విద్యుత్ శాఖలో అవినీతి ఊడలు
. వాణిజ్య భవనాలు, పరిశ్రమలు, అపార్ట్‌మెంట్ ట్రాన్స్‌ఫార్మర్‌లకు లక్షల్లో డిమాండ్
. ఏసీబీ సోదాల్లో వెలుగుచూసిన ఏడీఈ అక్రమాస్తులే నిదర్శనం
విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం: విద్యుత్ శాఖలో అవినీతి మితిమీరిపోయిందని ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ ఇళ్లకు మీటరు కావాలంటే ముడుపులు చెల్లించుకోవలసిన దుస్థితి నెలకొందని సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. ఇక వాణిజ్య భవనాలకు, పరిశ్రమలకు, అపార్ట్‌మెంట్‌లకు ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటు చేసుకోవడం కూడా కష్టంగా మారింది. వాటికి అనుమతులు ఇచ్చే విషయంలో కొంతమంది అధికారులు, సిబ్బంది తమ జేబులు నింపాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల ఏఈడీ ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన నేపథ్యంలో కోట్లాది రూపాయలు అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి. ఇది విద్యుత్ శాఖలో అవినీతి ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేసింది. రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖపట్టణంలో విద్యుత్ కనెక్షన్ పొందేందుకు పడిన కష్టాలు వర్ణనాతీతం. మధురవాడ ప్రాంతంలో కొండ మీద చిన్న ఓ రేకుల షెడ్డు నిర్మించుకున్న ఒక యజమాని విద్యుత్ కనెక్షన్ కావాలని కరెంట్ ఆఫీస్‌లో ఉద్యోగిని సంప్రదించాడు. ఇంటికి సంబంధించిన అన్ని కాగితాలు ఉంటే 10 వేలు, లేకుంటే 20 వేలు ఖర్చు అవుతుందని సలహా ఇచ్చేశాడు. దీంతో ప్రభుత్వం ఇచ్చిన పట్టా మాత్రమే ఉందని చెప్పడంతో విద్యుత్ కనెక్షన్‌కు రూ.15 వేలు అవుతుందని చెప్పాడని ఆ ఇంటి యజమాని తెలియజేశాడు. కొత్తగా భవనం నిర్మాణం అయితే సిబ్బందికి, అధికారులకు పండుగే. ముఖ్యంగా గ్రూప్ హౌస్‌లు, అపార్ట్‌మెంట్‌లకు ట్రాన్స్‌ఫార్మర్‌ల ఏర్పాటు తప్పనిసరి కావడంతో భారీ మొత్తంలో ముడుపులకు డిమాండ్ చేస్తుండటంపై అనేక మంది బిల్డర్లు లబోదిబోమంటున్నారు. 20 కిలో వాట్స్ దాటితే ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు తప్పనిసరి కావడంతో లక్షల్లో అంచనాలు పెంచి, భారీ మొత్తంలో ఓ పక్క ముడుపులు, మరోపక్క సంస్థకు డీడీలు కట్టాల్సి వస్తోందని ఆయా భవన యజమానులు, బిల్డర్‌లు వాపోతున్నారు. బిల్డర్లకు విద్యుత్ శాఖ అధికారులు తాఖీదులు ఇవ్వడంతో ఆందోళన చెందిన వినియోగదారులు బేరసారాలాడి తగ్గించాలని వారిని ప్రాథేయపడవలసిన దుస్థితి నెలకొంది. సంబంధిత భవనం వద్ద విద్యుత్ కేబుల్, కండక్టర్, విద్యుత్ స్తంభాలతో పాటు ఇతర సామాగ్రి, కిలో వాట్స్ సామర్థ్యం గల, 25 కేవీ, 40 కేవీ, 63 కేవీ, 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ల ఏర్పాటుకు సంబంధిత భవన యజమానులు దరఖాస్తు చేసుకుంటారు. అయితే అధికారులకు ముడుపులు అందజేస్తేనే ఆగమేఘాల మీద విద్యుత్ కనెక్షన్ ఇస్తారని, లేదంటే నెలలు తరబడి తిప్పిస్తారని భవన యజమానులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కరాసలో ఓ భవన యజమాని రూ.5 లక్షల 8 వేలు ట్రాన్స్‌ఫార్మర్ కోసం డీడీ తీసి 45 రోజులైనా కేబుల్ లేదంటూ ముడుపుల కోసం అధికారులు ముప్పతిప్పలు పెట్టారు. చివరికి రూ.50 వేలు సమర్పిస్తేగానీ పని పూర్తి చేయలేదని సదరు యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మురళీ నగర్‌లో ఓ భవన యజమాని వారికి రూ.50 వేలు, మహారాణి పేటలో ఓ భవనానికి లక్ష రూపాయలు అధికారులకు ఇచ్చినట్లు సంబంధిత భవన యజమాని తెలియజేశాడు. ఇలా అడుగడుగునా ప్రతి కనెక్షన్‌లో అవినీతి విలయతాండవం చేస్తోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఇక షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే లక్షల్లో ముడుపులు ఇవ్వాల్సిందేనని సంబంధిత యజమానులు చెబుతున్నారు. అలాగే చిన్న, మధ్య, తరహా పరిశ్రమలకు విద్యుత్ కనెక్షన్ కోసం అంచనాల పేరిట సంబంధిత పరిశ్రమల యజమానులకు భారీ తాఖీదు ఇవ్వడంతో యజమాని తగ్గించాలని ప్రాథేయపడటంతో ముడుపుల బేరానికి వచ్చి లక్షల్లో ఇవ్వాలని అధికారులు చెబుతున్నట్లు అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ నగర శివారు ప్రాంతాల్లో ఐస్, వాటర్ బాటిల్స్, కూల్‌డ్రిరక్స్, టింబర్ డిపోలు, రైస్ మిల్లులు, కోల్డ్ స్టోరేజ్‌లు, ఇటుక బట్టీలు వంటి చిన్న చిన్న పరిశ్రమల ఏర్పాటుకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు కోసం భారీగా ముడుపులు ఇవ్వాల్సిందేనని పరిశ్రమల యజమానులు వాపోతున్నారు. ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు కూడా విస్తరించి ఉన్నాయి. ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో విద్యుత్ కనెక్షన్ల కోసం భారీ ఎత్తున ముడుపులు దండుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చివరికి పేదలు వేసుకునే గుడిసెలు, రేకుల షెడ్ల ఇళ్లకు విద్యుత్ మీటర్ కనెక్షన్ ఇవ్వాలంటే కనీసం 10 వేల రూపాయలకు పైబడి ముడుపులు ఇవ్వాల్సిందేనని పేదలు లబోదిబోమంటున్నారు. ఇటీవల గోపాలపట్నం ప్రాంతానికి చెందిన ఓ తాపీ మేస్త్రి తాను ఇల్లు కట్టుకుని మీటర్ కోసం కరెంట్ ఆఫీస్‌కు వెళ్లి దరఖాస్తు చేశాడు. అయితే మీటర్ వేయడానికి వచ్చిన ఉద్యోగి రూ.15 వేలు డిమాండ్ చేయగా, 12 వేలు సమర్పించుకున్నట్లు ఆయన తెలిపారు. భీమిలి, ఆనందపురం, మధురవాడ, కొమ్మది, పెందుర్తి, గాజువాక, ఆరిలోవ, సాగర్ నగర్, ఎండాడ, సింహాచలం వంటి కొండ వాలు ప్రాంతాల్లో విద్యుత్ మీటర్ కనెక్షన్ కోసం మరింత డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకోపక్క నగర శివారు ప్రాంతాల్లో అధికంగా భవన నిర్మాణరంగం విస్తరిస్తున్న నేపథ్యంలో అపార్ట్‌మెంట్‌కు కావలసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లకు లక్షల్లో ముడుపులు ఇవ్వాల్సిందేనని సంబంధిత భవన యజమానులు ఆరోపిస్తున్నారు.
విజిలెన్స్ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టకపోవడంతోనే కొంతమంది అధికారుల అవినీతికి అడ్డూఅదుపు లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అనకాపల్లి ఏఈడీ రాంబాబు ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన నేపథ్యంలో కోట్లాది రూపాయలు అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి. సంస్థకు రావాల్సిన ఆదాయానికి గండి కొట్టి, అధికారులు ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. విజిలెన్స్ అధికారులు ప్రతి విద్యుత్ కనెక్షన్ మంజూరుపై క్షేత్రస్థాయిలో విచారణ చేపడితే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని విద్యుత్ వినియోగదారులు అంటున్నారు.