Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

‘మూడు’ ముచ్చటకు బ్రేక్‌?

. విశాఖ రాజధానిపై ఉత్తరాంధ్ర పట్టభద్రుల విలక్షణ తీర్పు
. ప్రభుత్వం నిర్ణయాలపై స్పష్టమైన వ్యతిరేకత
. ఎమ్మెల్సీ ఫలితాలపై ఉత్తరాంధ్ర ప్రజల హర్షం

విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం : రాష్ట్రాభివృద్ధిని పక్కనబెట్టి… అధికార వికేంద్రీకరణ… మూడు రాజధానులంటూ చెప్పుకొస్తున్న వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టులా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రాష్ట్రానికి ఈ కొసనా… ఆ చివరా ఉన్న ఉత్తరాంధ్ర… రాయలసీమ ప్రాంతాలు పదేపదే రాష్ట్ర రాజకీయాల్ల్లో అత్యంత ప్రధానాంశాలుగా మారాయి. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలో అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం అన్ని ప్రాంతాల అభివృద్ధిని… మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్‌ రాజధానిగా ప్రజలందరి ఆమోదం పొందిన అమరావతి ప్రాంత అభివృద్ధిని గాలికొదిలేసి, మూడు రాజధానులంటూ ముప్పూటలా ప్రచారం చేస్తూ వచ్చింది. అయితే తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నిరంకుశ వైఖరిని నిలదీసేలా ప్రస్ఫుటమవుతున్నాయి. ప్రధానంగా విశాఖే కార్యనిర్వాహక రాజధాని అంటూ తరచూ ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు, ఆయన పార్టీ వైసీపీకి గట్టి రaలక్‌ ఇచ్చేలా ఈ ఫలితాలు ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు అనూహ్యంగా మెజారిటీ సాధించడం వైసీపీ నేతలకు తీవ్ర చిక్కును తెచ్చిపెట్టింది. అలాగే తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి గట్టి పోటీని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న విషయాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత తమ ఓటు ద్వారా స్పష్టంగా తెలియజేశారు. విశాఖ ఎమ్మెల్సీ ఫలితాన్ని పరిశీలిస్తే… అక్కడ టీడీపీ ముందంజలో ఉండటతో విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఎలా ప్రారంభించాలో అని వైసీపీ నేతలు మళ్లీ తలలు పట్టుకుంటున్నారు. మూడు రాజధానుల అంశాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతిస్తున్నారని పదే పదే చెప్పిన వైసీపీ నేతలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉత్తరాంధ్ర పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పారు. విశాఖ కేంద్రంగా రాజధానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు శుభసూచకంగా భావిస్తున్నామని టీటీడీ చైర్మన్‌, ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి అనేకసార్లు మీడియా సమావేశాల్లో మాట్లాడారు. తొలిసారి సార్వత్రిక ఎన్నికలను తలపించేలా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలను వైసీపీ నిర్వహించింది. ఎన్నికల్లో గెలుపు ఊపుతో విశాఖ కేంద్రంగా రాజధాని పాలన ప్రారంభిస్తామని పదేపదే చెప్పింది. ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్‌, బూడి ముత్యాల నాయుడుతో పాటు విశాఖ జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి విడుదల రజని కూడా వచ్చి ప్రచారం నిర్వహించారు. 30 మంది ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో గడపగడపకు తిరిగి ప్రచారం నిర్వహించారు. నలుగురు ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్సీలు, మూడు జిల్లాల జడ్పీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్‌, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించినప్పటికీ ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ వ్యక్తం అయింది. ఇదిగో పులి… ఇదిగో మేక… అన్న చందంలో గత రెండేళ్లుగా విశాఖ కేంద్రంగా రాజధాని పాలన ప్రారంభిస్తామని తేదీలు ఖరారు చేస్తూ జులై నుంచి విశాఖలో పరిపాలన ప్రారంభిస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించినప్పటికీ ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీని విశ్వసించలేదని విపక్షాలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ పెద్దలు అధికార బలంతో పట్టభద్రులను ప్రలోభాలకు గురి చేసినప్పటికీ డబ్బులు, వస్తువులు, పంపిణీ చేసినప్పటికీ అధికార వైసీపీని మేధావులైన పట్టభద్రులు ఓడిరచడంతో మార్పు రాష్ట్రమంతటా వస్తుందని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే ఫలితాలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైసీపీ చూడాల్సి వస్తుందన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై వైసీపీ ద్వంద వైఖరి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలా గట్టిగా పోరాటం చేయకపోవడాన్ని పట్టభద్రులు, ఉద్యోగులు గ్రహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో విలువైన వనరులను వైసీపీ నేతలు దోచుకోవడంపై విపక్షాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేయడంపై పట్టభద్రులంతా చైతన్యవంతులై ఈ ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని ప్రతిపక్ష నేతలు అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకతను ఈ ఎన్నికల్లో వ్యక్తం చేసినట్లు స్పష్టమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ గేటు వద్ద మీడియాతో మాట్లాడారు. సైకో పాలన పోవాలి… సైకిల్‌ రావాలి… అన్న సంకల్పంతో రాష్ట్ర ప్రజలంతా ఉన్నారని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోలేదని, 2024లో టీడీపీదే గెలుపు అని, టీడీపీ, పీడీఎఫ్‌ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు చూస్తుంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఎంత ఉందో తెలుస్తోందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img