Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

మిర్చి రైతులను ఆదుకోవాలి

ఎకరానికి రూ.లక్ష పరిహారం
న్యాయం అందే వరకు పోరాటం
రిలే నిరాహార దీక్షల్లో ముప్పాళ్ల, కేవీవీ ప్రసాద్‌

విశాలాంధ్ర`గుంటూరు: తామర పురుగు సోకి పంట నష్టపోయిన మిర్చి రైతాంగాన్ని ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. పంట దెబ్బతిన్న మిర్చి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో గుంటూరు ఉద్యాన శాఖ కమిషనర్‌ కార్యాలయం వద్ద మూడు రోజుల రిలే నిరాహార దీక్షలను ప్రారంభించిన ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ విదేశీ మార్కెట్‌, గిట్టుబాటు ధర, ఆసియాలో కెల్లా అతిపెద్ద మిర్చి మార్కెట్‌ యార్డు సదుపాయం, 150 కోల్డ్‌స్టోరేజ్‌లు తదితర అంశాలు అనుకూలంగా ఉండటంతో మిర్చి సాగుకు ఆసక్తి చూపిన రైతాంగం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.11 లక్షల ఎకరాలలో మిర్చిని సాగు చేశారన్నారు. పెరిగిన విత్తన, ఎరువులు, పురుగు మందుల ధరలతో లక్ష నుంచి రెండు లక్షల వరకు పెట్టుబడులు పెట్టినా తామర పురుగు కారణంగా వేల ఎకరాలలో మిర్చి పంట నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు పంటలను తొలగించారని, మరికొందరు ఎలాగైనా పంటను కాపాడుకోవడాన్ని మహాయజ్ఞంగా కొనసాగిస్తున్నారని చెప్పారు. పంట నష్టం, అప్పుల భారంతో తూర్పు గోదావరి జిల్లా నుంచి కర్నూలు జిల్లాల వరకు సుమారు 8 మంది మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రభుత్వాలు తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతాంగాన్ని ఆదుకోకపోతే అన్నదాతలే వీధుల్లోకి వస్తారని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలలోపు మిర్చి రైతులను ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండు చేశారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అధికారులు, లాం ఫాం శాస్త్రవేత్తలతో పాటు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌(బెంగళూరు) శాస్త్రవేత్తలు మిర్చి పంటను పరిశీలించి తగిన సూచనలు చేసినా తామర తెగులును అరికట్టలేకపోయారన్నారు. మంత్రులు మిర్చి నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారని, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్‌ 8 రాష్ట్రాలలో మిర్చి పంట దెబ్బతిన్నదని అంగీకరించినా నేటికీ మిర్చి రైతులకు ఆదుకోకపోవడం దారుణమన్నారు. తక్షణమే పంటనష్టాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ నిధుల నుంచి ఆర్థిక సహాయం అందించాలని, పంటకు తీసుకున్న రుణాలను రద్దు చేసి కొత్త రుణాలివ్వాలని డిమాండు చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ తామర పురుగు మిర్చి రైతులను భారీ నష్టాలకు గురి చేసిన నేపథ్యంలో తక్షణ సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. దీక్షలకు అధ్యక్షత వహించిన మిర్చి రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముసునూరు రమేష్‌ బాబు మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారంతో పాటు పంట బీమా పథకాన్ని వర్తింపచేయాలన్నారు. దేవాదాయ, ధర్మాదాయ భూములలో మిర్చి వేసి నష్టపోయిన కౌలు రైతులకు కౌలు రద్దు చేయాలని డిమాండు చేశారు. తాడికొండ, పెదకాకాని, వట్టిచెరుకూరు, గుంటూరు రూరల్‌ మండలాలకు చెందిన రైతులు దీక్షలో పాల్గొనగా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌, వీరాంజనేయులు, శిరీషా, అనిత , భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ సంఫీుభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీ, జాయింట్‌ సెక్రటరీ విఠల్‌ రెడ్డి, కృష్ణా జిల్లా రైతు సంఘం నాయకులు ఎం.అరుణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img