Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

‘మోదీ’జాలంతో అంతా అదానీ వశం

. కీలక రంగాలన్నీ ‘అదానీ’మయం
. 2014 తర్వాత అమాంతం పెరిగిన వ్యాపారవేత్త ఆస్తులు
. సంపన్నుల్లో 609 స్థానం నుంచి రెండో స్థానానికి చేరిక
. దేశమే పణంగా మోదీఅదానీ దోస్తీ
. ఆయన కోసం మారిపోయిన విధానాలు
. లోక్‌సభలో రాహుల్‌ విమర్శలుప్రశ్నలు

న్యూదిల్లీ: దేశాన్ని పణంగా పెట్టేసిన మోదీఅదానీ దోస్తీ అంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఘాటుగా విమర్శించారు. మోదీ జాలంతో అంతా అదానీ వశమైందని వ్యాఖ్యానించారు. కీలక రంగాలన్నీ అదానీ నియంత్రణలోకి వెళ్లిపోగా 2014 తర్వాత ఆయన అస్తులు అమాంతరం పెరిగి సంపన్నుల జాబితాలో 609 స్థానం నుంచి రెండోస్థానానికి ఎగబాకారని రాహుల్‌ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద చర్చలో భాగంగా లోక్‌సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ, మోదీఅదానీపై ప్రశ్నలతో పాటు విమర్శనాస్త్రాలు సంధించారు.
2014 తర్వాత ఏం మాయ జరిగింది? ప్రపంచ సంపన్నుల జాబితాలో గౌతం అదానీ రెండో స్థానానికి ఎలా రాగలిగారు? ఇదంతా ‘మోదీ’జాలం కాదా! అంటూ కాంగ్రెస్‌ నాయకుడు చేసిన వ్యాఖ్యలపై అధికారపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. చీకట్లో బాణాలు వేయొద్దు… పక్కా ఆధారాలు ఉంటేనే మాట్లాడాలని రాహుల్‌నుద్దేశించి న్యాయమంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. మోదీకి సంబంధించిన రెండు చిత్రాలను రాహుల్‌ సభలో ప్రదర్శించారు. మోదీఅదానీ మధ్య సాన్నిహిత్యాన్ని ఈ చిత్రాల ద్వారా నిరూపించే ప్రయత్నాన్ని రాహుల్‌ చేశారు. అదానీ వ్యాపార సామాజ్య్రాన్ని విస్తరించేందుకు ప్రధాని సహకరించారని రాహుల్‌ నొక్కిచెప్పారు. వివిధ రంగాల్లో విదేశీ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సాయం చేశారన్నారు. అదానీతో కలిసి ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారని ఆయన మోదీని ప్రశ్నించారు. 20ఏళ్లలో బీజేపీకి ఎలక్టోరల్‌ బాండ్లతో సహా అదానీ ఇచ్చిన డబ్బు ఎంతో చెప్పగలరా అని అడిగారు. హిందూస్థాన్‌ ఎయిరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) సామర్థ్యాన్ని పట్టించుకోకుండా రఫేల్‌ ఒప్పందాన్ని విదేశీ కంపెనీతో కుదుర్చుకోవడంపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టినందుకు మోదీపై రాహుల్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్‌ జోడో యాత్ర క్రమంలో దేశవ్యాప్తంగా తిరిగిన తనకు అన్ని చోట్ల ‘అదానీ’ పేరొక్కటే వినిపించిందన్నారు.అదానీ సంపద ఎనిమిది బిలియన్‌ డాలర్ల నుంచి 140 బిలియన్‌ డాలర్ల (2014-22లో)కు ఎలా పెరిగిందని ప్రజలు తనను ప్రశ్నించారని రాహుల్‌ సభకు తెలిపారు. ప్రధాని పర్యటించిన దేశాలు అదానీకి కాంట్రాక్టులు అప్పగిస్తున్నాయని విమర్శించారు. ప్రధాని మోదీకి, అదానీకి మధ్య బంధం ఇప్పటిది కాదని, మోదీ గుజరాత్‌కు సీఎంగా ఉన్నప్పుడే మొదలైందన్నారు. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ పరిశోధన సంస్థ నివేదికనూ ప్రస్తావిస్తూ విదేశాల్లో అదానీకి ఉన్న నకిలీ కంపెనీల గుట్టును ప్రభుత్వం రట్టు చేయాలని, ఇది దేశ భద్రతాంశమని రాహుల్‌ నొక్కిచెప్పారు. ఈ వ్యవహారంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) లేక సుప్రీంకోర్టు నేతృత్వ విచారణను ప్రతిపక్షం డిమాండ్‌ చేస్తోందన్నారు. అదానీకి ఆరు ఎయిర్‌పోర్టులు అప్పగించేశారు. అవి కూడా లాభాల్లో ఉన్న ముంబై ఎయిర్‌పోర్టు వంటివి జీవీకే నుంచి లాక్కొని అదానీ వశపర్చారన్నారు. ఇందుకోసం సీబీఐ, ఈడీని అస్త్రాలుగా వినియోగించారు’ అని రాహుల్‌ ఆరోపించారు. రాహుల్‌ ఆరోపణలను రుజువు చేయాలని అధికార పక్ష సభ్యులు డిమండ్‌ చేశారు. స్పీకర్‌ బిర్లా కూడా అభ్యంతరం వ్యక్తంచేస్తూ రాష్ట్రపతి ప్రసంగంపై దృష్టిపెట్టాలని సూచించారు. రాహుల్‌ మాట్లాడుతూ ‘భారత్‌పై కేస్‌ స్టడీ జరగాలి. హార్వర్డ్‌ వంటి బిజినెస్‌ స్కూళ్లు రాజకీయాలు, వాణిజ్యం మధ్య సంబంధంపై కేస్‌ స్టడీ చేపట్టాలి. ఇందులో ప్రధానికి గోల్డ్‌మెడల్‌ ఇవ్వాలి’ అని అన్నారు. అదానీ డ్రోన్లు తయారు చేయలేదు గానీ హాల్‌, ఇతర కంపెనీలు వాటిని తయారు చేశాయి. ప్రధాని ఇజ్రాయిల్‌ వెళితే అదానీకి కాంట్రాక్ట్‌ దక్కింది. వీరికి నాలుగు రక్షణ సంస్థలు ఉన్నాయి. అనుభవం లేదు. అయినా చిన్న ఆయుధాలు, స్నైపర్‌ రైపిళ్లు వంటివి అదానీ తయారు చేస్తున్నారు. విమానాలు, డ్రోన్ల నిర్వహణ కూడా ఆయనకే అప్పగించేశారు. ఎయిర్‌పోర్టుల బిజినెస్‌లో అదానీ గ్రూపుకు 30శాతం మార్కెట్‌ వాటా ఉంది. ఇజ్రాయిల్‌భారత్‌ రక్షణ సహకారంలో 90శాతాన్ని నియంత్రిస్తోంది. భారత విదేశీ విధానం అదానీ వ్యాపార విస్తరణ కోసం మారిందని రాహుల్‌ విమర్శించారు. అదానీ గ్రూపులో ఎల్‌ఐసీ పెట్టుబడులు ఎందుకని ప్రజలు తనను అడిగారని, ప్రభుత్వ రంగ బ్యాంకులోని వేలాది కోట్ల ప్రజా ధనాన్ని అదానీ సహాయార్థం మోదీ ఇచ్చేశారని ఆరోపించారు. అగ్నివీర్‌ పథకాన్ని కూడా రాహుల్‌ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img