చంద్రబాబును ప్రశ్నించిన రామకృష్ణ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజావ్యతిరేకత పెరిగిందని వ్యాఖ్య
విశాలాంధ్ర – విజయవాడ: మోదీ ప్రభుత్వ విధానాలపై స్పష్టమైన వైఖరిని వెల్లడిరచాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు. ఓపక్క ప్రధాని మోదీ విధానాలతో దేశం వెనుకబడిపోతుంటే…మోదీ, అదానీ విజన్ అద్భుతమంటూ చంద్రబాబు ప్రశంసించడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. తనదీ మోదీ విజన్ అని చెప్పడాన్ని రామకృష్ణ తప్పుబట్టారు. మోదీ సర్కారుపై టీడీపీ వైఖరిని ప్రజలకు స్పష్టం చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. మోదీ, జగన్ పరస్పర సహకారంతోనే కృష్ణపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు అదానీకి కట్టబెట్టారని తెలిపారు. అదానీ అక్రమ ఆస్తులపై విచారణ కోసం జేపీసీ వేయాలని ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేసినా మోదీ సర్కారు స్పందించలేదని, పైగా కేసులతో విపక్షాలను భయపెడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో మాత్రం సీఎం జగన్ హడావుడిగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి…కోట్లాది రూపాయల భూములను అదానీకి కట్టబెట్టారని గుర్తుచేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తూ…అదానీ ఆస్తులు పెంచుతున్న మోదీ విజన్ బాగుందని చెప్పడం చంద్రబాబుకు తగదన్నారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు, జగన్ స్పందించాలన్నారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న మోదీ విధానాలపై వైసీపీ, టీడీపీ వైఖరి ఏమిటని రామకృష్ణ ప్రశ్నించారు.
బీజేపీ ప్రభుత్వ విధానాలు, ప్రధాని మోదీ నిర్ణయాలతో దేశం తిరోగమనంలో పయనిస్తోందని రామకృష్ణ విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద విధానాలపై సీపీఐ, సీపీఎం ఉద్యమభేరి మోగించాయని, తమ యాత్రల్లో మోదీ, జగన్ ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. గుజరాత్ తరహా అభివృద్ధి ప్రచారంతో బీజేపీ, మోదీ ప్రజలను మోసగించారని మండిపడ్డారు. 9 ఏళ్లు గడిచినా దేశంలో నిరుద్యోగం, అధిక ధరలు, అవినీతి, నల్లధనం సమస్యకు పరిష్కారం లభించలేదన్నారు. మోదీ హయాంలో ప్రపంచంలో అత్యంత దారిద్య్ర దేశంగా భారత్ నిలిచిందని ఆగ్రహం వెలిబుచ్చారు. నిరుద్యోగం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 45శాతం పెరిగిందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు కాకపోగా…అన్నదాతను అప్పుల ఊబిలో దించారని తెలిపారు. మోదీ ప్రభుత్వ హయాంలో అదానీ, అంబానీలు మాత్రమే బాగుపడ్డారన్నారు. సుపరిపాలనలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్, సీపీఐ ఎన్‌టీఆర్ జిల్లా కార్యదర్శి సీహెచ్ కోటేశ్వరరావు, విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.