Monday, October 3, 2022
Monday, October 3, 2022

మైనారిటీలు బిక్కుబిక్కు

క్రైస్తవులపై 300కు పైగా దాడులు: ఎన్జీవో డేటా వెల్లడి

న్యూదిల్లీ: నరేంద్రమోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి మైనారిటీలపై దురాగతాలు పేట్రేగిపోయాయి. ఎస్సీ, ఎస్టీలు, దళితులు, ముస్లింలు, క్రైస్తవులపై తరచూ ‘హిందూత్వ’ దాడులు కొనసాగుతున్నాయి. దీంతో వారు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. సొంత దేశంలోనే రక్షణ కరువై భయాందోళనకు గురవుతున్నారు. 2022 జులై నాటికి దేశంలో 300కుపైగా దాడులు క్రైస్తవులపై జరిగినట్లు ఎన్జీవో డేటా ద్వారా వెల్లడైంది. మైనారిటీలపై దాడులు చేయడం లేదని కేంద్రం నిస్సిగ్గుగా చెబుతోంది. స్వీయ సేవా నివేదికలు (సెల్ఫ్‌ సర్వీసింగ్‌ రిపోర్టులు), తప్పుడు ఆరోపణల ఆధారంగా క్రైస్తవులపై దాడులకు సంబంధించి విచారణ కోరుతూ పిటిషన్‌ దాఖలైందని సుప్రీంకోర్టుకు కేంద్రప్రభుత్వం ఇటీవల వెల్లడిరచింది. ఆగస్టు 28న ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో గల హర్‌చంద్‌పూర్‌ గ్రామానికి చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారు బలవంతంగా మతమార్పిళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. హిందూత్వ కార్యకర్తలు తమ చర్చీలోకి చొరబడి దాడిచేసినట్లు అరెస్టుకు గురైన ముగ్గురు రామవతి, దశరథ్‌, రఘువీర్‌ వెల్లడిరచారు. ఈ ముగ్గురు బలవంతంగా మతమార్పిడులకు పాల్పడుతున్నట్లు హిందూత్వ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలో ఐపీసీలోని సెక్షన్‌ 295 ఏ (ఉద్దేశపూర్వకంగా హానికరమైన చర్యలు, వారి మతం లేదా మత విశ్వాసాలను అవమానించడం ద్వారా మతపరమైన భావాలు రెచ్చగొట్టడం)Ñ ఉత్తరప్రదేశ్‌ మత మార్పిడి నిషేధ చట్టం 2021లోని సెక్షన్‌ 3 Ê 5 (1) కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది. తమను హిందూత్వ కార్యకర్తలు దారుణంగా కొట్టారని ముగ్గురు నిందితులు చెప్పారు. ఈ ముగ్గురు సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు కాగా వీరికి ఆగస్టు 31న బెయిల్‌ లభించింది. వీరి తరపు న్యాయవాది శివకుమార్‌ మాట్లాడుతూ బలవంతంగా మతమార్పిడులకు వీరు యత్నించారా లేదా అన్న కోణంలో విచారణ కొనసాగుతోందని అన్నారు. ‘దేవుడు నన్ను రక్షించాడు. మాపై ఫిర్యాదు చేసిన వారు నా చేయి మెలితిప్పారు. దశరథ్‌, రఘువీర్‌లను దారుణంగా కొట్టారు. మా బైబిళ్లను ఎత్తుకెళ్లారు. బలవంతంగా మతమార్పిడులకు పాల్పడుతున్నట్లు మమ్మల్ని దూషించారు’ అని రామవతి అన్నారు. తాము చర్చిలో ప్రార్థనలు చేసుకుంటుండగా హిందూత్వ కార్యకర్తలు చొరబడి దాడికి తెగబడినట్లు తెలిపారు. తాము ప్రజలను దోచుకుంటున్నట్లుగా ఆరోపించారని, తమకు ఇంకా భయంగానే ఉందని ఆమె అన్నారు. నిందితులపై భౌతిక దాడి గురించి తెలియదని రాయబరేలీ ఎస్పీ అలోక్‌ ప్రియదర్శిని అన్నారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఆగస్టు 31న పంజాబ్‌లోని తార్న్‌ తరణ్‌లో ముసుగులు ధరించిన నలుగురు చర్చిలోకి ప్రవేశించి, పియెటా విగ్రహాన్ని ధ్వంసం చేసి, చర్చీకి చెందిన కారుకు నిప్పు పెట్టారు. ఇన్‌ఫాంట్‌ జీసస్‌ క్యాథలిక్‌ చర్చి పాస్టర్‌ ఫాదర్‌ థామస్‌ పూచలిల్‌ మాట్లాడుతూ సెక్యూరిటీ గార్డులపై తుపాకీ ఎక్కుపెట్టి వారిని బంధించిన తర్వాతే దుండగులు దాడికి పాల్పడినట్లు చెప్పారు. యునైటెడ్‌ క్రిస్టియన్‌ ఫోరం (యూసీఎఫ్‌) తెలిపిన వివరాల ప్రకారం 2022 జులై వరకు క్రైస్తవులకు వ్యతిరేకంగా 302 దాడులు జరిగాయి. హెల్ప్‌లైన్‌ నంబర్‌లకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా డేటాను సేకరించింది. