Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

మోటార్లకు మీటర్లంటే రైతులకు ఉరే

అన్నదాతలను ఆత్మహత్యలవైపు పురిగొల్పుతున్న జగన్‌
డబ్బు వసూలు చేయనప్పుడు మీటర్లెందుకు
అనంతపురం ధర్నాలో సీపీఐ కార్యదర్శి నారాయణ

విశాలాంధ్ర.అనంతపురం అర్బన్‌: వ్యవసాయసాయ పంపుసెట్లకు విద్యుత్‌ మీటర్లు బిగించడం రైతుల మెడలకు ఉరితాళ్లు బిగించడమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ అన్నారు. వ్యవసాయ పెంపు సెట్లకు విద్యుత్‌ మీటర్లు బిగిస్తామే గానీ బిల్లులు వసూలు చేయబోమని మరోసారి వైసీపీ నాయకులు రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రైతుల మోటార్లకు మీటర్లు బిగించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను నిరసిస్తూ శుక్రవారం సీపీఐ జిల్లా సమితి అధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, రైతు సంఘం, ప్రజాసంఘాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎద్దుల బండిపై ఇద్దరు రైతులు ఉరి వేసుకుని వ్రేలాడినట్లుగా నగరంలోని తాడిపత్రి బస్టాండ్‌ నుంచి పాతఊరు విద్యుత్‌ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం విద్యుత్‌ కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్‌ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా నారాయణ మాట్లాడుతూ మీటర్ల కోసం నాలుగైదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనీ, డబ్బు వసూలు చేయని పక్షంలో వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసి వృథాగా మీటర్లు ఎందుకు బిగించాలని సీఎం జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. జగన్‌ సీఎం హోదాలో ఖర్చు చేసే ప్రతి పైసా ఆయన సొంత సోత్తేమి కాదని, ప్రజలు పన్నుల రూపంలో ప్రభుత్వానికీ కట్టే డబ్బు అన్నారు. జగన్‌ ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం పోయిందని ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి వున్నా మోటార్లకు మీటర్లు బిగించొద్దని సూచించారు. పాదయాత్ర సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు, అసెంబ్లీలో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలని సీఎంకు సూచించారు. ఉచిత విద్యుత్‌ కొనసాగిస్తామని చెప్పి మాట మార్చి నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ గతంలో అనేక వాగ్దానాలు చేసి వాటన్నిటినీ తుంగలో తొక్కాడని విమర్శించారు. సీఎం జగన్‌ సహా మంత్రులు, ఎమ్మేల్యేలు, ఎంపీలు వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లు బిగించడంపై రైతులను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి మాటలు నమ్మే స్థితిలో రైతులు లేరని చెప్పారు. ప్రపంచ బ్యాంకు చేతిలో ప్రధాని మోదీ, మోదీచేతిలో సీఎం జగన్‌ కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజలు ఎవ్వరికి బానిసలు కాదని సీపీఐ వారికి అండగా నిలిచి పోరాడుతుందని నారాయణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి.జగదీశ్‌, జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణ స్వామి, మల్లికార్జున, సత్య సాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరాములు, రాజారెడ్డి, రంగయ్య, కేశవ రెడ్డి, కాటమయ్య, లింగమయ్య, పిట్ల రామకృష్ణ, నారాయణ స్వామి, పెద్దయ్య,పద్మావతి, అమీనమ్మ, శకుంతల, నగర సహాయ కార్యదర్శులు రమణ, అల్లిపిర, రూరల్‌ మండల కార్యదర్శి రమేష్‌, ఏఐటీయూసీి నాయకులు రాజేష్‌ గౌడ్‌, కృష్ణుడు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకుడు మనోహర్‌, ఏఐవైఎఫ్‌ నాయకులు సంతోష్‌ కుమార్‌, ఆనంద్‌, ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు చిరంజీవి, కుళ్లాయప్ప, తదితరులు పాల్గొన్నారు.
జగన్‌ పాలనలో మార్పురావాలి : నారాయణ
రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రుల ముఖలు మార్చడం కాదన్నారు. చేతనైతే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, బొత్ససత్యనారాయణని మార్చి చూడాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సవాల్‌ విసిరారు,శుక్రవారం గుంతకల్లు లోని సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ పరిపాలనలో మార్పు రావాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయనీ, ప్రశ్నించే వారిని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అక్టోబరు 14 నుంచి 18 వరకు విజయవాడలో జరిగే సీపీఐ జాతీయ మహాసభల్లో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.జగదీశ్‌, గుంతకల్లు నియోజవర్గం కార్యదర్శి బి.గోవిందు, పట్టణ కార్యదర్శి వీరభద్రస్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img