Monday, January 30, 2023
Monday, January 30, 2023

మా మాటంటే లెక్కలేదా?

కూల్చివేతలు ఆపేయాల్సిందే ` స్టేటస్‌ క్యూ ఉత్తర్వులు జారీ
జహంగీర్‌పురి అధికారుల తీరుపై సుప్రీం సీరియస్‌
ఇరు వర్గాల అఫిడవిట్ల సమర్పణకు రెండు వారాల గడువు

న్యూదిల్లీ : దిల్లీలోని జహంగీర్‌పురిలో ఎన్‌డీఎంసీ అధికారులు చేపట్టిన ‘అక్రమ’ కట్టడాల కూల్చివేత ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. తమ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధికారులు అక్కడ బుల్డోజర్లు నడపడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. మా మాటంటే లెక్కలేదా? కూల్చివేతలు ఆపమన్నాం కదా? తదుపరి ఆదేశాల వరకు స్టేటస్‌ క్యూ ఉత్తర్వులు అమలు జరగాల్సిందే అంటూ ఉత్తర దిల్లీ మున్సిపల్‌ అధికారులకు సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ వ్యవహారంలో జమాతే ఉలేమా యే హింద్‌ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బీఆర్‌ గవాయితో కూడిన ధర్మాసనం విచారించింది. ఎన్‌డీఎంసీతో పాటు కేంద్రానికి, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. నేరానికి శిక్షగా ఇళ్లను కూల్చివేయాలని క్రిమినల్‌ చట్టం సూచించదంటూ జమాతే ఉలేమా ఫిర్యాదు పేర్కొంది. కూల్చివేతలను ఆపేయమని చెప్పినట్లు మేయర్‌కు సమాచారం ఇచ్చిన తర్వాత కూడా ప్రక్రియ ఆగకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని సర్వోన్నత ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. మళ్లీ ఆదేశాలు ఇచ్చేంత వరకు స్టేటస్‌ క్యూ అమల్లో ఉంటాయని చెప్పింది. ఇటీవల మత ఘర్షణలతో జహంగీర్‌పురి అట్టుడికింది. బుధవారం అక్కడ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అక్రమ నిర్మాణాల నెపంతో ముస్లింలే లక్ష్యంగా వారి ఇళ్లు, దుకాణాలను ఉత్తర దిల్లీ మున్సిపల్‌ ‘బీజేపీ’ అధికారులు కూలగొట్టే ప్రయత్నం చేశారు. బుల్డోజర్ల సాయంతో కొన్నింటిని నేలమట్టం చేశారు. దీంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని కూల్చివేతలను ఆపివేయాలని ఉత్తర్వులు జారీచేసింది. దానిపై తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతూ కూల్చివేతలను కొనసాగించేందుకు అధికారులు ప్రయత్నించగా సీపీఎం నాయకురాలు బృందా కారత్‌ అడ్డుకున్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రతులను చేతులో పట్టుకొని బుల్డోజర్లకు అడ్డుగా నిలిచారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో కూల్చివేతలు నిలిపోయాయి. ఈ వ్యవహారంలో గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టంది. సీనియర్‌ న్యాయవాది దవే వాదనలు వినిపించారు. ఇది దేశానికి సంబంధించి ముఖ్యమైన అంశమని అన్నారు. బుల్డోజర్లతో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం ప్రభుత్వ విధానంగా మారిందన్నారు. ఇది జహంగీర్‌పురికి మాత్రమే సంబంధించిన సమస్య కాదని, మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తున్నదని చెప్పారు. ఇదే కొనసాగితే దేశంలో రూల్‌ ఆఫ్‌ లా కనుమరుగు అవుతుందన్నారు. ఫలానా కట్టడాలను కూల్చివేయాలని మున్సిపల్‌ కమిషన్‌ను లేఖ ద్వారా బీజేపీ అధ్యక్షుడు కోరితే ఆచరించేస్తారా? అని దవే ప్రశ్నించారు. ఇలాంటి వ్యవహారాల్లో నోటీసులు, అప్పీళ్లు ఉంటాయి కానీ ఇక్కడ అలాంటివి ఏమీ లేవు అని అన్నారు. దిల్లీలో కాలనీలకు చట్టబద్ధత కల్పించే చట్టం ఉందని చెప్పారు. లక్షలాది మందితో కూడిన 731 అనధికారిక కాలనీలు దిల్లీలో ఉంటే ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఒక్క కాలనీలోనే కూల్చివేతలు చేపట్టడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అక్కడి ఇళ్లు, దుకాణాలు 30ఏళ్లకుపైగా ఉన్నాయని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివాటిని ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. పేదల ఇళ్లు, దుకాణాలను ధ్వంసం చేసి సామాజిక అసమనత్వానికి అద్దం పట్టారని అన్నారు. నిజంగానే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటే సైనిక్‌ ఫామ్స్‌కు వెళ్లాలని, గోల్ఫ్‌ లింక్స్‌లో ప్రతి రెండవ ఇల్లు అక్రమ కట్టడమే అని నొక్కిచెప్పారు. అక్కడి వారి జోలికి అధికారులు వెళ్లరని, పేదలపై మాత్రమే అధికారాన్ని చలాయిస్తారంటూ దవే అసహనం వ్యక్తంచేశారు. జమాత్‌ తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ హాజరయ్యారు. జహంగీర్‌పురి తరహాలో ఇతర రాష్ట్రాల్లో కూల్చివేతలపై వాదనలు వినిపించారు. కేవలం ముస్లింలే లక్ష్యంగా ఈ విధ్వంసకాండ సాగుతోందన్నారు. హిందువుల ఆస్తులకు నష్టం కలగలేదా అని జస్టిస్‌ రావు ప్రశ్నించగా అలాంటివి ఒకటి`రెండు సందర్భాలే ఉన్నాయని సిబల్‌ బదులిచ్చారు. ప్రదర్శనలు జరిగి ఘర్షణలు చోటుచేసుకున్న క్రమంలో కేవలం ఒక వర్గానికి చెందిన ఇళ్లపైనే బుల్డోజర్లు కదలాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇటువంటివి జరగకుండా ఆదేశాలు జారీచేయాలని సిబల్‌ కోరగా అది కుదరదని న్యాయస్థానం వెల్లడిరచింది. సీపీఎం నేత బృందా కారత్‌ తరపున సీనియర్‌ న్యాయవాది పీవీ సురేంద్రనాథ్‌ వాదనలు వినిపించారు. అలాగే, ఎన్‌డీఎంసీ తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా హాజరయ్యారు. జనవరిలోనే కూల్చివేతల ప్రక్రియ మొదలైందని చెప్పారు. ఇది సాధారణంగా చేపట్టే చర్య అని, ముస్లింలను లక్ష్యంగా చేసుకొని జరిగింది కాదని బుకాయించారు. ఇదిలావుంటే, తమకు ముందస్తు నోటీసులు అందాయా లేదా అన్నది వెల్లడిస్తూ పిటిషనర్ల నుంచి అఫిడవిట్లు కావాలని, అలాగే కూల్చివేతల వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్లు సమర్పించాలని, అప్పటి వరకు స్టేటస్‌ క్యూ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని సుప్రీంకోర్టు తెలిపింది. అఫిడవిట్లు సమర్పించేందుకు రెండు వారాల గడువు ఇస్తూ అప్పటివరకు కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img