టర్కీ, సిరియాలో భూకంప విలయం
. పేకమేడల్లా కూలిన వందలాది భవనాలు
. వేలాదిమంది దుర్మరణం బ శిథిలాల కింద సజీవ సమాధి
. పెరుగుతున్న మృతుల సంఖ్య
. మరుభూమిని తలపిస్తున్న నగరాలు
. అంచనాలకు అందని నష్టం
అంకారా/ఇస్తాంబుల్ : ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా చిగురు టాకుల్లా వణికిపోయాయి. రెండు దేశాల సరిహద్దులో సోమవారం తెల్లవారు జామున సంభవించిన భూకంపం బీభత్సం సృష్టించింది. భూకంపం ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. భూకంప తీవ్రతకు వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 2వేల మందికిపైగా దుర్మరణం చెందగా వేలాదిగా ప్రజలు గాయపడ్డారు. టర్కీలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దీంతో దక్షిణ టర్కీ, ఉత్తర సిరియాలోని అనేక ప్రాంతాల్లో భూకంపం తీవ్ర ప్రభావం చూపిం చింది. టర్కీ కాలమానం ప్రకారం… తెల్లవారుజామున 4.17 గంటలకు ఈ భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 7.8గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడిరచింది. ఆగ్నేయ టర్కీలోని గాజియాన్‌తెప్ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దీంతో దక్షిణ టర్కీ, ఉత్తర సిరియాలోని వివిధ ప్రాం తాల్లో భూకంపం తీవ్ర ప్రభావం చూపించింది. టర్కీలోని దియర్‌బకీర్, సిరియాలోని అలెప్పో, హమా నగరాల్లో వందలాది భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. 7.8 తీవ్రతతో తొలి భూకంపం సంభవించిన తర్వాత గంటల వ్యవధిలో మరో 20 సార్లు శక్తిమంతమైన భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రమాద తీవ్రతగా ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ విలయం చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరుగు తోంది. టర్కీలో మొత్తం 10 ప్రావిన్సుల్లో భూకంపం విలయం సృష్టించగా.. ఇప్పటివరకు 912 మంది మృతి చెందినట్లు , 5300 మందికి పైగా గాయపడినట్లు ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ వెల్లడిరచారు. భూకంప తీవ్రతకు టర్కీలో దాదాపు 3వేల భవనాలు ధ్వంసమయ్యాయి. ఇక సిరియా లోని ప్రభుత్వ నియంత్రణ ఉన్న ప్రాంతాల్లో 326 మంది మరణించినట్లు సిరియా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడిరచింది. మరో 639 మంది గాయపడినట్లు తెలిపింది. కాగా రెబల్స్ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో కనీసం 400 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. భవనాల శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సాయానికి ముందుకొస్తున్న ప్రపంచ దేశాలు
టర్కీ, సిరియా దేశాల్లో ప్రకృతి వైపరీత్యానికి యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత దేశాలకు ఆపన్నహస్తం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. భారత్ సహా నెదర్లాండ్స్, గ్రీస్, సెర్బియా, స్వీడన్, ఫ్రాన్స్ తదితర దేశాలు సహాయక సామగ్రి, ఔషధాలు వంటివి పంపిస్తామని హామీ ఇచ్చాయి.
మృతుల సంఖ్య పదివేలకు చేరే అవకాశం!
భూకంపంలో మరణాల సంఖ్య పదివేలు దాటనున్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) అంచనా వేసింది. టర్కీలో మరణాల సంఖ్య 47 శాతం వెయ్యి నుంచి పది వేల మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇక 27 శాతం మరణాల సంఖ్య వంద నుంచి వెయ్యి మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మరణాల సంఖ్య 20 శాతం వరకు పది వేల నుంచి లక్ష మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు జియోలాజికల్ సర్వే పేర్కొంది. ఈ ప్రాంతంలో వచ్చిన భూకంపాల చరిత్ర ఆధారంగా యూఎస్‌జీఎస్ ఈ అంచనా వేస్తోంది. భూమి ఎక్కువగా కంపనకు గురైన ప్రాంతాల్లో ఉండే జనాభా ఆధారంగా కూడా ఈ లెక్క వేయనున్నారు. అత్యంత ప్రభావానికి గురైన ప్రాంతంలో ఉన్న భవనాల ఆధారంగా కూడా మరణాల సంఖ్యను అంచనా వేయనున్నారు. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని, నష్టం కూడా విస్తృత స్థాయిలో ఉంటుందని యూఎస్‌జీఎస్ తెలిపింది. తాజా భూకంపం వల్ల ఆర్థిక నష్టం బిలియన్ డాలర్ల నుంచి పది బిలియన్ల డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నష్టం మొత్తం టర్కీ జీడీపీలో రెండు శాతం వరకు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
టర్కీలో రెండోసారి, మూడోసారి కంపించిన భూమి
ఓ వైపు సహాయక చర్యలు చేపడుతున్న నేపథ్యంలోనే సోమవారం మధ్యాహ్నం ఆగ్నేయ టర్కీలో రెండోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.6గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 1.24 గంటలకు ఎకినోజు పట్టణానికి దక్షిణ ఆగ్నేయంగా నాలుగు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కాగా సాయంత్రం సమయంలో సెంట్రల్ టర్కీలో భూమి కంపించింది. ఇది రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. సిరియా జాతీయ భూకంపం కేంద్ర అధిపతి రేద్ అహ్మద్ ప్రభుత్వ అనుకూల రేడియోతో మాట్లాడుతూ చరిత్రలో నమోదైన అతిపెద్ద భూకంపమన్నారు. వరుసగా అత్యంత తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా భూకంపం ధాటికి టర్కీ నగరాల్లో బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల్లా కూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సునామీ వచ్చిందన్న వీడియోలు వైరల్
టర్కీ, సిరియాలో భూకంపానికి ఓ పక్క భవనాలు నేలమట్టమవుతుంటే మరోపక్క తీర ప్రాంత నగరాలు, పట్టణాలను సునామీ భయం వెంటాడుతోంది. తీర ప్రాంతంలో సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. డచ్ జర్నలిస్ట్ బ్రెంద స్టోటర్ బస్కలోని తీర ప్రాంతంలో సునామీ తీవ్రతను వెల్లడిరచే వీడియోలను ట్వీట్ చేశారు.

