంద్రబాబు ప్రసంగం అనంతరం ఆయన కాన్వాయ్‌ సభా ప్రాంగణం నుండి వెళ్లిపోయిన తర్వాత ఫౌండేషన్‌ నిర్వాహకులు, వలంటీర్లు కానుకల పంపిణీకి సిద్ధమయ్యారు. దీని కోసం సభా ప్రాంగణం వద్ద సుమారు 24 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే కానుకల కోసం మహిళలు క్రమపద్దతిని అనుసరించక పోవడంతో అక్కడ కొంత తోపులాట చోటుచేసుకుంది. వెనుక ఉన్న మహిళలు ఒక్కసారిగా ముందు తోసుకురావడంతో నిర్వాహకులు అదుపు చేయలేకపోయారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా అనేక మంది స్పృహ కోల్పోయారు. మరికొందరు గాయాలపాలయ్యారు. పరిస్థితిని గుర్తించిన వలంటీర్లు, పోలీసులు స్పందించి గాయపడిన వారిని గుంటూరు నగరంలోని అనేక వైద్యశాలలకు తరలించారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో గోపిదేశి రమాదేవి, షేక్‌ మస్తాన్‌ బీ, సయ్యద్‌ ఆసీయా మరణించగా, ఐదుగురు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో, మరో ఆరుగురు నగరంలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల రెడ్డి, జిల్లా ఎస్పీ ఆరిప్‌ హఫీజ్‌ సందర్శించారు. పరిస్థితిని సమీక్షించి, సహాయకచర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలను అందించాలని జిల్లా కలెక్టర్‌ వైద్యులను ఆదేశించారు. ఘటనపై వివిధ పార్టీల నేతలు విచారం వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు: ఉయ్యూరు ఫౌండేషన్‌
నిబంధనల ప్రకారం అన్నిరకాల అనుమతులు తీసుకొని ఎవరికీ అసౌకర్యం కలగని రీతిలో కానుకల పంపిణీకి ఏర్పాట్లు చేశామనీ ఉయ్యూరు ఫౌండేషన్‌ అధినేత శ్రీనివాసరావు తెలిపారు. అయితే ముందుగా టోకెన్‌లు జారీ చేసిన వారికంటే అదనంగా ప్రజానీకం ఒక్కసారిగా లోపలకు రావటంతో ఈ అపశృతి చోటుచేసుకున్నదని చెప్పారు. ఈ దుర్ఘటనకు పూర్తి నైతిక బాధ్యత ఉయ్యూరు ఫౌండేషన్‌ వహిస్తుందన్నారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారికి ఫౌండేషన్‌ తరపున సంతాపం తెలియజేస్తూ, ఒక్కొక్కరికి రూ.20 లక్షల వంతున ఆర్థిక సహాయం అందచేస్తామనీ, గాయపడిన వారికి కూడా ఫౌండేషన్‌ అన్నీ విధాల అండగా వుంటుంది.
ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి
ఈ ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేదలకు కానుకలు ఇచ్చేందుకు ఉయ్యూరు ఫౌండేషన్‌ నిర్వహించిన కార్యక్రమంలో తాను పాల్గొన్నానని చంద్రబాబు నాయుడు చెప్పారు. కార్యక్రమం ముగిసి తాను వెళ్లిన అనంతరం జరిగిన ఘటనలో ముగ్గురు చనిపోవడం బాధాకరం అని చంద్రబాబు అన్నారు. పేదలకు ఆ స్వచ్ఛంద సంస్థ చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించాలి అనే ఆలోచనతో తాను కార్యక్రమానికి వెళ్లాను అని చంద్రబాబు తెలిపారు. పేదల ఇళ్లలో జరిగిన ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని…ఘటన దురదృష్టకరమని అన్నారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు.
ఘటన విచారకరం: జంగాల
గుంటూరు నగరంలో చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీలో తొక్కిసలాట చోటుచేసుకొని ముగ్గురు మృత్యువాత పడటం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌ కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ఇటువంటి అనుభవాలు ఉన్నప్పటికి గుంటూరులో జరిగిన చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలో తీసుకోవడంలో విఫలమైందన్నారు.
మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన సీపీఎం
గుంటూరు టీడీపీ సంక్రాంతి కానుక వస్త్రాల పంపిణీ తొక్కిసలాటలో ముగ్గురు చనిపోవడం పట్ల మృతుల కుటుంబాలకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో నిఘా యంత్రాంగం వైఫల్యం కనిపిస్తోందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img