Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

మోకరిల్లేందుకే అమెరికాకు మోదీ

పోర్టుల ప్రైవేటీకరణ వల్లే స్మగ్లింగ్‌, మాదకద్రవ్యాల రవాణా
భారత్‌ బంద్‌లో తెలుగు సీఎంలు పాల్గొనాలి
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ

విశాలాంధ్ర ` ఒంగోలు : ‘సేవ్‌ ఇండియా, మోదీ హటావో’ నినాదంతో ఈనెల 27న జరుగుతున్న భారత్‌ బంద్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ డిమాండ్‌ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని మల్లయ్యలింగం భవన్‌లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రైతు పక్షపాత పార్టీలుగా చెప్పుకునే వైసీపీ, టీఆర్‌ఎస్‌, టీడీపీలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 27న జరిగే భారత్‌ బంద్‌లో జగన్‌, కేసీఆర్‌, చంద్రబాబు పాల్గొనాలన్నారు. తెలుగు రాష్ట్రాలలో బిగ్‌బాస్‌ సంస్కృతి అమలవుతుందన్నారు. ముఖ్యమంత్రులే తిట్ల పురాణాలను ప్రోత్సహిస్తూ రాజకీయాలకు విలువలు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. తిట్ల పంచాంగంలో జగన్‌, కేసీఆర్‌లకు పద్మశ్రీ అవార్డులు ఇవ్వటం సముచితమని ఎద్దేవా చేశారు. రాజకీయ పార్టీల నాయకుల ఇళ్లపై దాడులను ఒక కమ్యూనిస్టుగా ఖండిస్తుంటే ఆయా పార్టీల నాయకులు కులాలు అండగట్టటం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. రాజకీయ నాయకుల ఇళ్లపై దాడులంటే మహిళలపై దాడులేనని తెలిపారు. ఆర్థిక నేరస్తులను కాపాడేందుకే కేంద్ర ప్రభుత్వం బ్యాడ్‌ బ్యాంకులను తెచ్చిందన్నారు. రూ.18 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను ఎగ్గొట్టిన ఆర్థిక నేరగాళ్లు పారిపోయేందుకు మోదీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, ఇప్పుడు వారికి క్లీన్‌చిట్‌లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్‌మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ఆర్థిక నేరస్తులను దేశంలోనే అరెస్టు చేసిన ఘటనలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలో 28 మంది ఆర్థిక నేరగాళ్లలో 27 మంది గుజరాత్‌కు చెందినవారేనని తెలిపారు. పోర్టుల ప్రైవేటీకరణ వల్లే రూ.22 వేల కోట్ల విలువైన హెరాయిన్‌ గుజరాత్‌ నుండి రాష్ట్రానికి రవాణా అయ్యిందన్నారు. గుజరాత్‌లోని పోర్టు అదానీ చేతుల్లో ఉందన్నారు. ఒక్క గుజరాతే కాదు.. దేశంలోని అన్ని పోర్టులు అదానీకి అప్పగించే దిశగా మోదీ పాలన సాగుతోందని నారాయణ చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని గంగవరం, కృష్ణపట్నం పోర్టులను అదానీకి అప్పగించారని, రానున్న కాలంలో మరిన్ని అప్పగిస్తారని అన్నారు. అఫ్గానిస్తాన్‌ నుండి గుజరాత్‌కు హెరాయిన్‌ వచ్చిందని, జల మార్గం స్మగర్లకు, తీవ్రవాదులకు, దొంగలకు రాచమార్గంగా మారుతోంద న్నారు. మోదీ అమెరికా వెళ్లింది.. ఆ దేశం ముందు మోకరిల్లేందుకేనని తెలిపారు. ఇరాన్‌, వెనిజులాలు భారత్‌కు అతి తక్కువ ధరలకే పెట్రో ఉత్పత్తులు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా, అన్ని ఒప్పందాలు జరిగినా కేవలం అమెరికా అనుమతి కోసమే మోదీ అమెరికా వెళ్లారన్నారు. ప్రపంచ మార్కెట్‌లో రోజురోజుకు ముడి చమురు బ్యారల్‌ ధరలు గణనీయంగా తగ్గుతున్నా, భారత్‌లో మాత్రం పెట్రో ధరలు గణనీయంగా పెరుగుతున్నాయ న్నారు. కేంద్రం 30 శాతం, రాష్ట్రం 30 శాతం పన్నుల రూపంలో భారాలు వేయటమే కారణమని అన్నారు. సీపీఐ ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎం.ఎల్‌.నారాయణ, మాజీ కార్యదర్శి ఎం.వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img