Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

‘ముందస్తు’ హడావుడి?

. సిద్ధమవుతున్న ఎన్నికల టీమ్‌లు
. ఇప్పుడు ఐఏఎస్‌లు… త్వరలో ఐపీఎస్‌ల బదిలీ
. ‘జగనన్నే మా భవిష్యత్తు’ అంటూ విస్తృత ప్రచారం
. 20 తర్వాత కీలక పరిణామాలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ‘ముందస్తు’ ఎన్నికలకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఓపక్క ‘జగనన్నే మా భవిష్యత్తు’ అనే నినాదంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలంతా శుక్రవారం నుంచి ప్రజల్లో విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టగా, మరోపక్క ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల బృందాలను సిద్ధం చేసుకుంటున్నారు. దీనిలో భాగంగానే గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఒకేసారి 56 మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారు. జేసీలు, మున్సిపల్‌ కమిషనర్లుగా పనిచేసిన జూనియర్‌ ఐఏఎస్‌లు కొంతమంది జిల్లా కలెక్టర్లుగా నియమితులయ్యారు. మొత్తం 8 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేశారు. మరికొన్ని కీలకశాఖల్లోనూ మార్పులు చేపట్టారు. ముఖ్యంగా ప్రభుత్వానికి విధేయులుగా వ్యవహరిస్తున్న అధికారులను గుర్తించి, ఎన్నికల ముందు వారిని బదిలీ చేసే అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అటువంటి వారిని కీలక ప్రాంతాల్లో, ప్రాధాన్యతా శాఖల్లో నియమించారు. విజయనగరం కలెక్టర్‌ ఎ.సూర్యకుమారిని పంచాయతీరాజ్‌ కమిషనర్‌గా, కర్నూలు కలెక్టర్‌ పి.కోటేశ్వరరావును పురపాలక శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపక్షం రీకౌంటింగ్‌ కోసం పట్టుబట్టినా ఖాతరు చేయని అనంతపురం కలెక్టర్‌ నాగలక్ష్మిని విజయనగరం కలెక్టర్‌గా బదిలీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇప్పించడంలో, ఆయన సమక్షంలో ప్రభుత్వాన్ని విమర్శించేందుకు దోహదపడ్డారన్న కారణంతో విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా పనిచేసిన ఆర్పీ సిసోడియాను బాపట్లలోని మానవ వనరుల విభాగం (హెచ్‌ఆర్‌డీ) డైరెక్టర్‌ జనరల్‌గా నియమించింది. ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రతిపక్షానికి దగ్గరగా ఉండే అధికారులను గుర్తించి మరీ బదిలీలు చేపట్టారన్న చర్చ అధికారుల్లో జరుగుతోంది. త్వరలో మరిన్ని బదిలీలు జరుగుతాయని, ఐపీఎస్‌ల్లోనూ భారీగా బదిలీలు జరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మూడో తేదీన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిలతో జరిగిన సమావేశంలో గడువు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 7 నుంచి 20వ తేదీ వరకు ‘జగనన్నే మా భవిష్యత్తు’ అనే కార్యక్రమాన్ని చేపట్టాలని, పార్టీ నాయకత్వం ఈ రెండు వారాల వ్యవధిలో రాష్ట్రంలో కోటి 60 లక్షల కుటుంబాలను ప్రత్యక్షంగా కలవాలని ఆదేశించారు. నేరుగా ప్రజలను కలిసి వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల ప్రతి కుటుంబానికి ఏ మేరకు ఆర్థికంగా లబ్ధి చేకూరిందో వివరించాలని సూచించారు. ప్రతి గడపను వైసీపీ శ్రేణులు తట్టాలని నిర్దేశించారు. పార్టీ పదాతిదళంగా గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, వలంటీర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రతి ఇంటిని సందర్శించి ’మమ్నల్ని మా జగనన్న పంపారు. మీతో మాట్లాడి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై, ప్రభుత్వ పనితీరుపై మీ అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు వచ్చామని’ వీరంతా ప్రజలకు చెపుతారు. గత టీడీపీ పాలన, ఇప్పటి వైసీపీ పాలన మధ్య వ్యత్యాసాలను తెలుపుతూ కరపత్రాలు ప్రజలకు అందజేస్తారు. సంతృప్తి చెందిన వారిని ఒక మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలని కోరతారు. దీనిద్వారా వైసీపీ సంక్షేమ పాలనకు విస్తృత ప్రచారం నిర్వహించడంతోపాటు ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఏ మోతాదులో వ్యతిరేకత ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నదే లక్ష్యం. ఏప్రిల్‌ 20వ తేదీలోగా ఒక రౌండ్‌ ఎన్నికల ప్రచారం పూర్తి చేయడం, విపక్షాలను పక్కదారి పట్టించడమే ఈ కార్యక్రమ అసలు ఉద్దేశంగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఎప్పుడైనా అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉందని, తెలంగాణతో పాటు ఎన్నికలు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈలోపే ఎన్నికల టీమ్‌లను సన్నద్ధం చేసుకునే కసరత్తు పూర్తవుతుందని, ఏప్రిల్‌ 20 తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img