Monday, August 15, 2022
Monday, August 15, 2022

యువతకు నష్టం అగ్నిపథ్‌

హరియాణా యువత తీవ్ర ఆందోళన
అండగా కాంగ్రెస్‌, రైతు సంఘాలు

న్యూదిల్లీ: కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన అగ్నిపథ్‌ పథకాన్ని దేశ యువత తిరస్కరించింది. భారీస్థాయిలో సాయుధ దళాల్లో ఉద్యోగాలను ప్రకటించినట్టే ప్రకటించి నాలుగేళ్ల షరతు పెట్టడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఇన్నేళ్ల కష్టానికి నాలుగేళ్ల సర్వీసు మాత్రమే కల్పించడమేమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. వారికి రైతు, ఉద్యోగ సంఘాలతో పాటు ప్రతిపక్షాలు అండగా నిలిచాయి. బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. కోటా పరిధిని అతిక్రమించకుండా అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధ్యమంటూ కాంగ్రెస్‌ ప్రశ్నిం చింది. ఈ పథకానికి వ్యతిరేకంగా హరియాణాలో నిరసనలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. సాయుధ దళాల్లో ఈ రాష్ట్రం వారు అధిక సంఖ్యాకులు ఉంటారు. అగ్నిపథ్‌ పథకాన్ని ప్రకటించినప్పటి నుంచి రాష్ట్రం అట్టుడుకుతోంది. నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ కారణంగా కేంద్రం కొన్ని సడలింపులు ప్రకటించినా, హరియాణాలోని కట్టర్‌ ప్రభుత్వం అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల హామీ ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. హరియాణా వ్యాప్తంగా అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ప్రదర్శనలు నిర్వహించింది. మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌ సింగ్‌ హుడా నేతృత్వంలో రొహతక్‌లో నిరసనలు జరిగాయి. అగ్నిపథ్‌ పథకం దేశ సైన్యాన్ని బలహీనం చేస్తుందని, సైనికుల సంఖ్యను తగ్గిస్తుందని హుడా అన్నారు. ఈ పథకం బలగాలను తగ్గించే లక్ష్యంతో ఉందని హుడా అన్నారు. ఈ విధానం హరియాణా రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని, ఏటా పెద్ద సంఖ్యలో యువత సాయుధ దళాల్లో చేరుతుంటారని చెప్పారు. హరియాణా నుంచి యేటా ఐదు వేల నుంచి ఏడు వేల మంది ఆర్మీలో చేరతారన్నారు. మూడేళ్లుగా నియామకాలు జరగక 20వేల మంది చేరలేదన్నారు. మూడేళ్లలో రెండు లక్షలకుపైగా పోస్టులు భర్తీ కావాల్సి ఉన్నట్లు తెలిపారు. ఖాళీ లను భర్తీ చేయడం మానేసి కొత్త పథకం ద్వారా ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నామని కేంద్రం చెప్పు కుంటోందని విమర్శించారు. అగ్నివీరులకు రాష్ట్రంలో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలంటూ కట్టర్‌ ప్రభుత్వం డొల్లహామీ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 29,275 మంది మాజీ సైనికుల్లో కేవలం 543 మందికి ఉద్యోగాలు ఇవ్వడాన్ని ప్రశ్నించారు.
అగ్నిపథ్‌కు ఎస్‌కేఎం,
ఖాప్‌ పంచాయతీల వ్యతిరేకం
సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం), మరి కొన్ని రైతుసంఘాలు, ఖాప్‌ పంచాయతీలు సైతం అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకించాయి. ఎస్‌కేఎం అనుబంధ రైతులు అనేకమంది గత శుక్రవారం హరియాణావ్యాప్తంగా ఈ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. దీనిని వెంటనే ఉపసం హరించుకోవాలని డిమాండు చేశారు. ఎస్‌కేఎం నేతృత్వ ఆందోళనలో మాజీ సైనికులు, యువకులు, ఆర్మీలో చేరాలనుకునే వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కర్నాల్‌లో భారతీయ కిసాన్‌ యూనియన్‌ (తికౖౖెత్‌), హరియాణా అధ్యక్షుడు రతన్‌ మాన్‌ నిరసనకు నాయకత్వం వహించారు. ఈ పథకం వల్ల చాలామంది యువత సైన్యంలో చేరాలనే కలకు దూరమయ్యారని, దీనివల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని మాన్‌ అన్నారు. సాయుధ దళాల్లో చేరేందుకు సిద్ధమవుతున్న యువత మనోభావాలను గౌరవించాలని, కేంద్రప్రభుత్వం మునుపటి నియామక విధానానికి కట్టుబడాలని డిమాండు చేశారు. నిరసనకారుల డిమాండ్లను పట్టించుకోవాలని కేంద్రాన్ని ఎస్‌కేఎం నేత ఇందర్‌జిత్‌ సింగ్‌ డిమాండు చేశారు. ఖాప్‌ పంచాయితీలు సైతం తమ పరిధిలోని ప్రాంతాలలో నిబంధనలను నిర్దేశించాయి. అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకించాయి. ఈ పథకం కింద నియామకాల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే సామాజిక బహిష్కరణను ఎదుర్కొ వాల్సి ఉంటుందని హెచ్చరించాయి. నిరసనకారులపై కేసులను తక్షణమే ఉపసం హరించుకోవాలని రొహతక్‌లోని సంప్లా పట్టణానికి చెందిన ఖాప్‌ మహా పంచాయత్‌ డిమాండు చేసింది. బీజేపీ, దాని మిత్రపక్షమైన జననాయక్‌ జనతా పార్టీ నిర్వహించే కార్యక్రమాలను బహిష్కరిస్తున్నట్లు ఖాప్‌ నేతలు ప్రకటించారు. రైతుల ఆందోళన సమయంలోనూ ఈ రెండు పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలను ఎదుర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img