ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత, యూపీఏ మాజీ చైర్ పర్సన్ సోనియా గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ప్రజాస్వామ్య మూల స్తంభాలను కూల్చివేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, యూపీఏ మాజీ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆరోపించారు. బలవంతపు నిశ్శబ్దం భారతదేశ సమస్యలను పరిష్కరించదు అనే శీర్షికతో ది హిందూ వార్తాపత్రికకు రాసిన వ్యాసంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రధాని మోదీ చేసే ప్రకటనలు దేశంలోని అత్యంత ముఖ్యమైన సమస్యలను విస్మరించేలా, ప్రజల దృష్టిని మరల్చడానికి చేసే విన్యాసాలు అని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశ ప్రజాస్వామ్యంలో మూడు స్తంభాలను క్రమపద్ధతిలో కూల్చివేస్తోందని ఆమె ఆరోపించారు. పార్లమెంటులో ఇటీవలి అంతరాయాలను సోనియా ప్రస్తావించారు. సమావేశాలకు అంతరాయం కలిగించడం ప్రభుత్వ వ్యూహమేనని అన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అదానీ కుంభకోణం వంటి సమస్యలను లేవనెత్తకుండా ప్రతిపక్షాలను నిరోధించేందుకు ఇలా చేశారని ఆమె ఆరోపించారు. నిర్ణయాత్మక ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం అనూహ్యమైన చర్యలను ఆశ్రయించవలసి వచ్చిందని సోనియా అన్నారు. లోక్‌సభ ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత, పార్లమెంటరీ రికార్డుల నుంచి ఆయన ప్రసంగంలోని కొన్ని భాగాలను తొలగించడం గురించి కూడా ప్రస్తావించారు. ఇవన్నీ ప్రతిపక్షాల దృష్టిని మరల్చడానికి చేసిన చర్యలు అన్నారు. ఫలితంగా రూ. 45 లక్షల కోట్ల వ్యయంతో కూడిన కేంద్ర బడ్జెట్ ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందిందని సోనియా గాంధీ ాది హిందూ్ణకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.