Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

మళ్లీ వంటగ్యాస్‌ బాదుడు

సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.25 పెంపు
వాణిజ్య సిలిండర్‌ ధర రూ.75 పెంపు
రెండు నెలల్లో వరుసగామూడోసారి భారం
ఏడేళ్లలో గ్యాస్‌ ధర రెట్టింపునకు పైనే పెంపు

న్యూదిల్లీ : మోదీ సర్కారు మరోసారి ప్రజలపై భారమేసింది. సబ్సిడీ గ్యాస్‌ సహా దేశవ్యాప్తంగా అన్ని కేటగిరీలకు చెందిన వంటగ్యాస్‌ ధరను బుధవారం మరో రూ.25 పెంచింది. కేవలం రెండు నెలల వ్యవధిలో వంటగ్యాస్‌ ధర పెంచడం ఇది మూడోసారి. ఇప్పటికే పెట్రోలు, డీజిలు, నిత్యావసర వస్తువుల ధర పెరుగుదలతో అతలాకుతలమవుతున్న పేదలు, సామాన్యులు, మధ్యతరగతిపై గ్యాస్‌ భారం మోపింది. తాజాగా పెంచిన ధరతో దిల్లీలో వంటగ్యాస్‌ సిలిండర్‌(14 కేజీలు) ధర రూ.884.50కి చేరింది. సబ్సిడీ, సబ్సిడీయేతర గ్యాస్‌ సిలిండర్‌ ధరను జులై 1వ తేదీన రూ.25.50 పెంచింది. ఆగస్టు 1వ తేదీన సబ్సిడీయేతర గ్యాస్‌ బండ ధరను మరో రూ.25 పెరిగింది. ఆగస్టు 18న అదేవిధంగా ధర పెంచేసింది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ఆగస్టు 1వ తేదీన సబ్సిడీ గ్యాస్‌ ధర పెంచలేదని పరిశ్రమ వర్గాలు వెల్లడిరచాయి. సమావేశాల సమయంలో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తాయన్న భయంతోనే మోదీ సర్కారు అప్పుడు ధర పెంచలేదు. తాజాగా పెంచిన ధరతో జనవరి 1వ తేదీ నుంచి వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.190 పెరిగింది. ప్రతి ఇంటికీ ఏడాదికి సబ్సిడీ కింద లేదా మార్కెట్‌ ధర కన్నా తక్కువగా 12 సిలిండర్లు సరఫరా చేస్తామని మోదీ సర్కారు ప్రకటించింది. దీనికి మించితే సబ్సిడీ లేకుండా ఎన్ని సిలిండర్లయినా కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. నెలవారీ గ్యాస్‌ ధర పెంచడంతో పాటు సబ్సిడీని సైతం మోదీ సర్కారు ఎత్తివేసింది. దాదాపు 2020 మే నాటికి సబ్సిడీని కేంద్రం తొలగించింది. ఏదో మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైనా కొంతమేరకు సబ్సిడీ అమలు జరుగుతుందేమో కానీ ప్రధాన నగరాల్లో సబ్సిడీకి ఎప్పుడో చెల్లుచీటి చెప్పేసింది. గడచిన ఏడేళ్లలో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రెట్టింపు కన్నా ఎక్కువైంది. 2014 మార్చి 1వ తేదీనాటికి వంటగ్యాస్‌ ధర రూ.410 మాత్రమే. తాజా పెరుగుదలతో ముంబైలో సిలిండర్‌ ధర రూ.884.50కు చేరగా కోల్‌కతాలో రూ.911కి పెరిగింది. నాలుగు ప్రధాన మెట్రో నగరాల్లో గ్యాస్‌ అధికమైంది.
మరోవైపు, 19 కేజీల వాణిజ్య వినియోగానికి సంబంధించిన గ్యాస్‌ సిలిండర్‌ ధరను మరో రూ.75 పెంచింది. దీంతో దిల్లీలో వాణిజ్య గ్యాస్‌ బండ ధర రూ.1693కి చేరింది. వారం రోజులుగా పెట్రోలు, డీజిలు ధరలు పెంచకపోగా పెట్రోలుపై నాలుగు పైసలు, డీజిలుపై 14 పైసలు తగ్గించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img