Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

మాపై ఎందుకింత నిర్లక్ష్యం?

సమ్మె చేస్తున్నా స్పందనలేని ప్రభుత్వంపై కార్మికుల ఆగ్రహం
నాల్గవ రోజూ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, అర్ధనగ్న ప్రదర్శనలు
మున్సిపల్‌ కార్మికుల సేవలను ప్రత్యేక దృష్టితో చూడాలి: బీవీ రాఘవులు
సీఎం హామీలే అమలు చేయమని కోరుతున్నాం: సుబ్బారాయుడు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: మున్సిపల్‌ కార్మికుల సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలు కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మె గురువారం నాల్గవరోజుకి చేరుకుంది. దీంతో అన్ని మున్సిపాలిటీల్లో ఎక్కడి చెత్త అక్కడ గుట్టలుగా పేరుకుపోయింది. మరో పక్క ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ ప్రభుత్వం సమ్మె విరమణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. తాము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయమని మాత్రమే కోరుతున్నామని, అవి కూడా మూడేళ్లు ఓపిక పట్టి అనివార్య పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వచ్చిందని నేతలు పేర్కొన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో కార్మికులకు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు సంఫీుభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులు అందరికీ పీఆర్‌సీ ద్వారా వేతనాలు పెంచినప్పటికీ మున్సిపల్‌ కార్మికుల సేవలను ప్రత్యేక దృష్టితో చూడాలని అన్నారు. మున్సిపల్‌ కార్మికులకు ఉద్యోగులు అందరితోపాటు పీఆర్‌సీ రూ.3వేలు పెంచి, హెల్త్‌ ఆలవెన్సులు రూ.6వేలు కోత పెట్టడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. అకాల వర్షాలతో రాష్ట్రంలో వరదలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని, అంటురోగాలు ప్రబలకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యతను దృష్టిలో పెట్టుకుని కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ‘మున్సిపల్‌ కార్మికుల సమస్యలు విన్నాను, నేను ఉన్నాను’ అన్న ముఖ్యమంత్రికి నాలుగు రోజులుగా వారు సమ్మె చేస్తున్నా కనిపించడం లేదా.. అని ప్రశ్నించారు. కార్మికులను బెదిరించడం మానుకుని, వారి న్యాయమైన సమస్యలను తక్షణం పరిష్కరించాలని, లేకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్‌ కార్మిక, ఉద్యోగ సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(జేఏసీ) కన్వీనర్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారాయుడు మాట్లాడుతూ, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కలుగజేసుకుని కోతలు లేని వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికులు గొంతెమ్మ కోర్కెలు, కొత్త కోర్కెలు ఏమీ కోరడం లేదని, కోతలు లేని వేతనాల కోసం పోరాటం చేస్తున్నామన్నారు. కార్మికులకు ప్రభుత్వం ఎందుకు కనీస వేతనాలు ఇవ్వటంలేదని, నాలుగు రోజులుగా రోడ్డెక్కి పోరాటం చేస్తున్నా సానుకూలంగా స్పందించటంలేదన్నారు. సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి మున్సిపల్‌ కార్మికులను సచివాలయానికి పరిమితం చేస్తున్న ప్రభుత్వం, సచివాలయ సిబ్బందిలాగే వారిని కూడా ఎందుకు రెగ్యులరైజ్‌ చేయటంలేదని ప్రశ్నించారు. సచివాలయ సిబ్బందిని రెండేళ్లకే రెగ్యులరైజ్‌ చేసిన ప్రభుత్వం మూడు, నాలుగు దశాబ్దాలుగా విశేష సేవలు అందిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న మున్సిపల్‌ కార్మికులను కూడా రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కరోనా సమయంలో విశేష సేవలు చేసిన మున్సిపల్‌ పారిశుధ్య, ఇతర కార్మికులకు దండలు వేసి, సన్మానాలు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రాకపోవటం ఏవిధంగా న్యాయమని నిలదీశారు. మాటతప్పను, మడమ తిప్పను అని చెప్పుకునే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ప్రతి కార్మికునికి రూ.21వేలు వేతనం ఇవ్వాలన్నారు. వాగ్ధానాలు, జీవోలు అమలు చేయకుండా సమ్మెలో ఉన్న వేలాది మంది కార్మికులను బెదిరించటం దుర్మార్గమన్నారు. మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర సలహదారులు నెక్కంటి సుబ్బారావు, రాష్ట్ర నాయకులు ఆసుల రంగనాయకులు, జేమ్స్‌, సీపీఎం రాష్ట్ర నాయకులు సీహెచ్‌ బాబూరావు, దోనేపూడి కాశీనాథ్‌, సీఐటీయూ నగర నాయకులు డేవిడ్‌, జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంలో అర్ధనగ్న ప్రదర్శన
