Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

మోటార్లకు మీటర్లు తప్పదు

. కొత్తగా 41 వేల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు
. మార్చి నాటికి నూరుశాతం లక్ష్యం
. రైతు ఖాతాకే విద్యుత్‌ సబ్సిడీ
. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తామని, రాయితీ మొత్తం రైతుల ఖాతాల్లో వేస్తామని ఇంధన, విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడిరచారు. సచివాలయం మూడో బ్లాక్‌లో ఇంధన శాఖ అధికారులతో ఆయన గురువారం సమీక్ష చేశారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఇప్పటివరకు 41 వేల కొత్త వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేసిందని, మరో 77 వేల కొత్త కనెక్షన్లను రైతులకు ఇవ్వబోతుందన్నారు. రైతులకు సంబంధించిన ఉచిత విద్యుత్‌ భారాన్ని ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోందని, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు తరువాత కూడా ఆ బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసి, రైతులు ఏ మేరకు విద్యుత్‌ వినియోగిస్తున్నారో అధికారులు అధ్యయనం చేశారని గుర్తుచేశారు. ఆ జిల్లాలో సాధారణంగా ఉచిత వ్యవసాయ విద్యుత్‌ వినియోగానికి ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తం కంటే, 30 శాతం తక్కువగానే రైతులు విద్యుత్‌ వినియోగిస్తున్నట్లు తేలిందన్నారు. దీంతో ఉచిత విద్యుత్‌ భారం ప్రభుత్వంపై 30శాతం తగ్గుతుందని గుర్తించామని, ఇదే విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని, 2023 మార్చి నాటికి రాష్ట్రంలో18 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేయాలని సూచించారు. ఇప్పటికే 70శాతానికిపైగా రైతులు బ్యాంక్‌ ఖాతాలు తెరిచారని, అక్టోబర్‌ 15 నాటికి నూరుశాతం బ్యాంక్‌ ఖాతాలు తెరవడం, ఆధార్‌ లింకింగ్‌ ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. బ్యాంకులతోపాటు తపాలా కార్యాలయాల్లోనూ రైతులు ఖాతాలు తెరవవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఎలాంటి అంతరాయాలు లేకుండా అందించాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుపై విపక్షాలు రైతుల్లో అపోహలు సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. స్మార్ట్‌ మీటర్లు రైతుల్లో జవాబుదారీతనం, తమ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసే సబ్సిడీ మొత్తాన్ని వారే స్వయంగా డిస్కమ్‌లకు చెల్లించడం ద్వారా నాణ్యమైన విద్యుత్‌పై వారు ప్రశ్నించే హక్కును మరింతగా పొందుతారని అన్నారు. సమీక్షలో ఇంధనశాఖ కార్యదర్శి విజయానంద్‌, ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్‌, జేఎండీ పృథ్వీరాజ్‌, డిప్యూటీ సెక్రటరీ కుమార్‌రెడ్డి, డిస్కమ్‌ సీఎండీలు కె.సంతోశ్‌రావు, జె.పద్మా జనార్థన్‌రెడ్డిపాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img