సమాఖ్య భావనను గుర్తించడంలేదు
రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థలకు ముప్పు
సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా
విశాలాంధ్ర`హైదరాబాద్: దేశాన్ని నాశనం చేస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ సంపదను అంబానీ, అదానీ, టాటా వంటి కార్పొరేట్లకు కట్టబెడుతున్న మోదీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాతంత్ర, లౌకిక పార్టీలన్నీ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. భారతదేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థలకు మోదీ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్ నుంచి తీవ్ర ప్రమాదం ఏర్పడిరదని, దీనికి వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ గట్టిగా గళం విప్పడాన్ని డి.రాజా అభినందించారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీిఆర్ రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ ఎంపి, ప్రముఖ కమ్యూనిస్టు, గీత పనివారల జాతీయ ఉద్యమ నిర్మాత బొమ్మగాని ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాల ముగింపు సభలో రాజా మాట్లాడుతూ, భారతదేశం వైవిధ్యం కలిగిన దేశమని, అనేక భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఉంటాయని అన్నారు. మోదీ ప్రభుత్వం ‘ఒకే దేశం – ఒకే భాష’, ‘ఒకే దేశం – ఒకే మతం’, ‘ఒకే దేశం – ఒకే ఎన్నికలు’ అంటున్నదని, భారతదేశం రాష్ట్రాల కూటమి(యూనియన్ ఆఫ్ స్టేట్స్) అనే విషయాన్ని గుర్తించేందుకే సిద్ధంగా లేదని విమర్శించారు. రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం లాగేసుకుంటోందని, ఇదే అత్యంత ప్రమాదకరమైన చర్య అని అన్నారు. దీనికి వ్యతిరేకంగా మోదీని నిలదీస్తూ అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు వస్తున్నారని చెప్పారు. నిరాండబరుడు , మృధుభాషి ధర్మభిక్షం అని కొనియాడారు. పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు దిల్లీలోని ఆయన క్వార్టర్‌లో అనేక సార్లు కలిసి చర్చించే వాడినని, ఆయన ఉద్యమ అనుభవాల నుంచి అనేక విషయాలను నేర్చుకున్నానని రాజా గుర్తు చేసుకున్నారు. నమ్మిన కమ్యూ నిస్టు సిద్ధాంతాలు, సమసమాజ లక్ష్యం కోసం నిబద్ధతతో పనిచేశారన్నారు. దేశవ్యాప్తంగా గీత పనివారల ఉద్యమాన్ని విస్తరించారని తెలిపారు.