Sunday, February 5, 2023
Sunday, February 5, 2023

రాజధానిపై బీజేపీ డ్రామాలు

పాదయాత్ర తిరుపతి చేరేలోగా అమరావతినే రాజధానిగా ప్రకటించండి
సౌర విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందంపై అఖిలపక్షం వేయాలి
ఎయిడెడ్‌ విలీన జీవోలను రద్దు చేయాలి
విద్యార్థి సంఘాల చలో అసెంబ్లీకి సీపీఐ సంఫీుభావం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి : న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర తిరుపతికి చేరేలోగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. విజయవాడ దాసరి భవన్‌లో బుధవారం మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌, జి.ఓబులేశుతో కలిసి ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ అమరావతి రాజధాని ఉద్యమం 700 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతోందని, అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతినే రాజధానిగా సమర్థించారని గుర్తు చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరిట మాట మార్చడం, మడమ తిప్పడం, దగా చేయడమేనన్నారు. రాజధాని కోసం రైతులు సుదీర్ఘ కాలంగా ఉద్యమిస్తున్నారని, ఇప్పుడు పాదయాత్ర నిర్వహిస్తున్నారని వివరించారు. ఇప్పటికైనా జగన్‌ స్పందించి మహా పాదయాత్ర తిరుపతి చేరేలోగా అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలన్నారు. అమరావతి రాజధానిపై కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని కొందరు బీజేపీ నేతలు రాజధానితో తమకు సంబంధం లేదని, రాష్ట్రాల పరిధిలోదని వ్యాఖ్యానించగా, రాష్ట్రంలోని బీజేపీ నేతలు మాత్రం రాజధానికి మద్దతుగా నిలుస్తున్నారన్నారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన అమిత్‌షా రాజధాని రైతుల పాదయాత్రకు బీజేపీ శ్రేణులు సంఫీుభావం తెలపాలన్నట్లుగా వార్తలు వచ్చాయన్నారు. నిజంగా కేంద్రంలోని బీజేపీకి, ప్రభుత్వానికి అమరావతి రాజధానిపై చిత్తశుద్ధి ఉంటే, అమరావతే ఏకైక రాజధానిగా ప్రకటించాలన్నారు. కేంద్ర, రాష్ట్రంలోని బీజేపీ నేతలు రాజధానిపై డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి సంబంధించి 9 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారంపై ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే, రాబోయే రోజుల్లో ప్రజలపై లక్ష కోట్లకుపైగా విద్యుత్‌ చార్జీల భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే విద్యుత్‌ చార్జీలను పెంచి ప్రజల నడ్డి విరిచారని ఆయన తెలిపారు. దేశంలోని 22 రాష్ట్రాలు ఈ విద్యుత్‌ కొనుగోళ్లపై మౌనం వహిస్తే, సీఎం జగన్‌ మాత్రం ఆగమేఘాల మీద వాటికి ఎందుకు అంగీకారం తెలిపారని ప్రశ్నించారు. విద్యుత్‌ ఒప్పందాలపై ఈ ఏడాది సెప్టెంబర్‌ 15న ప్రతిపాదనలు రాష్ట్రానికి వస్తే, దానిపై రాష్ట్ర ప్రభుత్వం మరుసటి రోజే (సెప్టెంబర్‌ 16న) హడావుడిగా ఒప్పందానికి అంగీకరించడం తగదన్నారు. అదానీకి దోచిపెట్టేందుకే సౌర విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందానికి జగన్‌ ఆసక్తి చూపారని, ఒక రోజులోనే హడావుడీగా అంగీకారం తెలపడంపై చాలా అనుమానాలున్నాయన్నారు. వాటిని నివృత్తి చేసేందుకుగాను సీఎం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, విద్యుత్‌రంగ నిపుణులతో చర్చించి వారి అభిప్రాయాలు స్వీకరించాలని, వాటికి సంబంధించిన రికార్డులను ప్రతిపక్షాల ముందు ఉంచాలని సూచించారు. ఈ అంశంపై జగన్‌ ఏకపక్షంగా ముందుకుపోతే ఈ నెల 20న వామపక్షాలతో సమావేశం నిర్వహిస్తామని, తదుపరి భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. ఈ విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉందని, త్వరలో ఆ విషయాలనూ వెల్లడిస్తామన్నారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీనంపై రాష్ట్ర ప్రభుత్వం జారీ జేసిన 42, 50, 51 జీవోలన్నీ ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. గతంలో ఇచ్చిన జీవో 35ను రద్దు చేసి ఎయిడెడ్‌ సంస్థలలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించి, అవి యథాతథంగా నడిచేలా చూడాలన్నారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థల విలీనంపై తాజాగా ప్రభుత్వం జారీజేసిన నాలుగు ఆప్షన్లు విడ్డూరంగా ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వం జారీజేసిన నాలుగు ఆప్షన్లు ఎయిడెడ్‌ విద్యా సంస్థల యాజమాన్యంపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయని, వాటిని వెనక్కి తీసుకోవాలని, ఆ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థల పరిరక్షణ కోసం ఈ నెల 18వ తేదీన విద్యార్థి సంఘాలు తలపెట్టిన చలో అసెంబ్లీకి సీపీఐ సంఫీుభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు.
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేశు మాట్లాడుతూ అమరావతి రాజధాని విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నాయంటూ విమర్శించారు. అమరావతి రాజధాని అంశంపై గతంలో హైకోర్టుకు కేంద్రంలోని ప్రధాని కార్యాలయం, హోంశాఖ కార్యాలయం నుంచి ఇది రాష్ట్రం పరిధిలోనిది అంటూ అఫిడవిట్‌ దాఖలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడేమో రాజధాని రైతుల పాదయాత్రపై బీజేపీ నేతలు డ్రామాలాడుతూ ప్రజలను నిలువ దోపిడీ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు ద్వారా పూర్తి స్థాయిలో విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం లేదని, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని వివరించారు. ఇటీవల వరకు రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు టన్ను ధర రూ.4,500కు కొనుగోలు చేస్తుండగా, తాజాగా అదానీ కంపెనీ నుంచి టన్ను రూ.19,500 చొప్పున కొనుగోలు చేసేందుకు చూస్తున్నదని విమర్శించారు. ఈ లెక్కన వేలాది కోట్ల రూపాయల సొమ్మును అదానీకి రాష్ట్ర ప్రభుత్వం దోచిపెడుతోందని విమర్శించారు. అదానీ బొగ్గును కొనుగోలు చేస్తే, రాబోయే రోజుల్లో యూనిట్‌ విద్యుత్‌ ధర రూ.16కు పెరుగుతుందని, ప్రజలు దీనిని గమనించాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img