Monday, October 3, 2022
Monday, October 3, 2022

మోదీపై ప్రజాగ్రహం

పెట్రోధరల పెంపు ప్రజాబ్యాలెట్‌లో తీవ్ర వ్యతిరేకత తెలిపిన ప్రజలు
విశాఖ ఉక్కు రక్షణ కోసం 14 నుంచి పాదయాత్ర
21న విశాఖలో భారీ బహిరంగసభ
విద్యుత్‌ చార్జీలపై 9న వామపక్షాల భేటీ : రామకృష్ణ

బ్యూరో`తిరుపతి : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వంద రూపాయలు దాటించిన ఏకైక ప్రధానిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నిరసిస్తూ సీపీఐ తిరుపతి నగర సమితి అధ్వర్యంలో వారం రోజులు పెట్రోల్‌ బంకుల వద్ద ప్రచార కార్యక్రమాలు చేపట్టి, ప్రజా బ్యాలెట్‌ నిర్వహించారు. ప్రజాబ్యాలెట్‌ స్లిప్‌ల లెక్కింపు బైరాగి పట్టెడ సీపీఐ కార్యాలయంలో మంగళవారం జరిగింది. మొత్తం 4234 ఓట్లు పోల్‌కాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా 4083 ఓట్లు, అనుకూలంగా 49 ఓట్లు వచ్చాయి. 103 ఓట్లు చెల్లలేదు. కె.రామకృష్ణ ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ 2014లో లీటర్‌ పెట్రోలు రూ.60 ఉండగా నేడు రూ.109కు చేరిందన్నారు. డీజిల్‌ ధరను సెంచరీ కొట్టించారని, గ్యాస్‌ సిలిండర్‌ వెయ్యి రూపాయలకు చేరువైందని విమర్శించారు. ప్రజల నడ్డివిరిచే విద్యుత్‌ సంస్కరణలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నదని రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ మోటార్లకు మీటర్లు బిగించడానికి శ్రీకారం చుడుతోందన్నారు. పెరిగిన విద్యుత్‌ చార్జీలపై ఈనెల 9వ తేదీన విజయవాడలో వామపక్షపార్టీలు సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తాయన్నారు. జగన్‌ ప్రభుత్వం ప్రమాదకరంగా మారిందని, కాంట్రాక్టర్లకు కనీసం బిల్లులు చెల్లించడం లేదని, అలాంటప్పుడు కొత్త పనులు చేయడానికి ఎవరు ముందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో 1.20 కోట్ల రేషన్‌ కార్డులు ఉన్నాయని, వీటిలో అనర్హులైన వైసీపీ కార్యకర్తల కార్డులే అధికంగా ఉన్నాయన్నారు. రేషన్‌ బియ్యం యదేచ్ఛగా బ్లాక్‌ మార్కెట్‌కు తరలివెళుతోందని చెప్పారు. రేషన్‌ పంపిణీకి ఏర్పాటు చేసిన వాహనాలు నిరుపయోగమన్నారు. ఇంటి స్థలాల కోసం 32 లక్షల మందిని ఎంపిక చేస్తే అందులో సగంమంది అనర్హులుగా ఉన్నారని వివరించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుకు అప్పగిస్తున్నా జగన్‌ చూస్తూ నాటకాలాడుతున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఈనెల 14వ తేదీన అనంతపురం జిల్లా నుండి పాదయాత్ర చేపడుతున్నామన్నారు. 21వ తేదీ ముగింపు సందర్భంగా విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. సభకు సీపీఐ పార్లమెంటరీ పార్టీ నేత బినయ్‌ విశ్వం, జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ హాజరవుతారని తెలిపారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా తొమ్మిది నెలలుగా రైతుసంఘాలు పోరాటం చేస్తున్నా కేంద్రం వారితో చర్చలు జరపడం లేదన్నారు. ఈ నెల 27న రైతుసంఘాలు ఇచ్చిన భారత్‌బంద్‌కు సీపీఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందని చెప్పారు. బంద్‌లో అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.రామానాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు జనార్దన్‌, చిన్నం పెంచలయ్య, మురళి, నదియా, నగర కార్యదర్శి విశ్వనాథ్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img