Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

మాయమాటలు చెప్పి కిడ్నీ దోచేశారు

పెందుర్తిలో కలకలం రేపిన ఘటన

విశాలాంధ్ర – పెందుర్తి: విశాఖ జిల్లా పెందుర్తిలో కిడ్నీలు కొట్టేసే ముఠా వ్యవహారం కలకలం రేపింది. మాయమాటలు చెప్పి గోరుజల్ల వినయ్‌ కుమార్‌ అనే నిరుపేద యువకుడి కిడ్నీని లాగేశారు ముఠా సభ్యులు. విశాఖ పట్నం పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైన ఈ ఘటనకు సంబం ధించిన వివరాలు ఇలా ఉన్నాయి… కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న వినయ్‌కుమార్‌కు కామరాజు అనే వ్యక్తి మధురవాడలో పరిచయం అయ్యాడు. వినయ్‌కుమార్‌ ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకున్న కామరాజు… కిడ్నీఅమ్మితే ఎనిమిది లక్షలు రూపాయలు వస్తాయని నమ్మబలికాడు. కేజీహెచ్‌ డౌన్‌ లో ఉన్న విజయ హాస్పిటల్‌ దగ్గర సంబంధిత టెస్టులు కూడా చేయించాడు. ఆ సమయంలో కిడ్నీ విక్రయం గురించి వినయ్‌కుమార్‌ ఇంట్లో తెలియడంతో అతను హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. ఆ తర్వాత కామరాజు వినయ్‌ కుమార్‌ కు ఫోన్‌ చేసి మీ ఇంట్లో సామన్లు తీసుకొచ్చేస్తాను… మీ అమ్మానాన్నలను రోడ్డు మీదకి లాగెస్తాను అని బెదిరించడంతో భయపడిన వినయ్‌కుమార్‌ హైదరాబాద్‌ నుండి రావడంతో కిడ్నీ ముఠా సభ్యులు రైల్వే న్యూ కాలనీ వద్ద పట్టుకొని పెందుర్తి తిరుమల హాస్పిటల్‌ కి తీసుకెళ్లి వెంటనే మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి కిడ్నీ తీయించేశారని బాధితుడు వాపోయాడు. రూ.8 లక్షలు చెల్లించడానికి అంగీకరించిన కామరాజు తదితరులు కేవలం రూ.2.5 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకున్నారని బాధితుడు వినయ్‌కుమార్‌ లబోదిబోమన్నాడు. వారం రోజులు బాగానే ఉన్నా ప్రస్తుతం నడవలేకపోతున్నానని చెప్పాడు. తనతో పాటు మరికొందరి కిడ్నీలు కూడా లాగేశారని అతను తెలిపాడు. కాగా దీనిపై జిల్లా యంత్రాంగం స్పందించింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి పి.జగదీశ్వరరావు, రిమ్స్‌ డైరెక్టర్‌ రాంబాబు, ఏసీపీ నరసింహామూర్తి, తహశీల్దార్‌ ఆనంద్‌ కుమార్‌ తదితరులు పెందుర్తిలోని తిరుమల ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్‌ ఆదేశంతో దర్యాప్తు చేపట్టామని అధికారులు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img