రాకేశ్ టికాయత్
రైతులందరూ శాంతియుతంగా ఉంటూ.. తమ తమ వ్యవసాయ పనుల్లో మునిగిపోవాలని రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ కోరారు.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీతో నిరసన చేస్తున్న రైతులందరూ ఇళ్ల బాట పట్టారు. ఇందులో భాగంగా ఘాజిపూర్, సింఘూ, టిక్రి బోర్డర్లను విడిచి రైతులు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. అక్కడ వేసిన టెంట్లను తొలగించేశారు. టిక్రి బోర్డర్ వద్ద రైతులు సంబరాలు చేసుకున్నారు. చిందులు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆందోళన చేపడుతున్న అన్ని ప్రదేశాల నుంచి టెంట్లను తొలగించారు.ఘాజీపూర్ బోర్డర్ వద్ద రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ మీడియాతో మాట్లాడారు. ఆందోళన సమయంలో సహకరించిన వారిని కలుస్తామన్నారు. ఇప్పటికే అన్ని బోర్డర్ల నుంచి రైతులు ఖాళీ చేస్తున్నారని, డిసెంబర్ 15వ తేదీన ఈ ప్రాంతం నుంచి వదిలి వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.తమకు కేంద్రంతో ఎలాంటి గొడవా లేదని స్పష్టం చేశారు. అయితే ఇచ్చిన మాటపై నిలబడకుంటే మాత్రం మరోసారి ఉద్యమం చేపట్టడం మాత్రం ఖాయమని, అందులో అనుమానాలే లేవని టికాయత్ తేల్చి చెప్పారు. జనవరి 15 న సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం జరగబోతోందని, ఈ లోగా హర్యానా ముఖ్యమంత్రితో సహా మరికొంత మంది ముఖ్యమంత్రులతో భేటీ అవుతామని ప్రకటించారు. అయితే యూపీ ఎన్నికల్లో ఎలాంటి విధానాన్ని అవలంబించాలన్న విషయంపై మాత్రం ఇతరులతోనూ చర్చిస్తామని టికాయత్ తెలిపారు.