Monday, February 6, 2023
Monday, February 6, 2023

రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత

. మోదీ పాలనపై తీవ్ర వ్యతిరేకత: అజీజ్‌ పాషా
. లౌకికపార్టీలు ఐక్యం కావాలి: రామకృష్ణ
. అధికారం కోసం బీజేపీ దేనికైనా తెగిస్తుంది: శ్రీనివాసరావు

విశాలాంధ్ర`విజయవాడ: బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యాంగానికి, దాని లక్ష్యాలకు ప్రమాదం ఏర్పడిరదని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వక్తలు ఉద్ఘాటించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి, బ్లాక్‌డే (బాబ్రీ మసీదు కూల్చివేత రోజు)ను పురస్కరించుకొని రాష్ట్ర లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక అధ్వర్యంలో ‘లౌకికవాద పరిరక్షణ’ అనే అంశంపై విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో మంగళవారం రాష్ట్ర సదస్సు జరిగింది. వేదిక చైర్మన్‌, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ అధ్యక్షత వహించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ అజీజ్‌ పాషా మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనని ఆర్‌ఎస్‌ఎస్‌ మహాత్మాగాంధీని తక్కువ చేసి మాట్లాడుతోందని, స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని 9 ఏళ్లు జైలు జీవితం గడిపిన నెహ్రూను విమర్శిస్తోందని మండిపడ్డారు. దేశంలో మైనారిటీలను ద్వితీయశ్రేణి పౌరులుగా మార్చారని విమర్శించారు. భారతదేశాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లే ప్రణాళిక బీజేపీ వద్ద లేదని, అధికారమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. ఆహార భద్రత విషయంలో బంగ్లాదేశ్‌, నేపాల్‌ భారత్‌ కన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని వివరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ మైనారిటీలపై దాడి చేయటం, మెజారిటీలను రెచ్చగొట్టం ద్వారా రాజకీయంగా లబ్ధిపొంది అధికారాన్ని సుస్థిరం చేసుకోవటానికి బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశంలో 63 శాతం మంది బీజేపీకి ఓట్లు వేయలేదన్నారు. లౌకికవాదపార్టీలు, ప్రజాతంత్ర వాదులు ఒకేమాట మాట్లాడతారని, ఎన్నికల సమయంలో మాత్రం ఎవరిదారి వారు చూసుకుంటున్నారని, అందువల్ల బీజేపీ లాభపడుతోందని వివరించారు. ఎంఐఎంను పోటీకి దించడం ద్వారా ఓట్లు చీల్చి బీజేపీ అధికారం చేజిక్కించుకుంటోందని చెప్పారు. కార్పొరేట్‌ శక్తుల ఆస్తులు పెంచడమే మోదీ ప్రభుత్వ లక్ష్యమని విమర్శించారు. ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ ముద్రించాలని వ్యాఖ్యానించటమంటే లౌకికపార్టీలు సైతం ఊగిసలాటలో ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు. లౌకిక, ప్రజాస్వామికశక్తులు ఏకతాటిపైకి వచ్చి 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడిరచాలని కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఫ్‌ుపరివార్‌ శక్తులు 1992లో బాబ్రీ మసీదును కూల్చివేశాయని, 2002లో గోద్రా అల్లర్లు సృష్టించాయని, అధికారంలోకి రావటానికి ఎంతటి రక్తపాతానికైనా తెగిస్తాయని చెప్పారు. రామజన్మభూమి విషయంలో చట్టప్రకారం కాకుండా విశ్వాసం ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు. సాంకేతికతను దేశాన్ని వెనక్కి తీసుకెళ్లటానికి వినియోగిస్తున్నారని విమర్శించారు. మతం మారిన వాళ్లను దళితులుగా ఉంచుతారా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అప్పుడప్పుడు గెడ్డం పెంచుతూ మోదీ దశావతారాలు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. చదువు విలువ తెలియనివాళ్లను వైస్‌ చాన్సలర్లుగా నియమిస్తున్నారని చెప్పారు. శాసనమండలి సభ్యులు కె.