భారీ వర్షాలు, వరదల్లో 138 మంది మృతి
రాయ్‌గఢ్, సతారా జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడి ప్రాణనష్టం
సురక్షిత ప్రాంతాలకు 90 వేల మంది తరలింపు
మహారాష్ట్రను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలకు సంభవిం చిన వరదలు, కొండ చరియలు విరిగి పడిన ఘటనల్లో కనీసం 138 మంది మరణించారు. కొల్హాపూర్ జిల్లాలో 40 వేల మంది సహా సుమారు 84,452 మందిని పశ్చిమ మహారాష్ట్రకు చెందిన పూణే డివిజన్‌లోని సురక్షిత ప్రాంతాల కు తరలించినట్లు అధికారులు తెలి పారు. రాష్ట్ర రాజధాని ముంబైకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలోని రాయ్‌గడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక జిల్లాలు, ప్రత్యేకించి కొంకణ్ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ వరదల ఉధృతి, కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో వేలాదిమంది చిక్కుకున్నారు. మహారాష్ట్ర విపత్తు నిర్వహణ, పునరావాస శాఖ మంత్రి విజయ్ వాడేటివార్ మాట్లాడుతూ ‘రాష్ట్రంలో వర్షాలు, వరదలకు సంబంధించిన ఘటనల్లో 138 ప్రమాదకర మరణాలు చోటుచేసుకున్నాయి’ అని తెలిపారు. కాగా పశ్చిమ మహారాష్ట్ర సతారా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతంలో అనేక మంది ప్రజలు వరదల్లో కొట్టుకుపోయారని అధికారులు చెబుతున్నారు. సతారాలో 27 మంది మృతి చెందినట్లు అధికారికంగా ధ్రువీకరించారు. అలాగే చంద్రపూర్, గొండియా వంటి పశ్చిమ జిల్లాల నుంచి ఇతర మరణాలు నివేదించినట్లు ఆయన చెప్పారు. ‘రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలలో వర్షపాతం భారీగా నమోదయిందని, దీంతో వేర్వేరు ప్రాంతాలలోని డ్యామ్‌లు ఉప్పొంగుతుం డటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. కొల్హాపూర్‌లో కనీసం 54 గ్రామాలు పూర్తిగా వరద ముంపులో చిక్కుకున్నాయి. అయితే 821 గ్రామాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు వివరించారు. ఇక్కడ పంచగంగా నది 2019లో వరదలు
పెరిగిన దానికంటే ఇప్పుడు అధిక స్థాయిలో ప్రవహిస్తోందని అన్నారు. రాయ్‌గడ్‌తోపాటు గురువారం రాత్రి సతారా జిల్లాలో మీర్గావ్, అంబేఘర్ గ్రామాలలో కొండ చరియలు విరిగిపడ్డాయి. కాగా ఇప్పటికే రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాలలో జాతీయ విపత్తు నిర్వహణ దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్), రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం(ఎస్‌డీఆర్‌ఎఫ్), ఇతర సంస్థలు సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి. అలాగే భారత నావిక, వైమానిక దళాలకు చెందిన ఆరు బృందాలు కూడా శనివారం సహాయక చర్యలు చేపడతాయని భావిస్తున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాయ్‌గడ్, రత్నగిరి, పాల్ఘార్, థానే, సింధుదుర్గ్, కొల్హాపూర్, సంఫ్లీు, సతారా జిల్లాల్లో వరదలు సంభవించాయి.
రాయ్‌గడ్ బాగా దెబ్బతింది : డిప్యూటీ సీఎం అజిత్ పవార్
రాష్ట్రంలో భారీ వర్షాలకు సంభవించిన వరదలు, కొండ చరియలు విరిగి పడిన ఘటనల్లో కనీసం 76 మంది మరణించగా, మరో 59 మంది గల్లంతయినట్లు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ శనివారం తెలిపారు. ఈ ఘటనల్లో 38 మంది గాయపడినట్లు వివరించారు. వర్షాలకు రాయ్‌గడ్ జిల్లా బాగా దెబ్బతిన్నదని, గురువారం తాలియే గ్రామంలో కొండ చరియలు విరిగిన పడిన ఘటనలో 37 మందితో సహా మొత్తం 47 మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. పూణేలో పవార్ విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు తొమ్మిది జిల్లాల నుంచి 90 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన 21 బృందాలు, సైన్యం, తీర ప్రాంత గస్తీకి చెందిన 14 బృందాలు కలిసి పని చేస్తున్నాయని అన్నారు. వీరితోపాటు నాలుగు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ములాషి, జున్నార్, వెల్హాల్లో ఒక్కొక్క ప్రాంతంతోపాటు బోహోర్‌లో మూడు, ఖేద్‌లో రెండు, మవల్‌లో రెండు, అంబేగావ్‌లో ఐదు ప్రాంతాలతో సహా పూణే జిల్లాలోని 23 ప్రాంతాలలో కొండ చరియలు విరిగిపడ్డాయని అన్నారు. ఈ ప్రాంతాలలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. ‘శనివారం ఉదయం వరకు మొత్తం 76 మంది మరణించారు. రాయ్‌గడ్‌లో 47 మంది సహా సతారాలో ఆరుగురు, ముంబై, దాని సమీప ప్రాంతాలలో నలుగురు, పూణేలో ఒకరు, రత్నగిరిలో 11 మంది, కొల్హాపూర్‌లో ఐదుగురు, సింధుదుర్గ్‌లో ఇద్దరు ఉన్నారు. ఇక రాయ్‌గడ్‌లో మరో 53 మంది, సతారాలో నలుగురు, థానలో ఇద్దరు గల్లంతయ్యారు’ అని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం, అలాగే కేంద్రం రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించాయని అన్నారు. వరద బాధిత ప్రాంతాలలోని ప్రజలకు రేషన్ కిట్‌లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఇదిలాఉండగా సతారా జిల్లాలోని అంబేఘర్ గ్రామంలో కొండ చరియలు విరిగిపడిన ప్రాంతం నుంచి ఐదు మృతదేహాలను వెలికి తీసినట్లు ఒక అధికారి వివరించారు. పటాన్ తెప్‌ాస్లి వద్ద ఉన్న ఈ గ్రామంలో కొండ చరియలు కనీసం 16 మంది చిక్కుకున్నారని అనుమానిస్తున్నారు. ఈ శిథిలాల కింద నాలుగైదు ఇళ్లు కూరుకుపోయాయి.