Friday, December 1, 2023
Friday, December 1, 2023

మహిళా సాధికారతే లక్ష్యం

కోవిడ్‌తో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం
అయినా సంక్షేమ పథకాల వల్ల తట్టుకున్నాం
ఎంఎస్‌ఎంఈలు, కౌలు రైతులకు ప్రాధాన్యత ఇవ్వండి
బ్యాంకర్ల సహకారమే కీలకమన్న సీఎం జగన్‌

అమరావతి : మహిళా సాధికారిత సాధనే లక్ష్యంగా పని చేస్తున్న ప్రభుత్వానికి బ్యాంకర్లు సహకరించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో గురువారం స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైఎస్సార్‌ చేయూత ద్వారా మహిళలు గణనీయంగా లబ్ధి పొందుతున్నారని, నాలుగేళ్లపాటు ఏడాదికి రూ.18,750 చొప్పున వివక్షకు తావులేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్నవారికి అందజేస్తున్నామన్నారు. మహిళలకు సరైన మార్గనిర్దేశం చేస్తే, ఈ డబ్బును పెట్టుబడిగా పెట్టుకుని క్రమం తప్పకుండా ఉపాధి పొందుతారన్నారు. చేయూత కింద ఇప్పటికే రెండుసార్లు నగదు అందించామని, మరో రెండుసార్లు ఇవ్వనున్నందున బ్యాంకర్లు ఈ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. మహిళ చేతిలో పెట్టే డబ్బు బ్యాంకర్ల సహకారంతో ఆస్తులుగా మారి, వారికి ఉపాధి అందాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. కోవిడ్‌ విపత్తు కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించిందని, పంపిణీ వ్యవస్థ, ఉపాధి మార్గాలు దెబ్బతిన్నాయని అన్నారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. గడచిన 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా దేశంలో పన్నుల ఆదాయం మొత్తం 3.38 శాతం తగ్గడంతో దేశ జీడీపీ వృద్ధి రేటు 7.25 శాతం మేర పడిపోయినట్లు వివరించారు. మొదటి త్రైమాసికంలో 24.43 శాతం మేర జీడీపీ వృద్ధి రేటు పడిపోయిందని, ఇటువంటి క్లిష్ట సమయంలో బ్యాంకర్ల సహకారం కారణంగా దేశంతో పోలిస్తే ఏపీ సమర్థవంతమైన పనితీరు చూపిందనే చెప్పొచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. 2020-21లో దేశ జీడీపీ 7.25 శాతం మేర తగ్గితే, ఏపీలో 2.58 శాతానికి పరిమితమైందని, ఇందులో కీలక పాత్ర పోషించిన బ్యాంకర్లను అభినందిస్తున్నానని సీఎం అన్నారు.
ఎంఎస్‌ఎంఈలు, కౌలు రైతుల రుణాలపై ప్రత్యేక దృష్టి
కౌలు రైతులకు రుణాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం కోరారు. పంటను సాగుచేసే వారిలో ఎక్కువమంది కౌలు రైతులేనని, వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యే ప్రతి ఒక్కరికీ పంట రుణాలు అందజేయడం మన బాధ్యత అని అన్నారు. రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించామని, ఇవి విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతులను ముందుండి నడిపిస్తాయని తెలిపారు. దేశంలో ఆదర్శ రాష్ట్రంగా ఏపీని చూపించగలగాలని, ఆర్బీకేలను తమవిగా భావించి, సంపూర్ణ డిజిటలైజేషన్‌కు ప్రతిరూపాలుగా వాటిని బ్యాంకర్లు తీర్చిదిద్దాలని సీఎం కోరారు. ఇక 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలిచ్చి, తొలివిడతగా 15 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించినందున, దీనికి కూడా బ్యాంకర్లు ఆర్థిక సహకారం అందించాలన్నారు. అదేవిధంగా ఎంఎస్‌ఎంఈలకు, జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు అందజేసే విషయంపై దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో క్యాంప్‌ కార్యాలయం నుంచి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, కురసాల కన్నబాబు, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, నాబార్డు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సుధీర్‌ జన్నావర్‌, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ వి.బ్రహ్మానందరెడ్డి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వర్చువల్‌గా ఆర్‌బీఐ రీజనల్‌ డైరెక్టర్‌ కె.నిఖిల, యూబీఐ ఈడీ దినేష్‌ కుమార్‌ గార్గ్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img