లక్ష్మణరావు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయటానికి పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ లక్ష్యాలను తెలియజేస్తున్నదన్నారు. కేశవానందభారతీ, ఎస్‌ఆర్‌ బొమ్మై కేసుల విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ లక్ష్యాలను నిర్వచించిందని గుర్తు చేశారు. సమాఖ్య విధానం, లౌకికవాదం, పార్లమెంటరీ వ్యవస్థ, గణతంత్ర విధానాలు రాజ్యాంగ మూలసూత్రాలని చెప్పారు. సీఏఏ చట్టాలు తీసుకురావటం, 370 ఆర్టికల్‌ రద్దు చేయటం ద్వారా లౌకికవాదానికి ప్రమాదం ఏర్పడిరదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రచార విభాగం కన్వీనర్‌ ఎన్‌.తులసిరెడ్డి మాట్లాడుతూ మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యాంగంలోని నాలుగు స్తంభాలకు బీటలు వారాయని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిరదన్నారు. సిటిజన్‌ చార్ట్‌తో రాజ్యాంగాన్ని కూల్చటం ప్రారంభమైందన్నారు. హిందు అనేది బీజేపీ పేటెంట్‌ కాదన్నారు. బీజేపీది కుహనా దేశభక్తి అని విమర్శించారు. టీడీపీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు ముస్తాక్‌ అహ్మద్‌ మాట్లాడుతూ వెంటిలేటర్‌పై ఉన్న రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం ప్రతి ఇంటి నుంచి ఒకరు బయటకొచ్చి పోరాటం చేయాలని సూచించారు. వైసీపీ మైనారిటీ నాయకులు మునీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ మోదీ హయాంలో విద్యుత్‌ కేంద్రాలు మూతపడుతున్నాయని చెప్పారు. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులతో ధనవంతులు దేశం వదిలి పారిపోతున్నారని తెలిపారు. జల్లి విల్సన్‌ మాట్లాడుతూ, స్వాతంత్య్రదినోత్సవ వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో పాలకులు ఏమి చేయబోతున్నారో అనే విషయాలు కశ్మీర్‌, రామజన్మభూమి అంశాలు వివరిస్తున్నాయన్నారు. అంబేద్కర్‌ వర్ధంతి మర్చిపోయే విధంగా అదే ముహూర్తానికి బాబ్రీమసీదు కూల్చేందుకు బీజేపీ నేత అడ్వానీ కుట్రచేశారన్నారు. రాజ్యాంగానికి కూడా ఎసరుపెట్టే పరిస్థితులు కనబడుతున్న నేపథ్యంలో లౌకికవాదులు ముందుకు రావాలని విల్సన్‌ పిలుపునిచ్చారు. మైనారిటీలకు రక్షణ కల్పించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌ మాట్లాడుతూ 2024 తరువాత వైషమ్యాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
మతోన్మాదం తలకెత్తుకుంటే విచక్షణ కోల్పోతారని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ వేదికను బలోపేతం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. సీపీఎం సీనియర్‌ నాయకులు పి.మధు, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి హరనాథ్‌, ముస్లిం ఐక్యవేదిక నాయకులు పులి జాఫర్‌, హైకోర్టు ప్రముఖ న్యాయవాది అబ్దుల్‌ మతీన్‌, మైనారిటీ నాయకులు బాబా హుసేన్‌ ప్రసంగించారు. డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బుట్టి రాయప్ప, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు పాల్గొన్నారు.
ఇన్సాఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ అఫ్సర్‌ స్వాగతం పలికారు. ఆవాజ్‌ రాష్ట్ర కన్వీనర్‌ ఎంఏ చిష్ట వందన సమర్పణ చేశారు. తొలుత ఆంధ్రప్రదేశ్‌ ప్రజాన్యాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్ర నాయక్‌, ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, కోశాధికారి ఆర్‌. పిచ్చయ్య, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్‌ బృందం అభ్యుదయ గీతాలు ఆలపించింది. తొలుత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేవనూరు మహాదేవ రచించిన ‘ఆర్‌ఎస్‌ఎస్‌ లోతుపాతులు’ అనే పుస్తకాన్ని రామకృష్ణ, శ్రీనివాసరావు ఆవిష్కరించారు. కేఎస్‌ లక్ష్మణరావు రాజ్యాంగ పీఠిక చదివి అందరితో ప్రమాణం చేయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img