Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

మోదీ సృష్టించిన ‘మోసం’

పేదల బతుకులు ఛిద్రం చేసిన కేంద్ర నిర్ణయాలు

పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీగా బ్యాంకింగ్‌ మోసాలు
దేశంలో ప్రతి పది నిమిషాలకు ఒకటి
2016-17 వరకు ఏటా వెయ్యి ఫిర్యాదులు
2017-18లో ఏకంగా 163 రెట్లు పెరుగుదల
ఆర్‌బీఐ నివేదిక వెల్లడి

న్యూదిల్లీ : కేంద్రంలోని మోదీ నేతృత్వలోని బీజేపీ సర్కార్‌ లౌకిక వాదానికి తూట్లు పొడవటం, రాజకీయ అస్థిరతకు ఆజ్యం పోయడం, పేదల పొట్ట కొట్టడమే లక్ష్యంగా అరాచక పాలన సాగిస్తోంది. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన కాషాయ అజెండాను అమలు చేస్తూనే ప్రజలను ఆర్థిక అస్థిరతలోకి నెట్టారు. పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల బతుకులను ఛిద్రం చేశారు. బడా కార్పొరేట్‌లకు కొమ్ముకాస్తూ, దేశీయ బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన బడా మోసగాళ్లకు అండగా నిలుస్తూ విధ్వంసకర విధానాలకు బాటలు పరిచింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ప్రజాస్వామ్య వ్యవస్థలను అస్తవ్యస్తం చేశాయి. ఫలితంగా ప్రజలు అథోగతి పాలయ్యారు.
ఈ క్రమంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దుష్ఫలితాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాని మోదీ 2016 నవంబర్‌ 8న రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. హఠాత్తుగా నోట్లను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా కోట్ల మంది పేదలు బ్యాంకుల ముందు వరస కట్టారు. వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. లక్షల వ్యాపారాలు మూతపడ్డాయి. ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది. ఫలితంగా దేశంలో బ్యాంకింగ్‌, ఆన్‌లైన్‌ మోసాలు భారీగా పెరిగిపోయాయి. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, ఏటీఎం, ఇంటర్‌నెట్‌, బ్యాంకింగ్‌ వంటి డిజిటల్‌ లావాదేవీల్లో ప్రతి పది నిమిషాలకు ఒక మోసం జరుగుతోంది. భారత రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా నమోదయిన బ్యాంకింగ్‌ మోసాల వివరాలు తెలియజేయాలంటూ ప్రముఖ ఆర్టీఐ కార్యకర్త, యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ సంస్థకు చెందిన రాజేంద్ర పల్నాటి ఆర్‌బీఐని కోరారు. దీనికి ఆర్‌బీఐ ఇచ్చిన సమాచారంలో ఆశ్చర్యపోయే విషయాలు వెల్లడయ్యాయి. పెద్ద నోట్ల రద్దుకు ముందు వరకు నోట్ల ద్వారానే అత్యధిక లావాదేవీలు జరిపేవారు. అవసరాల కోసం నగదు రూపంలోనే ఇంట్లో దాచుకొనేవారు. దీంతో ఆన్‌లైన్‌ మోసాలకు పెద్దగా అవకాశం లేకుండాపోయింది. ఆర్‌బీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2012-13 ఆర్థిక సంవత్సరం నుంచి 2016-17 మధ్య మొత్తం 5,179 బ్యాకింగ్‌ మోసాలు నమోదయ్యాయి. అంటే ఏటా సగటున వెయ్యి ఫిర్యాదులు వచ్చాయి. రోజుకు దాదాపు 3 నేరాలు నమోదయ్యాయి. ఆ ఐదేళ్లలో ప్రజలు రూ.129.24 కోట్లు కోల్పోయారు. ఇందులో రూ.69.83 కోట్లను అంటే దాదాపు 54 శాతం డబ్బును అధికారులు రికవరీ చేయగలిగారు.
మోదీ నిర్ణయంతో యదేచ్ఛగా మోసాలు
పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇంట్లో ఉన్న రూ.500, రూ.వెయ్యి నోట్లకు విలువ లేకుండా పోయింది. ప్రజలంతా ఒక్కసారిగా బలవంతంగా డిజిటల్‌ లావాదేవీలకు మారాల్సి వచ్చింది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, డిజిటల్‌ పేమెంట్ల గురించి పేదలు, నిరక్షరాస్యులకు కనీస అవగాహన కల్పించే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇది ఆన్‌లైన్‌ మోసగాళ్లకు వరంగా మారింది. అప్పటి నుంచి బ్యాకింగ్‌ మోసాలు పెరిగిపోయాయి. 2016 నవంబర్‌ 8న మోదీ నిర్ణయాన్ని ప్రకటించినప్పటి నుంచి నేరగాళ్లు యదేచ్ఛగా తమ మోసాలను కొనసాగించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 34,791 మోసాలు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాదితో (1,372) పోల్చితే 25 రెట్లు ఎక్కువ. ఆ ఆర్థిక సంవత్సరంలో ప్రజలు ఏకంగా రూ.4,552 కోట్లు నష్టపోయారు. అంతకుముందు ఏడాదితో (రూ.27.77 కోట్లు) పోల్చితే 163 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. అదేవిధంగా 2017-2022 మధ్య ఆర్‌బీఐకి మొత్తం 3 లక్షల ఫిర్యాదులు అందాయి. అంటే ఏటా 60 వేలు. అంతకుముందు ఐదేళ్లలో రోజుకు మూడు ఫిర్యాదులు రాగా.. మోదీ నిర్ణయం తర్వాత రోజుకు 167 మంది నష్టపోయారు. ఇది 55 రెట్లు ఎక్కువ. నోట్ల రద్దు తర్వాత ప్రతి 10 నిమిషాలకు ఒక మోసం జరుగుతున్నట్టు నివేదిక స్పష్టం చేస్తోంది. ఇదిలాఉండగా గత పదేళ్లలో జరిగిన బ్యాంకింగ్‌ మోసాలను పరిశీలిస్తే… ప్రజలు డబ్బు నష్టపోవడమే తప్ప పూర్తిగా రికవరీ జరిగిన దాఖలాలు లేవు. రికవరీలోనూ మోదీ ప్రభుత్వానిదే అధ్వాన రికార్డు. 2012-17 మధ్య రూ.129 కోట్లు నష్టపోగా.. రూ.69.83 కోట్లను రికవరీ చేశారు. అంటే సుమారు 58 శాతం డబ్బు వెనక్కి వచ్చింది. 2017-18 మధ్య మొత్తం రూ.4,930 కోట్లు మోసగాళ్ల చేతికి వెళ్లగా.. ప్రభుత్వం రూ.102.10 కోట్లను మాత్రమే రికవరీ చేయగలిగింది. అంటే కేవలం 2 శాతమే. రికవరీ చేయాల్సిన రూ.4,828 కోట్లలో 2017-18 ఆర్థిక సంవత్సరానికి చెందినవే రూ.4,524 కోట్లు కావడం విశేషం. 2017-2022 మధ్య దేశంలోని షెడ్యూల్డ్‌, కమర్షియల్‌ బ్యాంకుల్లో జరిగిన మోసాల్లో 21,742 ఫిర్యాదులను కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు బదిలీ చేసినట్లు ఆర్‌బీఐ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img