కుట్రలను వేగం చేసిన బీజేపీ బ మరింత మందికి గాలం
సంజయ్ రౌత్‌కి ఈడీ నోటీసులు
అనర్హత నోటీసులపై తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సుప్రీం ఊరట
మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు
ముంబై/గువహటి/న్యూదిల్లీ : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింతగా ముదురుతోంది. పరిణామాలు వేగంగా కీలక మలుపు తిరుగుతున్నాయి. తిరుగుబాటు వర్గం నేత ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రే శ్రేణుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇంకా అసోంలోని స్టార్ హోటల్లోనే బస చేస్తున్నారు. శివసేన బుజ్జగింపులతో వెనక్కి తిరిగిరాలేదు. ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటును కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తొమ్మిది మంది తిరుగుబాటు మంత్రుల శాఖలను తొలగించారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ అనర్హతను సవాల్ చేస్తూ షిండే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తిరుగుబాటు ఎమ్మెల్యేల ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ ఏక్నాథ్ షిండే మరో పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో ఏడుగురు పౌరులు బొంబాయి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రజా హక్కులు, సుపరిపాలన పట్ల అగౌరవానికి దారితీసిన విధులను విస్మరించడం, నైతిక తప్పులు చేసినందుకు తిరుగుబాటు నాయకులపై చర్య తీసుకోవాలని కోరారు. తిరుగుబాటు నేతలను రాష్ట్రానికి తిరిగి వచ్చి విధుల్లో చేరేలా ఆదేశించాలని పిటిషన్లో హైకోర్టును కోరారు. ఇదే సమయంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీచేసింది. రేపు విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది.
తిరుగుబాటు ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ ఏక్నాథ్ షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు అనర్హత నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు షిండే వర్గానికి జులై 11 వరకు గడువు కల్పిస్తూ విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది. కాగా ఏక్నాథ్ షిండేపై శివసేన చర్యలు తీసుకుంది. ఆయనను పార్టీ శాసనసభా పక్ష నేత హోదా నుంచి తొలగించింది. ఆ స్థానంలో అజయ్ చౌదరిని నియమించింది. ఈ నియామకాన్ని డిప్యూటీ స్పీకర్ ఆమోదించారు. మరోవైపు, షిండే సహా 16 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి అనర్హత నోటీసులు జారీ చేసింది. దీనిపై జూన్ 27వ తేదీ సాయంత్రంలోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలంటూ స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారంపై షిండే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. డిప్యూటీ స్పీకర్‌పై తాము తీసుకువచ్చిన అవిశ్వాస తీర్మానం పెండిరగ్లో ఉన్నందున, ఆయన అనర్హత నోటీసులు ఇవ్వడం చట్టబద్ధం కాదని పిటిషన్లో పేర్కొంది. అనర్హత పిటిషన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డిప్యూటీ స్పీకర్‌ను ఆదేశించాలని కోరింది. అలాగే కేవలం 15 మంది మద్దతు ఉన్న వ్యక్తి శివసేన శాసనసభా పక్ష నేత కాలేరని, అందువల్ల అజయ్ చౌదరి నియామకం చెల్లదని పేర్కొంటూ షిండే వర్గం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పార్దీవాలాలతో కూడిన వెకేషన్ బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. అనర్హత నోటీసులపై తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముందు బొంబాయి హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని కోర్టు ప్రశ్నించింది. అక్కడ తమకు ప్రాణహాని ఉందని తిరుగుబాటు ఎమ్మెల్యేలు తెలిపారు. అందుకే నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. కాగా వాదోపవాదాల అనంతరం షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై తమ స్పందన తెలియజేయాలని డిప్యూటీ స్పీకర్, మహారాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శ, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐదు రోజుల్లోగా స్పందనను తెలియజేయాలని సూచించింది. మరోవైపు, శివసేన శాసనసభా పక్ష నేతగా నియమితులైన అజయ్ చౌదరికి కూడా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలకు కోర్టు ఊరట కల్పించింది. డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసులపై లిఖితపూర్వక సమాధానం ఇచ్చేందుకు జులై 11వ తేదీ సాయంత్రం వరకు గడువు కల్పించింది. అయితే అప్పటి వరకు రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. శివసేనపై తిరుగుబాటు చేసిన 39 మంది ఎమ్మెల్యేల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తొమ్మిది మంది మంత్రుల శాఖలు తొలగించిన ఉద్ధవ్
ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తొమ్మిది మంది తిరుగుబాటు మంత్రుల శాఖలను తొలగించారు. తిరుగుబాటు మంత్రుల బాధ్యతలను ఇతర మంత్రులకు అప్పగించడం ద్వారా ప్రజా సంక్షేమ పనులు నిలిచిపోలేదని ప్రభుత్వం పేర్కొంది.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఈడీ నోటీసులు
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీచేసింది. మంగళవారం విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. ఈడీ తనకు సమన్లు పంపడంపై రౌత్ స్పందిస్తూ, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ను ట్యాగ్ చేస్తూ, తాను అరెస్ట్‌కు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేతో ఏక్నాథ్ షిండే మంతనాలు
మహారాష్ట్రలో వాడివేడిగా జరుగుతున్న పరిణామాల నడుమ శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేతో మాట్లాడారు. ఇదిలాఉండగా రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర కాంగ్రెస్ డిమాండ్ చేసింది.