. మా ప్రశ్నలను విస్మరించి… నిర్ణయాన్ని మార్చుకోమంటే అర్థమేమిటి: సీపీఐ
. మోదీ అహంతో పార్లమెంటరీ వ్యవస్థ నాశనం: కాంగ్రెస్
. ప్రారంభోత్సవాన్ని బహిష్కరించనున్న 21 పార్టీలు
న్యూదిల్లీ : పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవంపై వివాదం కొనసాగుతోంది. కొత్త భవనాన్ని రాష్ట్రపతికి బదులు ప్రధాని ప్రారంభించనుండటాన్ని 21 ప్రతిపక్షాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. మోదీ తీరు రాజ్యాంగ విరుద్ధమని విమర్శించాయి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, రాష్ట్రపతి పదవిని అవమానించే విధంగా మోదీ ప్రభుత్వం దురహంకారంతో వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. ప్రధానికి అధికార పిచ్చిపట్టిందని విమర్శించాయి. మోదీ అహంతో పార్లమెంటరీ వ్యవస్థ నాశనమైందని వ్యాఖ్యానించాయి. ‘ప్రతిపక్షాలు లేవనెత్తే అనేక ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన ఉండదు. వాటికి ఎలాంటి సమాధానం లభించదు. అలాంటప్పుడు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలన్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకొని అడుగుతోంది?’ సీపీఐ ప్రశ్నించింది. ముందు రాష్ట్రపతిని నిర్లక్ష్యం చేసినందుకు మోదీ క్షమాపణ చెబితే దీనిపై అప్పుడు ఆలోచిద్దాం’ అని పార్టీ ఎంపీ వినయ్ విశ్వం వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు అయిన వేళ రాజ్యాంగబద్ధ ఉన్నతాధికారికి భంగపాటు కలిగించడం ఆమోదయోగ్యం కాదని సీపీఐ కార్యదర్శి అతుల్ కుమార్ అంజాన్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ‘మనది అతిపెద్ద ప్రజాస్వామ్యమే కాదు రాజ్యాంగాన్ని, నిమ్న వర్గీయులు ముఖ్యంగా మహిళలను గౌరవించే దేశమన్న సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలి. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సగౌరవంగా ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలి’ అని మోదీకి అంజాన్ హితవు పలికారు. కొత్త భవనాన్ని ప్రారంభించాల్సినది రాష్ట్రపతేగానీ ప్రధాని కాదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా స్పష్టంచేశారు. కాంగ్రెస్ స్పందిస్తూ ‘ఒక వ్యక్తి అహంకారం, స్వీయ ప్రచార వాంఛ వల్ల తొలి గిరిజన మహిళా రాష్ట్రపతికి రాజ్యాంగబద్ధ విశాధికారం (భవన ప్రారంభోత్సవం) నిరాకరించబడిరది’ అని విమర్శించింది. మోదీ ప్రభుత్వ దురహంకారం వల్ల పార్లమెంటరీ వ్యవస్థ నాశమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే వ్యాఖ్యానించారు. ‘మోదీగారు! పార్లమెంటు అన్నది ప్రజలు నెలకొల్పుకునే ప్రజాస్వామ్య ఆలయం. రాష్ట్రపతి కార్యాలయం పార్లమెంటులో మొదటి అంకం. పార్లమెంటరీ వ్యవస్థను మీ ప్రభుత్వ అహంకారం నాశనం చేసింది. పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభించే హక్కును రాష్ట్రపతికి నిరాకరించడంతో ఏం చెప్పాలనుకుంటునారని 140 కోట్ల మంది ప్రజలు ప్రశ్నిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పందిస్తూ ‘దేశంలోని అతిపెద్ద జ్యుడిషియల్ క్యాంపస్‌ను రాంచీలో జార్ఖండ్ హైకోర్టు ఆవరణలో రాష్ట్రపతి ముర్ము ప్రారంభించారు. ఒక వ్యక్తి అహంకారం, స్వీయ ప్రచారం వాంఛ కారణంగా మొట్టమొదటి ఆదివాసీ మహిళా రాష్ట్రపతికి రాజ్యాంగబద్ధ విశేషాధికారం నిరాకరించబడిరది’ అని ట్వీట్ చేశారు. ‘అశోకా ది గ్రేట్, అక్బర్ ది గ్రేట్, మోదీ ది ఇనాగురేట్’ అంటూ ప్రధానిని జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. టీఎంసీ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే మాట్లాడుతూ ప్రతి వందేమాతరం రైలుపై, కోవిడ్ వాక్సిన్‌లపై ప్రధానమంత్రి చిత్రాలు ఉండటం ఆయన నిరంకుశత్వానికి చిహ్నంగా వ్యాఖ్యానించారు. ఏ మంత్రిత్వశాఖ చేసిన పనికైనా ఘనత దక్కేది మోదీకేనన్నారు. ఇది అధికార పిచ్చి కాకపోతే మరేమిటని ప్రశ్నించారు. లెఫ్ట్, టీఎంసీ, ఎస్పీ, ఆప్‌తో సహా 21 ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు కొత్త భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ఆలోచనపై పునరాలోచన చేయాలని ప్రభుత్వం కోరుతోంది. ఇదే క్రమంలో ప్రధాని మోదీ కూడా ప్రతిపక్షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఆస్ట్రేలియాలోని అధికార`విపక్షాలు అద్దం పట్టాయన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో పాటు అధికార, ప్రతిపక్ష నేతలు పాల్గొన్ని తమ దేశానికి మొదటి ప్రాధాన్యతనిచ్చారని మోదీ అన్నారు. ఇదిలావుంటే, గతంలో పార్లమెంటులోని అనుబంధ భవనాలకు అప్పటి ప్రధానులు ఇందిర, రాజీవ్ గాంధీలే ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారని బీజేపీ విమర్శిస్తోంది. ఈనెల 28న పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే.