Monday, March 27, 2023
Monday, March 27, 2023

రాజధాని రాజకీయం

. మంత్రి బుగ్గన వ్యాఖ్యల దుమారం
. మూడు రాజధానుల డ్రామా బట్టబయలు
. జగన్‌ సర్కారు కుట్రపూరిత ఆలోచన!
. పొంతనలేని ప్రకటనలతో ప్రజల్లో గందరగోళం
. సజ్జలతో వివరణకు యత్నం

విశాలాంధ్ర – బ్యూరో`అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై వైసీపీ ప్రభుత్వం రాజకీయ రచ్చ చేస్తోంది. ప్రజల మనోభావాలతో ఆటలాడుతూ…వారిని అయోమయానికి గురిచేస్తోంది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతల విభిన్న ప్రకటనలతో అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందనేదీ అంతుచిక్కడం లేదు. ఇప్పటివరకూ మూడు రాజధానులే మా విధానం అంటూ… సీఎం వైఎస్‌ జగన్‌, ఆయనకు తోడుగా కొందరు మంత్రులు ఆర్భాటంగా చెబుతుండగా…తాజాగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వారికి చెక్‌ పెట్టినట్లయింది. విశాఖే రాజధానిగా ఉంటుందంటూ బుగ్గన బాంబు పేల్చేలా వ్యాఖ్యానించడం వెరసి అసలు జగన్‌ ప్రభుత్వ కుట్రపూరిత ఆలోచన బట్టబయలైందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఒకానొక దశలో బుగ్గనను అభినందిస్తున్నాయి. ‘విశాఖ ఒక్కటే రాజధాని… కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపల్‌ బెంచ్‌ మాత్రమే ఉంటుంది. గుంటూరులో ఒక సెషన్‌ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి’ అంటూ మంత్రి బుగ్గన సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటి ఆధారంగా జగన్‌ చెబుతున్నట్లుగా మూడు రాజధానులు ఎక్కడా లేవు. కేవలం విశాఖే మొత్తం రాజధాని కానుంది. ఇప్పటివరకూ మూడు ప్రాంతాల అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తున్న వైసీపీకీ, జగన్‌ ప్రభుత్వానికీ బుగ్గన వ్యాఖ్యలు మింగుడు పడటం లేదు. రాయలసీమను న్యాయ రాజధానిగా చేస్తామంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతుండగా, బుగ్గన వ్యాఖ్యలతో డొల్లతనం వెల్లడైంది. ఇక శాసన రాజధాని అనేదే లేదు…అమరావతి ప్రస్తావనే లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందనడానికి బుగ్గన వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. దీనిపై అమరావతి ప్రాంత వాసులకు, రాయలసీమ ప్రాంత వాసులకు సీఎం జగన్‌ సమాధానం చెప్పాల్సిన అవసరముంది. రాబోయే ఎన్నికల్లో విశాఖే రాజధాని రెఫరెండమ్‌తో ఎన్నికలకు వెళ్లే సత్తా జగన్‌కు ఉందా? అని ప్రతిపక్ష పార్టీలు నిలదీస్తున్నాయి. బుగ్గన వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో వెంటనే మీడియా ముంగిటకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి వివరణ ఇచ్చారు. మంత్రి బుగ్గన ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశారనేదీ తనకు తెలియదనీ, మా విధానం మూడు రాజధానులని, వికేంద్రీకరణే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. దీంట్లో ఎలాంటి గందరగోళం లేదని, ఇదే విధానంతో రాబోయే ఎన్నికలకు తాము సిద్ధమవుతామని స్పష్టం చేశారు.
ఆది నుంచి రాజధానిపై నాటకం
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి రాజధానిపై నాటకాలకు తెరదీస్తోంది. మూడు రాజధానులను ప్రకటించి రాష్ట్రంలో గందరగోళాన్ని సృష్టించింది. ప్రాంతీయ విభేదాలు రేపేందుకు ప్రయత్నించింది. అమరావతి రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమానికి పోటీగా మూడు రాజధానుల కృత్రిమ ఉద్యమాన్ని ప్రభుత్వం సృష్టించింది. అమరావతి రాజధాని ప్రాంతం అభివృద్ధిని గాలికొదిలేసింది. అక్కడ పూర్తి దశకు వచ్చి, కొద్దిపాటి పనులతో ఉన్న భవనాలను సైతం పూర్తి చేయలేదు. రాజధాని రైతుల సమస్యల్ని నీరుగారుస్తోంది. పైకి మూడు రాజధానుల నినాదం లేపి, లోపల మాత్రం విశాఖ ఒక్కటే రాజధానిగా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఆలోచన ఉన్నట్లు స్పష్టమవుతోంది. రాజధాని వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికీ, దానిని సీఎం జగన్‌ మరచి త్వరలో విశాఖ కేంద్రంగా పరిపాలన సాగిస్తామని, విశాఖకు మారుతానంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇది న్యాయస్థానాలను దిక్కరించడమేనంటూ ప్రతిపక్షాలు సూచిస్తున్నప్పటికీ, జగన్‌ వైఖరిలో మార్పులేదు. విశాఖకు వీలైనంత త్వరగా సీఎం మారేందుకు తెర వెనుక చర్యలు ఆరంభించారు. విశాఖ బీచ్‌ దగ్గర సీఎం ఇంటిని సైతం నిర్మించారనే ప్రచారముంది. సీఎంవో కార్యాలయానికీ చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో లబ్ధికోసమే జగన్‌ మూడు రాజధానుల పల్లవి అందుకున్నట్లు తెలుస్తోంది. కేవలం విశాఖనే రాజధానిగా భావించి సీఎం ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నట్లు సమాచారం.
మూడు రాజధానులే మా విధానం: సజ్జల
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: మూడు రాజధానులే మా విధానమని, వికేంద్రీకణకు ప్రజలు కట్టుబడి ఉన్నారని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఏపీ సచివాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజధానిని ఒకే చోట కేంద్రీకృతం చేశారని, విభజన తర్వాత కూడా చంద్రబాబు పరిపాలనలో కూడా శాసన, న్యాయ, పరిపాలన రాజధానులన్నీ ఒకే చోట పెట్టి దానికి అమరావతి అని నామకరణం చేశారని గుర్తుచేశారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకున్నారన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వికేంద్రీకరణ రాష్ట్రానికి అవసరం అని గుర్తించామని, వికేంద్రీకరణకే మేం కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. పరిపాలనను వికేంద్రీకరణ చేయడంలో భాగంగా ప్రధాన విభాగాలు మూడిరటిని మూడు ప్రాంతాలో పెట్టాలని బిల్లు తీసుకొచ్చామని, అది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉందని, మేము మా వాదనలు వినిపిస్తున్నామని వివరించారు. మూడు రాజధానులపై ఎలాంటి కన్ఫ్యూజన్‌ లేదనీ, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వ్యాఖ్యల్లోనూ అదే సారాంశం ఉందని, దానిని చంద్రబాబు అనుకూల మీడియా వక్రీకరించిందని మండిపడ్డారు. పరిపాల వికేంద్రీకరణలో భాగంగా మంత్రి వర్గం, సెక్రటేరియట్‌, ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖలో ఉంటుందన్నారు. అసెంబ్లీ అమరావతిలోనే ఉంటుంది అని, హైకోర్టు, న్యాయ సముదాయాలు కర్నూలులో ఉంటాయని పేర్కొన్నారు. వాటికి క్యాపిటల్‌ అనేది మేమిచ్చుకున్న నిర్వచనం…ఇందులో వైరుధ్యం ఏమీ లేదు అని తెలిపారు. సుప్రీంలో మేం వాదించేది కూడా అదేనని, ఇంకా అందరి సూచనలు తీసుకుంటామని చెప్పారు. వికేంద్రీకరణకు చట్టరూపం ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా మా విధానంలో మార్పు ఉండబోదని, అందులో భాగంగా ప్రధాన వ్యవస్థలను మూడు ప్రాంతాల్లో పెట్టడానికి మేం కట్టుబడి ఉన్నామన్నారు. కింది స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సీఎం జగన్‌ ప్రజల కోసమే గడప వద్దకే తీసుకెళ్లారని, పాలన వికేంద్రీకరణలో భాగంగానే 13 జిల్లాలు, 26 జిల్లాలు అయ్యాయని తెలిపారు. ఉన్నత చట్టసభ అమరావతిలోనే ఉంటుంది అని, దానిని మేం శాసన రాజధాని అంటున్నామని పేర్కొన్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించినంతవరకు అత్యున్నతమైనది శాసన వ్యవస్థ…అంటే, అసెంబ్లీ, మండలి ఇక్కడే ఉంటాయన్నారు. దానిని శాసన రాజధాని అని పిలిస్తే ఓకే… పిలిచినా పిలవకపోయినా అసెంబ్లీ, మండలి ఇక్కడే ఉంటాయని పేర్కొన్నారు. మంత్రి బుగ్గన ప్రసంగం మొత్తంలో ఎలాంటి వివాదం లేదన్నారు. ప్రభుత్వంలోనే ఏకాభిప్రాయం లేదని చెప్పేందుకు ప్రచారం చేస్తున్నారని, అలాంటిదేదీ లేదంటూ తోసిపుచ్చారు. వికేంద్రీకరణ విషయంలో ఎలాంటి అస్పష్టతకు అసలు అవకాశమే లేదు…దానికి ఏ పేరు పెట్టినా వికేంద్రీకరణ మాత్రం తథ్యం అని సజ్జల నొక్కిచెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img