Monday, January 30, 2023
Monday, January 30, 2023

మాతోనే మహిళా సాధికారత

ఇందుకోసం రెండున్నరేళ్లలో ఎంతో చేశాం
ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ప్రాధాన్యతిచ్చాం
నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50శాతం వారికే
జనవరి 9నుంచి ఈబీసీ నేస్తం
అసెంబ్లీలో సీఎం జగన్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : మహిళా సాధికారతే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం ఎందాకైనా వెళతామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మహిళా సాధికారతపై అసెంబ్లీలో చర్చ జరిగింది. సభ్యులు మాట్లాడిన తర్వాత సీఎం జగన్‌ దీనిపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. రెండున్నరేళ్లలో మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం చేసిన పనులు, కార్యక్రమాలను సమగ్రంగా వివరించారు. అక్కచెల్లెమ్మల జీవితాలు బాగుపడాలని మనసా, వాచా ఆరాటపడుతున్న ప్రభుత్వం తమదని సీఎం జగన్‌ చెప్పారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణాత్మకంగా మహిళా సాధికారత సాధనకు కృషి చేశామన్నారు. దీనినొక విప్లవాత్మక కార్యక్రమంలా చేపట్టి…మహిళలను విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఎదిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి వృద్ధుల వరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లలను బడికి పంపిన 45లక్షల మంది తల్లులకు, 85 లక్షల మంది పిల్లలకు ఏటా రూ.6,500 కోట్లు సాయమందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 61.73 లక్షల పెన్షన్లు ఇస్తుండగా, వాటిలో కేవలం వృద్ధ, ఒంటరి మహిళలు 36.70 లక్షల మంది ఉన్నారన్నారు. ఇందుకోసం నెలకు రూ.1500 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని, సూర్యోదయం కంటే ముందే పెన్షన్‌ను వారి చేతుల్లో పెడుతున్నామని జగన్‌ వివరించారు. వైఎస్సార్‌ ఆసరా కింద 78 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో 25వేల కోట్లు అందజేస్తున్నామన్నారు. ఇవిగాక సున్నావడ్డీ కింద కోటిమంది మహిళలకు రూ.2,354 కోట్లు, వైఎస్సార్‌ చేయూత ద్వారా 18,750 రూపాయలను నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేసి ఆర్థికంగా చేయూతనిచ్చామని వివరించారు. వైఎస్సార్‌ జగనన్న కాలనీల ద్వారా మహిళా సాధికారితను మరో అడుగు ముందుకు తీసుకెళ్లామని, దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 31 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13వేల పంచాయతీలుండగా,17వేల జగనన్న కాలనీలు కొత్తగా ఏర్పాటుకానుండటాన్ని ఓ చారిత్రక కార్యక్రమంగా జగన్‌ అభివర్ణించారు. వైఎస్సార్‌ చేయూత ద్వారా 24.56 లక్షల మందికి రూ.8,944 కోట్లు, కాపు నేస్తం ద్వారా 3.28 లక్షల మందికి రూ.982 కోట్లు, జగనన్న విద్యాదీవెన ద్వారా 18.81లక్షల మందికి పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి రూ.5,573కోట్లు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం ద్వారా 30.16లక్షల మందికి లబ్ధి చేకూరుస్తున్నట్లు వివరించారు. మరోవైపు మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ దిశచట్టం రూపొందించామని, ప్రత్యేకంగా పోలీస్‌స్టేషన్లు, దిశా యాప్‌ తీసుకొచ్చామన్నారు. మద్య నియంత్రణ కోసం పూర్తిగా బెల్ట్‌షాపులు తొలగించి, మద్యం పట్టుకుంటే మందుబాబులకు షాక్‌ కొట్టేలా ధరలు పెంచామన్నారు. మహిళల భద్రత కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసు వ్యవస్థను తీసుకురావడం, నామినేటెడ్‌ పోస్టులు, పనుల్లో మహిళలకు 50శాతం పదవులు ఇస్తున్నామని చెప్పారు. ఇటీవల దాదాపు 202 మందికి నామినేటెడ్‌ కార్పొరేషన్ల చైర్మన్‌ పదవులివ్వగా, వారిలో 102 మంది మహిళలున్నారని, 13 జిల్లా పరిషత్‌ చైర్మన్‌లలో ఏడుగురు, మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేషన్‌ మేయర్లు, డైరెక్టర్లలో అన్నింటిలోనూ సగానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మహిళలకు ప్రాధాన్యతనిచ్చామని, చివరకు గ్రామ వలంటీర్లు కూడా 53 శాతం మంది మహిళలేనన్నారు. ఓసీల్లో పేద మహిళలున్నారని, వారిని ఆదుకునేందుకు తాను పాదయాత్ర ముగించిన రోజైన జనవరి 9వ తేదీన ఈబీసీ నేస్తం అనే కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మహిళా పక్షపాత ప్రభుత్వంగా మనం అమలు చేస్తున్న కార్యక్రమాల ద్వారా 21వ శతాబ్దపు భారతీయ మహిళ ఏపీ నుంచే ఆవిర్భవిస్తుందని సగర్వంగా తెలియజేస్తున్నానని జగన్‌ అన్నారు. చంద్రబాబు ఇవన్నీ వింటే బాగుండేదని, సభకు వస్తారని ఆలస్యం చేసినా రాలేదని, అయినా టీవీ చూస్తూ ఉంటారని ఆశిస్తున్నానన్నారు. తొలుత మహిళా, శిశు సంక్షేమ మంత్రి తానేటి వనిత తమ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం చేసిన కృషిని వివరించగా, ఈ చర్చలో శాసనసభ్యులు ఆర్కే రోజా, ధనలక్ష్మీ, విడదల రజనీ, డాక్టర్‌ దాసరి సుధ, టీడీపీ ఎమ్మెల్యే భవానీ తదితరులు పాల్గొని ముఖ్యమంత్రి మహిళా పక్షపాతి అని కొనియాడారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img