వయనాడ్ విలయంలో 200 దాటిన మృతులు
. ఊపందుకున్న సహాయ, రక్షణ చర్యలు
. గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరం
. ఊహకందని బాధాకరమైన విపత్తు: విజయన్
తిరువనంతపురం : కేరళలోని వయనాడ్ లో మృత్యుఘోష కొనసాగుతోంది. కొండచరియలు విరిగిపడటంతో పాటు వరదలు ముంచెత్తిన ఘటనల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ అందిన తాజా సమాచారం ప్రకారం.. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 200 దాటింది. కాగా గాయపడిన వాళ్లలో అనేకమంది పరిస్థితి విషమంగా ఉంది. రక్షించిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం వయనాడ్‌లో విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు భారీ వర్షంలోనే సహాయక చర్యలు కొనసాగిస్తు న్నారు. ఆర్మీ జాగిలాలతో శిథిలాల కింద తనిఖీలు చేపట్టారు. కాగా కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో మరో 200 మంది గాయపడ్డారు. ఇక 180 మంది గల్లంతవ్వగా వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతు న్నాయి. ఇప్పటివరకు వెలికితీసిన 143 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి కాగా… 32 మృతదేహాలను అధికారులు బాధిత కుటుంబాలకు అప్పగించారు. సుమారు 78 మృతదేహాలను మెప్పాడి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉంచారు. మరో 32 మంది మృతదేహాలను నీలంబుర్ జిల్లా ఆస్పత్రిలో ఉంచారు. కాగా 91 మంది గల్లంతు కాగా… 191 మంది ఆస్పత్రి పాలయినట్లు చెబుతున్నారు.
అ వయనాడ్‌తో పాటు మరో ఏడు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదలో సర్వం కోల్పోయిన వాళ్ల కోసం ఆహారం, బట్టలు, మందులు అందించేందుకు, రక్తదానం కోసం.. ఆర్థిక సాయం అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ప్రే ఫర్ వయనాడ్ లాంటి హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సహాయ బృందాలు చలియార్ నది నుంచి 15 మృతదేహాల్ని బయటకు తీశాయి.
అ ఇక ముందక్కై గ్రామం శివారులోని ఎలా రిసార్ట్, వన రాణి రిసార్ట్‌లలో తలదాచుకున్న 19 మందిని సైన్యం రక్షించింది. కాగా సైన్యం యుద్ధ ప్రాతిపాదికన ముందక్కై చురాల్‌మల్ మధ్య వారధి నిర్మాణం చేపట్టింది. ఇది పూర్తయితే అంబులెన్స్‌లతో పాటు ఆహారం, తాగునీరు సరఫరా చేసేందుకు అధికారులు సిద్ధమైనారు. ఇప్పటివరకు 481 మందిని రక్షించినట్లు సహాయక బృందాలు ప్రకటించాయి. కాగా జాడ తెలియకుండా పోయిన వందలమంది తేయాకు, కాఫీతోటల కార్మికుల ఆచూకీ తెలియరాలేదు.
కారు ప్రమాదానికి గురైన మంత్రి వీణా జార్జ్
కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మంత్రి గాయాలతో బయటపడ్డారు. వయనాడ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. మలప్పురం జిల్లాలో మంత్రి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంజేరిలోని చెట్టియాంగడి వద్ద ఎదురుగా వస్తున్న స్కూటర్‌ను తప్పించబోయి కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది మంత్రిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మంత్రి వీణా జార్జ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి
మరోవైపు వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రి జార్జి కురియన్ సందర్శించారు. ఆ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న సహాయక చర్యలు, ఇతర పరిస్థితులపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను పరామర్శించారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వయనాడ్‌లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ వెల్లడిరచారు. కేరళకు అన్నివిధాలుగా అవసరమైన సాయాన్ని కేంద్రం అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర విపత్తు సహాయక నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్) నుండి ఇప్పటికే రూ.145 కోట్లు కేరళ ప్రభుత్వానికి విడుదల చేయడం జరిగిందని, ఇంకా ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో రూ.394 కోట్లు మిగిలి ఉన్నట్లు తెలిపారు. పీఎం ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి కురియన్ బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు వెల్లడిరచారు.
ప్రజలంతా సహకరించాలి: సీఎం విజయన్
వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఇప్పటి వరకూ 144 మృతదేహాలను వెలికి తీసినట్లు ప్రకటించారు. కొండచరియలు విరిగిపడిన ఘటనపై సీఎం మాట్లాడారు. ఇది ఊహించని, చాలా బాధాకరమైన విపత్తు అని పేర్కొన్నారు. ‘వయనాడ్‌లో సహాయక చర్యలు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇది ఊహించని, అత్యంత బాధాకరమైన విపత్తు. సహాయ బృందాలు ఇప్పటి వరకూ 144 మృతదేహాలను వెలికితీశారు. అందులో 79 మంది పురుషులు, 64 మంది మహిళలు ఉన్నారు. ఇంకా 191 మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు ప్రయత్నాలు సాగుతున్నాయి. విపత్తు ప్రాంతం నుండి వీలైనంత ఎక్కువ మందిని తరలించేందుకు సహాయ బృందాలు శ్రమిస్తున్నాయి. వారి కోసం సమీపంలోని చర్చిలు, మదర్సాలలో తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేశాం. రక్షించిన వారికి అవసరమైన వైద్య చికిత్సను అందిస్తున్నాం’ అని సీఎం పినరయి విజయన్ తెలిపారు. కాగా వయనాడ్ జిల్లాలో జరిగిన విధ్వంసం నుంచి కోలుకోవడానికి ప్రజలంతా సహాయ సహకారాలందించాలని విజయన్ పిలుపునిచ్చారు. పునర్నిర్మాణ కార్యక్రమాలకు సాయమందించాలని కోరారు. 2018 వరదల సమయంలో ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని, అదే తరహా సాయం మళ్లీ కావాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు పంపించాలని సూచించారు.
ఇదీ జరిగింది…
కేరళలోని వయనాడ్ జిల్లా మెప్పడి, మండక్కై, చూరాల్‌మల, అట్టామల, నూల్‌పుజా గ్రామాల్లో సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒక్కసారిగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో కొండ ప్రాంతం విధ్వంసమై, ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. బురద మట్టిలో కూరుకుపోయారు. తొలుత మండక్కై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడగా, సహాయక సిబ్బంది వెంటనే అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. కొంత మంది బాధితులను సమీపంలోని చూరాల్‌మలలోని వెల్లారిమల పాఠశాలవద్ద ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి పంపించారు. మంగళవారం తెల్లవారుజామున 4.10 గంటలకు ఈ పాఠశాల సమీపంలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శిబిరంసహా చుట్టుపక్కల ఇళ్లు, దుకాణాలు బురదలో కూరుకుపోయాయి. అనేక వాహనాలు అందులో ఇరుక్కుపోయాయి. మండక్కైలో మంగళవారం మధ్యాహ్నం మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి.