Monday, June 5, 2023
Monday, June 5, 2023

మోదీని గద్దె దించండి

. మైనార్టీలను అభద్రతాభావానికి గురి చేస్తున్న బీజేపీ
. తొమ్మిదేళ్లలో విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప అభివృద్ధి శూన్యం
. రాష్ట్రంలో ఉత్సాహంగా వామపక్షాల ‘ప్రచార భేరి’

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ప్రజల మధ్య కుల,మత, ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవస్థలను విధ్వంసం చేస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘బీజేపీ హఠావో దేశ్‌ బచావో’ నినాదంతో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార భేరి కార్యక్రమాన్ని విజయవాడలోని చిట్టినగర్‌ జోడుబొమ్మల సెంటర్‌లో ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యాసరాల వస్తువులు ఆకాశనంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలో వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామి ఇచ్చి, 9 సంవత్సరాలు గడిచినా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. యువతను నిలువునా దగా చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్యాస్‌ ధరలు తగ్గించాలని గతంలో దిల్లీ నగర వీధుల్లో ధర్నాలు చేసిన బీజేపీ నాయకులు, అధికారంలోకి రాగానే తగ్గించకపోగా ఆనాడు రూ.410 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.1200 చేశారని విమర్శించారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ఒక్కొక్కరి ఖాతాలో 15లక్షల వేస్తామని చెప్పి పేదలను మోసగించారని, ఇలాంటివి అనేకం ఓట్ల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం, దగా చేశారని విమర్శించారు. దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టి, పేదలను బికారులుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిలో అత్యంత వెనుకబడిన నైజీరియా కంటే మనదేశం దారిద్య్రంలో మొదటిస్థానికి చేరుకుందంటే మోదీ పాలన ఎలా ఉందో తేటతెల్లమవుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విషయంలో ప్రతి అంశంలోనూ మోదీ మోసం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదని, కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మింలేదన్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్‌ ప్యాక్టరీని అదానికి అప్పగించి ఊడిగం చేయాలనే ఉద్ధేశంతో విశాఖ ఉక్కును దివాలా తీయించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణమైన మోదీ పాలనకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తందానతాన అంటూ రాష్ట్ర ప్రయోజనాలను దిల్లీకి తాకట్టుపెడుతున్నారని విమర్శించారు. కోడికత్తి డ్రామాతో అధికారంలోకి వచ్చారని మొత్తానికి నాలుగేళ్ల తరువాత ఎన్‌ఐఏ తేల్చిందన్నారు. వివేకానంద హత్య కేసు కూడా రోజుకోక మలుపు తిరుగుతుందన్నారు. మోసగాళ్లు అధికారంలోకి రాకుండా ఉండేందుకు ప్రజలందరూ స్పందించాలని, సీపీఐ, సీపీఎం ఎర్రజెండా పార్టీలు చేస్తున్న పోరాటానికి సంఫీుభావం తెలపాలని కోరారు. సీపీఐ, సీపీఎం నాయకులు ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ కేంద్రంలోని నరేర్రద మోదీ, రాష్ట్రంలో జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్‌, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌, సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావులతో పాటు సీపీఐ, సీపీఎం శ్రేణులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో భారీ ర్యాలీ జరిగింది. అనంతరం ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడారు.
గాడ్‌ ఫాదర్‌ మోదీకి దత్తపుత్రుడు జగన్‌ దాసోహండి.జగదీశ్‌ ప్రధాని నరేంద్రమోదీకి దత్తపుత్రుడైన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు దాసోహం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీశ్‌ విమర్శించారు. మోదీ హఠావో భారత్‌ బచావో కార్యక్రమంలో భాగంగా గుంతకల్లులోని బీరప్ప గుడి సర్కిల్‌ హమాలీ కార్యాలయం నుంచి బైక్‌ ర్యాలీని జగదీశ్‌ శనివారం ప్రారంభించారు. పురవీధుల్లో బైక్‌ ర్యాలీ కొనసాగింది. సీపీఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జగదీశ్‌ మాట్లాడుతూ ఐదు కోట్ల మంది ఆంధ్రులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నా జగన్‌ నోరు మెదపడం లేదన్నారు. బీజేపీ అండ ఉంటే మళ్లీ అధికారంలోకి వస్తాననే ధీమాతో జగన్‌ ఉన్నారన్నారు. మోదీ ఈవీఎంల ట్యాంపరింగ్‌ ద్వారా గెలిచేందుకు యత్నిస్తుండగా, ఆయన అండతో గెలవాలని జగన్‌ ప్రయత్నిస్తున్నారన్నారు. అందుకే అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వినియోగించని ఈవీఎంలను మోదీ భారత్‌లో వాడుతున్నారని అన్నారు. విపక్షాలన్నీ ఏకమై బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు జరపాలని డిమాండ్‌ చేస్తున్నా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎందుకు బ్యాలెట్‌ పెట్టడం లేదని ప్రశ్నించారు. బైక్‌ ర్యాలీలో సీపీఐ మండల కార్యదర్శి రాము రాయల్‌, మండల పట్టణ సహాయ కార్యదర్శు లు ఎస్‌ ఎండి గౌస్‌ ,రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
రాక్షస పాలన నుంచి దేశాన్ని రక్షించుకుందాం జంగాల నరేంద్ర మోదీ రాక్షస పాలన నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిరంకుశ విధానాలపై ఉభయ కమ్యూనిస్టుల(సీపీఐసీపీఎం) ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రచార భేరి శనివారం పాత గుంటూరులో కొనసాగింది. మోదీ, అమిత్‌ షా హఠావోదేశ్‌ బచావో అంటూ వామపక్ష శ్రేణులు పెద్దఎత్తున నినదించారు. బీజేపీ మతోన్మాద, కార్పొరేట్‌ అనుకూల, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను తిప్పికొట్టండని, రాజ్యాంగ ప్రజాస్వామిక హక్కులను కాపాడండని సీపీఐసీపీఎం ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జంగాల అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ నరేంద్ర మోదీ పాలనలో పెరిగిన ధరల భారాలతో పేదలు, మధ్యతరగతి ప్రజలు రెండు పూటల తినడానికి కూడా లేని దుస్థితి నేడు దేశంలో నెలకొందన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజులలో ధరలు తగ్గిస్తామని, నిరుద్యోగం లేని భారతదేశాన్ని నిర్మిస్తామంటూ చేసిన వాగ్థానాలు నీటి మూటలుగా మిగిలాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం నగర కార్యదర్శులు కోట మాల్యాద్రి, కె.నళినీకాంత్‌, నగర కార్యవర్గ సభ్యులు ఆకిటి అరుణ్‌ కుమార్‌, రావుల అంజిబాబు, చల్లా మరియదాసు, బి.యశ్వంత్‌్‌ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం మంగళగిరి నాలుగో వార్డులో జరిగిన ప్రచార భేరి కార్యక్రమంలో జంగాల, నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు చెంగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు ఒకటవ డివిజన్‌లో సీపీఐ, సీపీఎం అధ్వర్యాన నిర్వహించిన ప్రచార భేరిలో సీపీఐ రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఉండి, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాలలో ప్రచార భేరి కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img