Friday, October 7, 2022
Friday, October 7, 2022

మీ చేతిలోనే దేశ భవిష్యత్‌

విద్యార్థి, యువజనులు రాజకీయాల్లోకి రావాలి
సీపీఐ జాతీయ కార్యదర్శి బినయ్‌ విశ్వం పిలుపు
మోదీ పాలనలో యువతకు ఉపాధి కరువు : రామకృష్ణ
కొత్తపట్నంలో ఎస్‌ఎఫ్‌, వైఎఫ్‌ రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభం

విశాలాంధ్ర`ఒంగోలు : దేశభవిష్యత్‌ విద్యార్థి, యువజనుల చేతుల్లో ఉందని, అందువల్ల వారు క్రియాశీల రాజకీయాలలోకి రావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు బినయ్‌ విశ్వం పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ అధ్వర్యంలో విద్యార్థి, యువజన రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణాతరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి. ఏఐఎస్‌ఎఫ్‌ జెండాను యువజన సమాఖ్య మాజీ జాతీయ కార్యదర్శి జి.ఈశ్వరయ్య ఆవిష్కరించగా, ఏఐవైఎఫ్‌ జెండాను సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ప్రారంభసభకు ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ సుబ్బారావు, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పి రాజేంద్ర అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. వర్క్‌షాప్‌కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బినయ్‌ విశ్వం ప్రారంభోపన్యాసం చేస్తూ ఏఐఎస్‌ఎఫ్‌తోనే తన రాజకీయ జీవితం ఆరంభమైందని, జాతీయస్థాయి నాయకుడిగా ఎదిగానన్నారు. తనతోపాటు దేశంలో చాలామంది ఏఐఎస్‌ఎఫ్‌ పూర్వ నాయకులేనన్నారు. 1936లో లక్నోలో ఏఐఎస్‌ఎఫ్‌ ఆవిర్భవించిందని, స్వాతంత్య్ర ఉద్యమం కోసం ఏర్పడిన తొలి విద్యార్థిసంఘమని చెప్పారు. ఆరంభ సమావేశానికి అధ్యక్షత వహించిన మహమ్మద్‌ అలీ జిన్నా స్వాతంత్య్రం తర్వాత పాకిస్థాన్‌ తొలి అటార్నీ జనరల్‌ కాగా, ప్రారంభోపన్యాసం చేసిన జవహర్‌లాల్‌ నెహ్రూ భారతదేశానికి తొలి ప్రధాని అయ్యారని బినయ్‌ విశ్వం గుర్తుచేశారు. స్వాతంత్య్రానికి ముందే 1937లో కొత్తపట్నంలో తొలి రాజకీయ పాఠశాల 180 మందితో జరిగిందని, ఆ పాఠశాలలో పాల్గొన్న వారు దేశానికి, రాష్ట్రానికి నాయకులుగా ఎదిగారన్నారు. అటువంటి శిక్షణా తరగతులు ఇప్పుడు కొత్తపట్నంలో జరగటం చరిత్రాత్మకమన్నారు. విద్యార్థులను, యువతను ముందుకు రానీయకుండా, ప్రశ్నించేతత్వాన్ని అలవరచకుండా మోదీ సర్కారు అడుగడుగునా అడ్డుపడుతోందని విమర్శించారు. దేశంలో సామాజికంగా, రాజకీయంగా చైతన్యవంతమైన మార్పు విద్యార్థులు, యువతతోనే సాధ్యమన్నారు. అటువంటి మార్పు వెంటనే ప్రారంభం కావాలన్నారు. నేటి నుండి సర్‌ అనే పదాన్ని వదలివేసి కామ్రేడ్‌ అని ప్రతి ఒక్కరినీ సంబోధించాలని పిలుపునిచ్చారు. ఈ శిక్షణా తరగతులలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ రానున్న కాలంలో గొప్ప నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ 1937లో కొత్తపట్నంలో జరిగిన శిక్షణా తరగతులలో చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, బసవపున్నయ్య, ఎంజీ రంగా వంటి హేమా హేమీలు పాల్గొన్నారని గుర్తుచేశారు. నాడు 40 రోజులు తరగతులు జరగవలసి ఉంటే 20 రోజులకే బ్రిటీషు ప్రభుత్వం శిక్షణా తరగతులపై నిషేధం విధించిందన్నారు. హాజరైన విద్యార్థి, యువజనులను కొట్టుకుంటూ ఒంగోలు వరకు నడిపించిందన్నారు. మెజిస్ట్రేట్‌ కొంతమందికి ఏడాది జైలు శిక్ష విధించినట్లు వివరించారు. అటువంటి గొప్ప చరిత్ర కలిగిన కొత్తపట్నంలో శిక్షణా తరగతులు నిర్వహించటం గర్వంగా ఉందన్నారు. మోదీ పాలనలో యువతకు ఉపాధి కరువైందని విమర్శించారు. నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు చెప్పారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న హామీని బీజేపీ విస్మరించిందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు కట్టబెట్టడమే లక్ష్యంగా మోదీ పాలన సాగుతోందన్నారు. మోదీ సర్కారుపై తిరుగుబాటుకు సమయం ఆసన్నమైందని చెప్పారు. అందుకు విద్యార్థులు, యువజనులు ముందుకు రావాలన్నారు. ఈనెల 27న జరిగే భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఏపీ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గని, చంద్రా నాయక్‌, ప్రకాశం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముత్తన అంజయ్య, ఆర్‌.రామకృష్ణ అధ్వర్యంలో ఆలపించిన అభ్యుదయ, విప్లవ గీతాలు ఆలోచింపజేశాయి. ఏఐవైఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పీజే చంద్రశేఖర్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ, ఏపీ ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు(అన్న), సినీనటులు, నిర్మాత మాదాల రవి, డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మనుమడు అల్లూరి శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img