Friday, December 1, 2023
Friday, December 1, 2023

మోదీతో దేశం అధోగతిపాలు

27న భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలి : మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ పిలుపు

ప్రభుత్వ రంగ పరిశ్రమలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు
మూడు వ్యవసాయ చట్టాలు అమలైతే గ్రామీణభారతం కుదేలు
పరిశ్రమలు, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి
27న భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలి
మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ పిలుపు

విశాలాంధ్ర ` మైలవరం : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలను అవలంబిస్తూ దేశాన్ని అధోగతిపాలు చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ విమర్శించారు. ఈ నెల 27వ తేదీన భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం కృష్ణా జిల్లా మైలవరంలో సీపీఐ అధ్వర్యాన భారీ పాదయాత్ర, బైక్‌ ర్యాలీ నిర్వహించారు. తొలుత మైలవరం నియోజక వర్గంలోని రెడ్డిగూడెం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్‌ మండలాల నుంచి పది దళాలు బైక్‌ ర్యాలీలుగా మైలవరం చేరుకున్నాయి. అక్కడ లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజీ వద్ద నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల్లో పాదయాత్ర, బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఆఫీసు సెంటర్‌లో జరిగిన సభలో జల్లి విల్సన్‌ మాట్లాడుతూ 70 ఏళ్లపాటు దేశ ప్రజలు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు కష్టపడి అభివృద్ధి చేసిన ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు 32 మంది ఆంధ్రుల ప్రాణ త్యాగాలతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సైతం మోదీ ప్రభుత్వం కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు అమలు చేస్తారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, సామా జిక న్యాయం సాధ్యమవుతుందని తెలిపారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే రిజర్వేషన్లు అమలు చేయబోరని, కార్పొరేట్లు తమకు నచ్చినవారికి ఉద్యోగాలు ఇస్తారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుం దని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ సర్కారు చేసిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలు అమలైతే రైతుల చేతుల్లో భూములు ఉండవని, కార్పొరేట్ల చేతిలోకి వ్యవసాయం వెళుతుందని, రైతులకు, వారిపై ఆధారపడిన వ్యవసాయ కార్మికులకు పని ఉండదని, చేతి వృత్తులవారు చితికిపోతారని, గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని తెలిపారు. కార్మిక వర్గానికి కూడా మోదీ సర్కారు తీవ్ర ద్రోహం చేస్తోందని, 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్పు చేసి కార్మికులను యజమానులకు కట్టుబానిసలుగా మార్చివేస్తోందని మండిపడ్డారు. మరోవైపు నిత్యావసర ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నా యని, సామాన్యులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందు లకు గురిచేస్తూ కార్పొరేట్లకు మేలు చేస్తున్న మోదీ సర్కారుకు తగిన బుద్ధి చెప్పేందుకు, దేశాన్ని, రైతులను, వ్యవసాయ రంగాన్ని, కార్మికులు, ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడుకునేందుకు భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని జల్లి విల్సన్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూడా బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సీహెచ్‌ కోటేశ్వరరావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ, అమిత్‌ షా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని సర్వనాశనం చేస్తోందన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ విష స్వభావాన్ని బహిర్గతం చేసి రాజ్యాంగాన్ని సైతం తుంగలోకి తొక్కి తమ ఇష్టానుసారం పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మూడు వ్యవ సాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పది నెల లుగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోకుండా కార్పొరేట్ల కోసమే కేంద్రం పని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి, బీజేపీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలందరూ బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్ర మంలో సీపీఐ ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, విజయవాడ రూరల్‌ మండలాల కార్యదర్శులు కన్నా వెంకటేశ్వరరావు, గూడూరు శ్రీనివాసరెడ్డి, ఉప్పే నరసింహారావు, సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు బానోతు పెద్దబాలు నాయక్‌, బి.వెంకట్రావు, జి.రాము, దిరిశనపు బుడ్డాయ్‌, కె.రత్నకుమారి, అడపా సుబ్బారావు, భూక్యా దేశాయ్‌, ఆంగోతు నాగు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img