Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

రాతపూర్వక హామీలను నెరవేర్చాలి

. దిల్లీలో కదంతొక్కిన రైతులు
. రామ్‌లీలా మైదానంలో కిసాన్‌ మహా పంచాయత్‌
. రైతులకు ఇచ్చిన వాగ్దానాలను మోదీ విస్మరించారు: ఏఐకేఎస్‌ అధ్యక్షుడు రావుల వెంకయ్య

న్యూదిల్లీ: కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వేలాది మంది రైతులు సోమవారం దేశ రాజధాని దిల్లీలో కదంతొక్కారు. పార్లమెంటుకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో వివిధ రంగులు, శైలుల తలపాగాలు ధరించిన వేలాది మంది రైతులు సోమవారం ఇక్కడి ప్రసిద్ధ రామ్‌లీలా మైదానంలో కిసాన్‌ మహా పంచాయత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2021లో ప్రభుత్వం తమకు ఇచ్చిన ‘రాతపూర్వక హామీలను’ నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) అధ్యక్షులు రావుల వెంకయ్య మాట్లా డుతూ నరేంద్ర మోదీ రైతులకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించారని మండిపడ్డారు. సంవత్సరానికి పైగా రైతాంగ సమస్యలను పరిష్కరించకుండా కాలయా పన చేస్తున్నారని, దానికోసం తిరిగి దేశవ్యాప్తంగా మరో రైతు ఉద్యమాన్ని తీసుకురావలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గతంలో జరిగిన చారిత్రక రైతు ఉద్యమం రైతుల పాలిటి విజయంగా భావించాలని, ఇలాంటి ఉద్యమం గతంలో ఎప్పుడూ జరగలేదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అఖిల భారత స్థాయిలో జరిగిన రైతు ఉద్య మానికి తమ మద్దతు తెలియజేశారని, ఐక్యరాజ్య సమితి సైతం రైతు ఉద్యమానికి సంఫీుభావం తెలిపిందని అన్నారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సైతం నరేంద్ర మోదీకి ఈ చట్టాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని సూచించిందన్నారు. అయితే సుప్రీం కోర్టు చేసిన సూచనలను సైతం ప్రధాని మోదీ పెడచెవిన పెట్టార న్నారు. పార్టీలకతీతంగా, రాజకీయాలు, ప్రాంతాలు, మతాలు, కులాలకు భిన్నంగా రైతాంగ ఐక్య ఉద్య మం జరిగిందన్నారు. 545 రైతు సంఘాలు ఒక తాటిపై వచ్చి ఐక్య రైతు ఉద్యమాన్ని నిర్వహించార న్నారు. ఈ ఉద్యమంలో 750 మందికి పైగా రైతు బిడ్డలు అమరులయ్యారని తెలిపారు. 80 వేల మందికి పైగా రైతులపై వివిధ రాష్ట్రాలలో పోలీసు కేసులు పెండిరగ్‌లో ఉన్నాయన్నారు. రైతాంగ ఉద్యమానికి తలొగ్గిన నరేంద్ర మోదీ ఈ మూడు నల్ల చట్టాలను బేషరతుగా ఉపసంహరించుకొని, పార్లమెంటు సాక్షిగా వెనక్కి తీసుకున్నారని తెలిపారు. ప్రధాని మోదీ రైతాంగానికి క్షమాపణలు చెప్పార న్నారు. అలాగే ఆనాడు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు ఈనాటికీ ఏ ఒక్కటీ అమలు జరగలేదని రావుల వెంకయ్య మండిపడ్డారు. ఇప్పటికైనా రైతులకు డాక్టర్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులు అనుసరించి సి2ం50 ప్రకారం రైతాంగానికి మద్దతు ధరలు కల్పించాలని, కేరళ తరహా రైతు రుణ విమోచన చట్టాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావాలని, మరణించిన రైతు బిడ్డలకు నష్టపరిహారం చెల్లిం చాలని, వారిపై ఉన్న కేసులను తీసివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అయితే రైతులకు ఇచ్చిన హామీలను ఉల్లంఘించిన మోదీ ప్రభుత్వం రైతు ఉద్యమానికి విద్రోహం కలిగించిందన్నారు. ఇప్పటి కైనా రైతాంగ డిమాండ్లను అమలు చేయకపోతే మరో మారు దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం ఈ వేదిక నుంచే ప్రారంభించడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వ్యవసాయాన్ని రక్షించాలి, కార్పొరేట్‌ శక్తులను తరిమికొట్టాలి. వారికి మద్దతు ఇస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన పిలుపునిచ్చారు. దీనికోసం రైతాంగమంతా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ సభకు ఏఐకేఎస్‌ జాతీయ నాయకులు బలదేవ్‌ సింగ్‌ అధ్యక్షత వహించారు. ప్రముఖ రైతు నాయకులు రాకేశ్‌ తికైత్‌, దర్శన్‌ పాల్‌ సింగ్‌, సత్యవన్‌, అశేష్మిట్టల్‌, మేధాపాట్కర్‌, వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు ప్రసంగించారు. సభ అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి 15 మందితో కూడిన ప్రతినిధి వర్గం వినతి పత్రం అందజేసింది. ఈ వినతి పత్రాన్ని పరిశీలించి న్యాయం చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. అయితే రైతు నాయకులకు మంత్రి స్పందన సంతృప్తికరంగా లేనందున ఈ వేదిక నుంచే మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని వారు పిలుపు ఇచ్చారు.
సర్కార్‌ స్పందించకపోతే మరో మారు ఉద్యమం: ఎస్‌కేఎం
కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి), రుణమాఫీ, పింఛను చట్టం సహా తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకుంటే మరోమారు నిరసనలు చేపడతామని రైతు సంఘం సంయుక్త కిసాన్‌ మోర్చా సోమవారం కేంద్రాన్ని హెచ్చరించింది. 15 మంది సభ్యులతో కూడిన ఎస్‌కేఎం ప్రతినిధి బృందం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌తో మధ్యాహ్నం కృషి భవన్‌లో సమావేశమై డిమాండ్ల జాబితాను సమర్పించినట్లు రైతు నాయకుడు దర్శన్‌ పాల్‌ తెలిపారు. ఇక్కడి రామ్‌లీలా మైదానంలో సమావేశమైన రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘అపరిష్కృతంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఇవి మరొక ‘ఆందోళన’ను డిమాండ్‌ చేస్తున్నాయి. మేము ఏప్రిల్‌ 30న దిల్లీలో మరో సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము. అన్ని రైతు సంఘాలు తమ తమ రాష్ట్రాల్లో ర్యాలీలు నిర్వహించి, సమావేశానికి ముందు పంచాయతీలు నిర్వహించాలని నేను కోరుతున్నాను’ అని అన్నారు. ‘మేము ప్రతిరోజూ నిరసనలు చేయకూడదనుకుంటున్నాము. కానీ ప్రభుత్వం మా డిమాండ్లను పట్టించుకోకపోతే, మేము మరొక ఆందోళనను ప్రారంభిస్తాము. ఇది వ్యవసాయ చట్టాలపై నిరసన కంటే పెద్దది’ అని తెలిపారు. ఎంఎస్‌పీ చట్టం, పూర్తి రుణ మాఫీ, పింఛన్‌, పంటల బీమా, రైతులపై నమోదయిన కేసుల ఉపసంహరణ, ఇప్పుడు రద్దు చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం వంటి డిమాండ్‌లు ఉన్నాయని పాల్‌ తెలిపారు. అలాగే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను బర్తరఫ్‌ చేసి జైలులో పెట్టాలని, వడగళ్ల తుపాను, అకాల వర్షాల కారణంగా పంట నష్టానికి రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతులకు విద్యుత్‌ సబ్సిడీలను విద్యుత్‌ చట్టం నుంచి మినహాయించామని కేంద్ర మంత్రి తోమర్‌ ప్రతినిధి బృందానికి తెలిపారని పాల్‌ చెప్పారు. ‘ఈ డిమాండ్‌ ఇప్పటికే నెరవేరింది. ఇది ఎస్‌కేఎం పెద్ద విజయం’ అని ఆయన అన్నారు. వడగళ్ల వాన, అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటకు నష్టపరిహారం అందిం చాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని మంత్రి ప్రతినిధి బృందానికి తెలిపారు. ‘ఎంఎస్‌పీకి చట్టపరమైన హామీ అంశాన్ని కూడా మేము మంత్రితో చర్చించాము. రైతులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకునేలా, మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం అందించేలా తాను వ్యక్తిగతంగా జోక్యం చేసుకుంటానని తోమర్‌ చెప్పారు’ అని రైతు నాయకుడు తెలిపారు.
కిసాన్‌ మహా పంచాయత్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అనేక మంది ఈ సందర్భంగా మాట్లాడారు. వ్రాతపూర్వకంగా హామీ ఇచ్చినప్పటికీ రైతుల డిమాండ్లను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని జై కిసాన్‌ ఆందోళన్‌ జాతీయ అధ్యక్షుడు అవిక్‌ సాహా తెలిపారు. ‘రైతులపై వేల సంఖ్యలో కేసులు పెండిరగ్‌లో ఉన్నాయి. నిరసనలో 750 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోగా, వారి కుటుంబాలకు పరిహారం చెల్లించలేదు. ఇంకా అనేక ఇతర డిమాండ్లు నెరవేరలేదు’ అని ఆయన అన్నారు. పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన 47 ఏళ్ల రైతు బల్దేవ్‌ సింగ్‌ మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల కొందరు సభ్యులు ‘దారి తప్పారు’. మహాపంచాయత్‌ వారిని ఒకచోట చేర్చడం కూడా లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. బీహార్‌లోని వైశాలి జిల్లా నుంచి దిల్లీకి చేరుకున్న రైతు బృందంలో భాగమైన మజిందర్‌ షా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతులు దయనీయ స్థితిలో జీవిస్తున్నారని తెలిపారు. ‘అందరికీ ఆహారం అందించే రైతులకు తినడానికి ఏమీ లేనప్పుడు ధనికులు మరింత ధనవంతుల వుతున్నారు. కేవలం 5 శాతం మంది భారతీయులు మాత్రమే దేశ సంపదలో ఎక్కువ భాగాన్ని కలిగి ఉన్నారు. మరోవైపు, రైతులు తమ పిల్లల పెళ్లి ఖర్చుల కోసం తమ భూములను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది’ అని ఆయన అన్నారు. కాగా ఎస్‌కేఎం ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, రైతులు, వ్యవసాయ, వలస కార్మికులు, గ్రామీణ కార్మికులు, నిరుద్యోగం, పెరుగుతున్న జీవన వ్యయం, తగ్గుతున్న కొనుగోలు శక్తిపై ప్రభుత్వ విధానాల ప్రభావం గురించి నాయకులు మాట్లాడతారని మోర్చా పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img