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 80కిపైగా దాడుల కేసులు నమోదయ్యాయి. చత్తీస్‌గఢ్‌లో 60 కేసులు నమోదయ్యాయి. బెంగళూరు ఆర్చ్‌ బిషప్‌ పీటర్‌ మచాడో, నేషనల్‌ సాలిడరిటీ ఫోరం, ఇవాంజెలికల్‌ ఫెలోషిప్‌ ఆఫ్‌ ఇండియా తరపున దాఖలు చేసిన పిటిషన్‌ ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. క్రైస్తవులపై జరుగుతున్న అకృత్యాలపై స్వతంత్ర దర్యాప్తును పిటిషన్‌ డిమాండు చేసింది. క్రైస్తవులపై విద్వేషపూరిత ప్రసంగాలు, హింస, ప్రార్థనలకు విఘాతం కలిగించడం వంటి వాటిపై చర్యలను తీసుకోవడంలో రాష్ట్రం విఫలమైనట్లు పిటిషన్‌ పేర్కొంది. 2021 జనవరి నుంచి డిసెంబరు వరకు క్రైస్తవులపై 505 దాడులు జరిగాయని, 2022లో అవి మరింతగా పెరిగాయని వెల్లడిరచింది. చర్చీల విధ్వంసం, మతమార్పిడుల ఆరోపణలు, భౌతిక దాడులు, హింస, అరెస్టులు, విగ్రహాలుఆస్తుల ధ్వంసం, ప్రార్థనా మందిరాలను అపవిత్రం చేయడం, బైబిళ్లను తగలబెట్టడం, క్రైస్తవ వ్యతిరేక ప్రచారం చేయడం, ఆ సంఘాన్ని దూషించడం వంటివి జరిగాయని పేర్కొంది.
గతవారం జస్టిస్‌ డీవై చంద్రచూద్‌ నేతృత్వ సుప్రీం ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విచారించింది. ఎఫ్‌ఐఆర్‌ల నమోదు, దర్యాప్తు స్థితి, అరెస్టులు, క్రైస్తవులే లక్ష్యంగా జరిగిన ఘటనలపై చార్జిషీట్‌ల గురించి ఎనిమిది రాష్ట్రాల నుంచి సమాచారాన్ని సేకరించాలని కేంద్ర హోం వ్యవహారాల శాఖను ఆదేశించింది. పిటిషన్‌లో పేర్కొన్న ఎనిమిది రాష్ట్రాలలో బీహార్‌, హరియాణా, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ ఉన్నాయి. క్రైస్తవులపై దాడుల వివరాలను నాలుగు వారాల్లోగా భారత సొలిసిటర్‌ జనరల్‌ కార్యాలయానికి అందజేయాలని పిటిషనర్ల తరపు సీనియర్‌ న్యాయవాది కోలిన్‌ గొన్సాల్వేస్‌ను న్యాయస్థానం ఆదేశించింది. అయితే పిటిషన్‌లో ఉన్నవన్నీ అవాస్తవాలని కేంద్రప్రభుత్వం పేర్కొంది. ఇటువంటి మోసపూరిత పిటిషన్‌ల దాఖలు వెనుక ఏదో రహస్య అజెండా ఉన్నట్లు ఆరోపించింది. దేశంలో అనిశ్చితి సృష్టించే ప్రయత్నంగా అభివర్ణించింది. విదేశాల నుంచి సాయం పొందడం కోసం రహస్య అజెండాతో ఇదంతా చేస్తున్నట్లుగా తోస్తోందని అఫిడవిట్‌లో కేంద్ర హోంశాఖ పేర్కొంది. దిల్లీ మైనారిటీ కమిషన్‌ మాజీ సభ్యుడు, యూసీఎఫ్‌ జాతీయ సమన్వయకర్త ఏసీ మైఖేల్‌ మాట్లాడుతూ, ‘దేశంలో ముస్లింలు, క్రైస్తవులు తరచూ దాడులకు గురవుతున్నారు. దాడులంటే భౌతికంగా జరిగినవే కాదు. మతమార్పిడి నిరోధక చట్టాలనూ గమనంలో ఉంచుకోవాల్సి ఉంటుంది. మతస్వేచ్ఛ అన్నది ప్రజలకు ఉంటుందిగానీ ఈ చట్టాల కారణంగా తమకు నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ప్రజలకు ఉండదు’ అని అన్నారు. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఇలాంటి చట్టాలు ఉన్నాయి. ఇటువంటి చట్టాల అవసరం ఏమిటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చట్టాల ఆవశ్యకతను అర్థం చేసుకునేలా ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించాలి. ఎంత మంది బలవంతంగా మతాన్ని మార్చుకుంటున్నారు? నచ్చి మతాన్ని మార్చుకునే వారి పరిస్థితి ఏమిటి? అని మైఖేల్‌ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img