మున్సిపల్‌ కార్మికుల రాష్ట్రవ్యాపిత సమ్మెలో భాగంగా ఇబ్రహీంపట్నంలో కార్మికులు ఐదు కిలోమీటర్లకు పైగా వినూత్నంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. పెర్రిలో ఉన్న మున్సిపల్‌ సబ్‌ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన పురవీధుల గుండా తిరిగి రింగ్‌ సెంటరుకు చేరుకుని గాంధీ బొమ్మ సెంటరులో సభ నిర్వహించారు. ఏఐటీ యూసీ ఎన్టీఆర్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు సీహెచ్‌ కోటేశ్వర రావు కార్మికులకు సంఫీుభావం తెలియజేసి ప్రదర్శన, సభలో పాల్గొన్నారు. గుడివాడ మున్సిపల్‌ కార్యాలయం వద్ద కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఏఐటియుసి నాయకుడు గూడపాటి ప్రకాశ్‌బాబు, సీఐటీయూ నాయకుడు ఆర్‌సీసీ రెడ్డి తదితరులు పాల్గొ న్నారు. జగ్గయ్యపేట, నందిగామ, వైఎస్సార్‌ తాడిగడప మున్సిపల్‌ కార్యాలయాల వద్ద కూడా కార్మికులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ఏలూరులో సమ్మె ఉద్రిక్తం
మున్సిపల్‌ కార్మికుల సమస్య పరిష్కారానికి చేస్తున్న సమ్మెకు సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌ మద్దతు ప్రకటించారు. మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన సమ్మె 4వ రోజు ఏలూరు జిల్లాలో ఉద్రిక్తంగా మారింది. ఏలూరు జిల్లా ప్రధాన కేంద్రంలో ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు పుప్పాల కన్నబాబును పోలీ సులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా కార్మికులు అడ్డుకోవడంతో విరమించారు. నూజివీడులో సీపీఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వ రరావు, నూజివీడు నియోజకవర్గ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చాట్ల పుల్లారావు, ఇందుపల్లి సత్య ప్రకాష్‌ పాల్గొ న్నారు. జంగారెడ్డిగూడెంలో సరిహద్దు ప్రాంతమైన తెలంగాణ నుంచి కార్మికులను తీసుకువచ్చి పనిచేయిస్తున్న సందర్భంగా సీపీిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మన్నవ కృష్ణ చైతన్య అడ్డుకోవడంతో పోలీసులకు చైతన్యకు మధ్య తోపులాట జరగడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. పోలీస్‌ స్టేషన్‌ వద్ద కార్మికులు ధర్నా చేశారు. చింతలపూడిలో సీపీఐ సీనియర్‌ నాయకులు ఎం వసంతరావు, మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తుర్లపాటి బాబు పాల్గొన్నారు. కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహిం చారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏఐటీయూసీ నియోజకవర్గ నాయకులు చెల్లబోయిన రంగారావు, రాష్ట్ర కోశాధికారి కె.మల్లేశ్వరరావు, తణుకులో సీపీిఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, నరసాపురంలో ఏఐటీయూసీ పట్టణ నాయకులు నెక్కంటి క్రాంతి కుమార్‌, పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్‌ పాల్గొన్నారు. సీపీిఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు మండల నాగేశ్వరరావు మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించారు.
తూర్పుగోదావరి జిల్లాలో
కాకినాడలో శారదా దేవి గుడి వద్ద నుంచి మున్సిపల్‌ కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్ర మంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి దాస్‌ పాల్గొన్నారు. నిడదవోలు మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు, సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ప్రారంభించారు. ఈ దీక్షా శిబిరానికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ భాస్కరరావు అధ్యక్షత వహించారు. సామర్లకోట మున్సిపల్‌ కార్యాలయం వద్ద చేపట్టిన సమ్మెకు ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి ఉప్పలపాటి చంద్రదాసు విచ్చేశారు. అమలాపురంలో ఏపీ మున్సిపల్‌ జేఏసీ తరఫున కె సత్తిబాబు పాల్గొన్నారు.
గుంటూరులో
మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన సమ్మె గుంటూరులో నాలుగవ రోజు విజయవంతం జరిగింది. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో వద్ద జరిగిన నిరసన కార్యక్రమానికి సీపీఐ, టీడీపీ, జనసేన పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌, టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నజీర్‌ అహ్మద్‌, జనసేన పార్టీ నాయకులు ఆళ్ల హరి కార్మికులను ఉద్దేశించి ప్రసంగిం చారు. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్భంగా మోకాళ్ళపై నిల్చుని అర్థనగ్నంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కోట మాల్యాద్రి, బందెల రవికుమార్‌, ఈదులమూడి మధుబాబు, ముత్యాలరావు, సోమి శంకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img