Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి

. ములుగు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
. మంత్రి కేటీఆర్‌
. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

విశాలాంధ్ర బ్యూరో -ములుగు: రాజకీయాలకతీతంగా ములుగు అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. బుధవారం ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్‌… అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, రామప్ప కట్ట వద్ద ఏర్పాటుచేసిన సాగునీటి దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. రూ.65 కోట్లతో నిర్మించే సమీకృత కలెక్టరేట్‌ భవనానికి, రూ.38 కోట్ల 50 లక్షలతో నిర్మించే జిల్లా పోలీసు కార్యాలయానికి, రూ.10 కోట్ల 40 లక్షలతో నిర్మించే ప్రభుత్వ కార్యాలయ భవనాలకు, రూ.కోటి 25లక్షలతో నిర్మించే బస్‌స్టాండ్‌కు, రూ.50 లక్షలతో చేపట్టే సేవాలాల్‌ భవన నిర్మాణానికి, రూ.30 లక్షలతో చేపట్టే డిజిటల్‌ లైబ్రరీ భవనానికి, రూ.కోటి తో వైకుంఠ ధామం నిర్మాణానికి, రూ.15 లక్షలతో చేపట్టే సమాచార పౌర సంబంధాల శాఖ సమావేశ మందిర నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. రూ.12 కోట్ల 50 లక్షలతో ములుగు జిల్లాలో నిర్మించిన 5 మార్డెన్‌ పోలీస్‌ స్టేషన్లను, రూ.2 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ మహాకవి దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటే సీఎం కేసీఆర్‌ తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణిగా మార్చి చూపారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆచార్య జయశంకర్‌ సారధ్యంలో 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్‌ అద్భుత రీతిలో దేశంలో ఆదర్శవంతంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారన్నారు. గత పాలకుల హయాంలో వేసవిలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఊర్లలో తిరగాలంటే భయపడేవారని, తాగునీటి ఇబ్బందులతో ప్రజలు ఖాళీ బిందెల ప్రదర్శనలు చేసే వారన్నారు. 67 సంవత్సరాల పాటు పాలించి తాగు, సాగునీటి కష్టాలను తీర్చనివారు నేడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శించారు. సుదీర్ఘ పోరాటం ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తుంటే, కొంతమందికి మింగుడు పడటం లేదన్నారు. ఉత్సవాలు ఎందుకు నిర్వహించాలనే వితండ వాదం చేసేవారి పార్టీ చత్తీస్‌గఢ్‌లో అధికారంలోఉందని, అక్కడ ఎకరానికి 12 క్వింటాలు మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్తు, పంట పెట్టుబడి సహాయం, ఇంటింటికి తాగునీరు సరఫరా ఉన్నాయా అని మంత్రి ప్రశ్నించారు. 3146 గిరిజన తండాలు, గూడాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామని, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ రాజకీయాలకతీతంగా ములుగును ప్రత్యేక జిల్లా కేంద్రంగా, మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి రూ.133 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ములుగు జిల్లాలో దళితులకు రూ.2 కోట్ల 39 లక్షల సబ్సిడీ, గిరిజనులకు రూ.కోటి 48 లక్షల సబ్సిడీ, మూడు వేలమంది యాదవులకు గొర్రెల పంపిణీ యూనిట్లు, 33 మంది కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులు, 1181 మహిళా సంఘాలకు రూ.110 కోట్ల చెక్కులు, సబ్సిడీపై మూడు ట్రాక్టర్లు, 44 లక్షల విలువగల పనిముట్లను, 37 మందిర్‌ లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ వివరించారు. ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ కారణంగా పంచాయతీ అవార్డులలో దేశస్థాయిలో రెండవ స్థానంలో నిలిచామని, 67 కొత్త గ్రామపంచాయతీలు రెండు కొత్త మండలాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. గతంలో ఏజెన్సీ ప్రాంతాలలో మంచం పట్టిన మన్యం అనే వార్తలు వచ్చేవని, సర్కారు దవాఖానాల్లో వసతులు వైద్యులు ఉండేవారు కాదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలలో విశ్వాసం పెంచి జిల్లా ఆసుపత్రి నిర్మాణం చేసుకున్నామని జిల్లాలో వైద్య కళాశాల సైతం మంజూరు చేశామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 34 నుంచి 80 శాతానికి పెరిగిందని, ప్రజలలో ప్రభుత్వం పట్ల ఉన్న విశ్వసనీయతకు నిదర్శనమని కేటీఆర్‌ తెలిపారు. ములుగు నియోజకవర్గ పరిధిలో 17వేల ఎకరాల పోడు పట్టాలను పంపిణీకి సిద్ధం చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు మహమ్మద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img