Monday, February 6, 2023
Monday, February 6, 2023

కార్పొరేట్‌కు మోదీ ఊడిగం

సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ
ఏఐటీయూసీ, ఏఐకేఎస్‌, బీకేఎంయూ, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ మానవహారానికి సంఫీుభావం
అవకాశవాద రాజకీయాలు ఎండగట్టాలి : ఓబులేసు
రైతు, వ్యవసాయ కూలీల హక్కుల హరింపు : జల్లి విల్సన్‌, ఆవుల శేఖర్‌
రైతు ఉద్యమం చారిత్రాత్మకం : రావుల వెంకయ్య
మహిళా సంక్షేమంపై మోదీ దగా : దుర్గా భవానీ

అమరావతి : కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చాక బహిరంగంగా కార్పొరేట్‌ కంపెనీలకు ఊడిగం చేస్తూ, ప్రజా సంపదను వారికి దోచిపెడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో.. సేవ్‌ ఇండియా, సేవ్‌ పబ్లిక్‌ సెక్టార్‌, సేవ్‌ అగ్రికల్చర్‌ నినాదంతో దేశవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం విజయవాడలో ఏఐటీయూసీ, ఏఐకేఎస్‌, బీకెఎంయూ, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ ప్రజా సంఘాలు మానవహారం నిర్వహించాయి. ఈ ప్రజాసంఘాల అధ్వర్యంలో తొలుత విజయవాడ దాసరి భవన్‌ నుంచి ఏలూరు లాకుల వద్ద గల నీలం సంజీవరెడ్డి విగ్రహం వరకు ప్రదర్శనగా తరలివచ్చి కొద్ది సేపు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ నాడు బ్రిటీష్‌ సామ్రాజ్య వాదాన్ని పారద్రోలడానికి క్విట్‌ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారని, అది స్వాతంత్య్ర పోరాటం సంపూర్ణంగా రూపుదిద్దుకోవడానికి దోహదపడిరదని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో నేడు క్విట్‌ మోదీ ఉద్యమాన్ని

కొనసాగించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. గుజరాత్‌ గ్యాంగ్‌ దేశాన్ని దోపిడీ చేస్తోందన్నారు. లాభాలు వస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్‌కు ధారాదత్తం చేస్తున్నారని దుయ్యబట్టారు. కరోనాలో సాధారణ ప్రజానీకం అతలాకుతలమైతే, అదానీ, అంబానీలకే మేలు జరిగేలా బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలు న్నాయని విమర్శించారు. రామకృష్ణ మాట్లాడుతూ నాడు మోదీ ధరలు తగ్గిస్తామని, ఉద్యోగాలిప్పిస్తామని, విదేశాల్లోని నల్లధనం తీసుకువచ్చి పౌరులకు పంపిణీ చేస్తామంటూ అధికారంలోకి వచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో ధరలేమైనా తగ్గాయా అని ప్రశ్నించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి, ఉన్న ఉద్యోగా లను సైతం ఊడగొట్టారన్నారు. కడపలో ఉక్కు కర్మాగారం పెడతామని చెప్పిన పెద్దలు సైతం ఉన్న ఉక్కు కర్మా గారాన్ని ప్రైవేట్‌ పరం చేస్తున్నారని, విశాఖ ఉక్కు ఉద్య మాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలకు విస్తరిస్తామని, క్విట్‌ మోదీ నినాదం బలంగా వినిపిస్తామని స్పష్టం చేశారు.
ధర్నా చౌక్‌లో ప్రజా సంఘాల నిరసన
ఈ మానవహారం అనంతరం ప్రజా సంఘాల నేతలు ప్రదర్శనగా ధర్నా చౌక్‌ దగ్గర రైతు సంఘాల సమన్వయ సమితి అధ్వర్యంలో చేపట్టిన ధర్నా వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ) ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్‌, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ సంఘం(ఏఐఏడబ్ల్యూ) ఉపాధ్యక్షులు కళ్యాణ్‌ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 100 ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరించే నిర్ణయాలకు తెలుగు రాష్ట్రాలలోని రెండు ప్రభుత్వాలు మద్దతివ్వడం దుర్మార్గమన్నారు. పాలకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం లాలూచీ పడుతున్నారని విమర్శించారు. నాటి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వచ్చిన క్విట్‌ ఇండియా ఉద్యమం తరహాగా మోదీ విధానాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రజా ఉద్యమాలు రావాలని పిలుపునిచ్చారు. అవకాశవాద రాజకీయాలను ఎండ గట్టడానికి ప్రజాసంఘాలు సమాయాత్తం కావాలన్నారు. ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య మాట్లాడుతూ నాడు బ్రిటీష్‌ పాలకుల తరహాగా మోదీ అవే విధానాలను అవలంభిస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఎనిమిది నెలలకుపైగా దిల్లీ కేంద్రంగా రైతులు చేపట్టిన ఉద్యమం చారిత్రాత్మకంగా నిలిచిందని వివరించారు. రైతాంగ ఉద్యమం అణచివేతకు మోదీ కుట్ర పన్నుతున్నారన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.గఫూర్‌ మాట్లాడుతూ కార్మికుల హక్కులను హరించేలా మోదీ విధానాలున్నాయని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ, బీకేఎంయూ రాష్ట్ర అధ్యక్షులు జల్లి విల్సన్‌, ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్‌ మాట్లాడుతూ దేశంలో రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. రైతు, వ్యవసాయ కూలీల హక్కులను హరించేలా మోదీ పాలన ఉందని విమర్శించారు. వ్యవసాయ కూలీల హక్కుల పరిరక్షణకు సమైక్యంగా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.కేశవరావు మాట్లాడుతూ ఇన్సూరెన్స్‌, బ్యాకింగ్‌ తదితర సంస్థలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవాని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మహిళా సంక్షేమ, రిజర్వేషన్‌ బిల్లు తెస్తామంటూ మోదీ వాగ్ధానమిచ్చి.. నేడు దగా చేశారన్నారు. బ్యాంకింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు విజయ్‌కుమార్‌, ఇఫ్టూ రాష్ట్ర నాయకులు కె.పోలారి, ఏఐయూటీయూసీ నాయకులు సుధీర్‌తోపాటు వివిధ ప్రజా సంఘాల నేతలు ప్రసంగించారు. ఈ ధర్నాలో రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు, పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దడాల సుబ్బారావు, వి.వెంకటేశ్వర్లు, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌, కృష్ణాజిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెేవీవీ ప్రసాద్‌, రాష్ట్ర కార్యదర్శి మల్నీడు యలమందయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావుల పల్లి రవీంద్రనాథ్‌, ఉప ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకట సుబ్బయ్య, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూని యన్‌ రాష్ట్ర నాయకులు జె.లలిత, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రంగన్న, మహిళా సమాఖ్య నాయకురాలు రాణి, పంచదార్ల దుర్గాంబ, బీకేఎంయూ రాష్ట్ర ఆఫీస్‌ బేరర్లు ఆర్‌.వెంకట్రావ్‌, బి.కేశవరెడ్డి, ఎ.ఆనందరావు, చిన్నం పెంచలయ్య, నబీ రసూల్‌, చిలకూరి వెంకటేశ్వరరావు, కాబోతు ఈశ్వరరావు, వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.
కృష్ణాజిల్లా అంతటా సోమవారం సేవ్‌ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. సీపీఐ, సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్‌, వామపక్ష ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నూజివీడులో ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు చలసాని వెంకటరామారావు, రైతు సంఘం సీనియర్‌ నాయకుడు కొమ్మన నాగేశ్వరరావు, ఇబ్రహీంపట్నంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సీహెచ్‌ కోటేశ్వరరావు, మహిళా సమాఖ్య నాయకురాలు సీహెచ్‌ దుర్గాకోటేశ్వర రావు, మచిలీపట్నంలో సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మోదుమూడి రామారావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి లింగం ఫిలిప్‌, తిరువూరులో ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి సుందరరావు నాయకత్వంవహించారు. చల్లపల్లి, నందిగామ, జగ్గయ్యపేట, గుడివాడ, గన్నవరం, మొవ్వ, మైలవరం, వీరులపాడు, గంపలగూడెం, ఎ.కొండూరు, కలిదిండి, కైకలూరు, పెనుగంచిప్రోలు, పోరంకి, చందర్లపాడులలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గుంటూరు, తాడికొండ, దాచేపల్లి, పొన్నూరు, మంగళగిరి, రొంపిచర్ల, నరసరావుపేట, మాచర్ల, పెదకూరపాడు, వినుకొండ, తాడేపల్లి, తెనాలి, పెదకాకాని, కారంపూడి, చిలకలూరిపేటలలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగాయి. క్విట్‌ మోదీ, క్విట్‌ కార్పొరేట్‌, సేవ్‌ ఇండియా నినాదంతో అనంతపురం పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్‌ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన జరిగింది. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లికార్జున, కాటమయ్య, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మావతి పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లాలో ఒంగోలు, మార్కాపురం, యర్రగొండ పాలెం, అద్దంకి, పామూరు, కనిగిరి, కందుకూరు, గిద్దలూరు, చీరాల తదితర ప్రాంతాలలో నిరసనలు నిర్వహించారు. కర్నూలు జిల్లాలో క్విట్‌ ఇండియా స్ఫూర్తితో సేవ్‌ ఇండియా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు, ఆత్మకూరు, నందికొట్కూరు, ఆలూరు, డోన్‌, నంద్యాల, కోడుమూరు నియోజకవర్గాలలో సీపీఐ, అనుబంధ సంఘాల నాయకులు నిరసనలు తెలియ జేశారు. పత్తికొండలోని నాలుగు స్తంభాల కూడలిలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, తణుకు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, నరసాపురం, కుక్కునూరు, చింతలపూడి, కొయ్యలగూడెం, దేవరపల్లి, ఇరగవరం, వేలేరుపాడు, కామవరపుకోట, భీమవరంలో ర్యాలీలు, ధర్నా నిర్వహించారు. ఏలూరు కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన ధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌ పాల్గొన్నారు. తణుకులో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కోనాల భీమారావు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ, రామచంద్రాపురం, మలికిపురం, కిర్లంపూడి, పెద్దాపురంలో ఆందోళన నిర్వహించారు. రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ప్రసంగించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img