. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
. ఈ నెల 27న కలెక్టర్లకు వినతి పత్రాలు
. సీఎం, డీజీపీ మైండ్‌సెట్ మారాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
విశాలాంధ్ర – విజయవాడ : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో అరాచకాలు పెరిగాయని, వాటిని ఎదుర్కోవటానికి ఐక్య ఉద్యమాలకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలో దళితులు, మైనార్టీలు, మహిళలు, జర్నలిస్టులు, పిల్లలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు, అరాచకాలు, హత్యలను నిరసిస్తూ సీపీఐ రాష్ట్ర సమితి అధ్వర్యంలో విజయవాడ దాసరి భవన్‌లో గురువారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ హైకోర్టు న్యాయవాదిని హత్య చేయటానికి హైకోర్టు సమీపంలోనే రెక్కీ నిర్వహించారనే వార్త ఆందోళన కలిగించే విషయం అన్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, హైకోర్టు, డీజీపీ ఎవరన్నా లెక్కలేకుండా పోయిందన్నారు. బాపట్ల జిల్లాలో బాలుడు అమర్‌నాథ్‌ను కాల్చి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమిలేని నిరుపేద కుటుంబానికి చెందిన తండ్రి లేని 14 ఏళ్ల బాలుడు అగ్ర వర్ణానికి చెందిన వారితో ఎదురు మాట్లాడతాడా? అని అన్నారు. డాక్టర్ సుధాకర్‌ను నడిరోడ్డుపై రెక్కలు విరిచి కొట్టారని, పిచ్చివాడిగా ముద్రవేసి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని తెలిపారు. ఎమ్మెల్సీ కారు డ్రైవర్ సుబ్రహ్యణ్యంను చంపి డోర్ డెలివరీ చేయటమే కాకుండా గర్భిణి అయిన అతని భార్యను బెదిరించారని గుర్తు చేశారు. ఇంత జరుగుతున్నా రాజకీయ పార్టీలు పెద్దగా స్పందించటం లేదని అన్నారు. హోం మంత్రి బర్త్‌డే పార్టీలకు, పేరంటాలకు వెళ్లడం తప్ప బాధితులను పరామర్శించటం లేదన్నారు. డీజీపీ కంటే పెత్తందారి ఇంట్లో పెద్ద జీతగాడు నయం అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడటం లేదని విమర్శించారు. వలంటీర్లను ఉపయోగించుకుని గ్రాఫ్ పెంచుకోవాలని ఎమ్మెల్యేలకు జగన్ సూచిస్తున్నారని అన్నారు. సమాజంలో జరుగుతున్న దురాగతాలను అదుపు చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. సీఎం, డీజీపీ మైండ్‌సెట్ మారకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటం కష్టం అని తెలిపారు. టీడీపీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య మాట్లాడుతూ సిట్టింగ్ ఎంపీ ఏమి చేస్తున్నాడో తెలియదుగానీ, ప్రతిపక్ష నాయకులు ఏమి చేస్తున్నారో మాత్రం తెలుస్తుందన్నారు. ఎంపీ వేరే రాష్ట్రానికి తరలిపోతానని చెబితే ఎవరు సిగ్గు పడాలని సందేహం వెలిబుచ్చారు. పోలీసు స్టేషన్‌లు వైసీపీ నాయకులకు అత్తారిల్లుగా మారాయని ఆరోపించారు. రాష్ట్రమా, రావణ కాష్టమా అని ప్రశ్నించారు. ఆర్టికల్ 355ను అమలు చేయాలని గవర్నర్‌ను కోరదామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ బాపట్ల ఘటనపై జాతీయ మీడియా స్పందించినా సీఎం జగన్ స్పందించ లేదన్నారు. గంజాయి ఏపీ నుంచి వస్తుందని, పక్క రాష్ట్రాలకు చెందిన పాలకులు ప్రెస్‌మీట్‌లు పెట్టి చెబుతున్నా లెక్కలేనితనంగా ఉంటున్నారని చెప్పారు. గోరంట్ల మాధవ్ వ్యవహారంలో వేగంగా స్పందించారని గుర్తు చేశారు. వైసీపీ నాయకులను కాపాడుకోవటానికి తప్ప, ప్రజలపై జరుగుతున్నా అఘాయిత్యాలపై స్పందించటం లేదన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.రమాదేవి మాట్లాడుతూ పెరిగిన నేరాల రేటును తగ్గించేందుకు పోలీసులు కొత్త విద్య నేర్చుకున్నారని చెప్పారు. దళితులు, పేద వర్గాలపై దాడులు చేసి, డబ్బులిచ్చి మధ్యవర్తిత్వం చేస్తున్నారని ఆరోపించారు. సచివాలయాల్లో మహిళా పోలీసులు ఏమి చేస్తున్నారని నిలదీశారు. స్వామీల ఆశ్రమాలు ఆడపిల్లలపై అఘాయిత్యాలకు కేంద్రాలుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవాని మాట్లాడుతూ పోలీసులే రౌడీలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నిర్లిప్త వాతావరణం నెలకొందన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు సరిగా పని చేయటం లేదన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటూనే అవమానకరంగా మాట్లాడుతున్నారని తెలిపారు. డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక్క నెలలో 7 హత్యలు జరిగాయని తెలిపారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు, అట్రాసిటీ కేసుల గురించి సీఎం సమీక్ష చేయటం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లు సరిగా పని చేయటం లేదని విమర్శించారు. రాజధాని దళిత జేఏసీ నాయకులు పోతుల బాలకోటయ్య మాట్లాడుతూ వైసీపీని ఇంటికి పంపించాలంటే ప్రతిపక్ష పార్టీలు దళిత బహుజనులను దగ్గరకు తీసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో వైఎస్ అవినాశ్ రెడ్డిని హత్య చేసినా ఆశ్చర్యం లేదన్నారు. వీసీకే రాష్ట్ర అధ్యక్షులు ఎన్.జె.విద్యాసాగర్ మాట్లాడుతూ అత్యాచారాలు, హత్యలు చేసిన వారు పారిపోకుండా పోలీస్ స్టేషన్‌కు వెళుతున్నారని, రాష్ట్రంలో కొత్త ధోరణి నడుస్తోందన్నారు. ప్రభుత్వమే కాశ్మీర్ ఫైల్స్, ఆదిపురుష్ వంటి సినిమాలు తీయించి ఒక భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతోందని అన్నారు. తెలుగు మహిళా నాయకులు చెన్నుపాటి ఉషారాణి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం.రామకృష్ణ, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.కె.ఖాదర్ బాషా, ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు కొరివి వినయ్‌కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి.మధు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్, బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా అద్యక్షులు షేక్ ముస్తఫా, ఇన్సాఫ్ రాష్ట్ర కార్యదర్శి అఫ్సర్, ఐద్వా నాయకులు డి.శ్రీనివాసకుమారి, టీడీపీ నాయకులు వెలగపూడి రామకృష్ణ ప్రసంగించారు. ముందుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ్యులు మార్పులు చేర్పుల అనంతరం సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రభుత్వ నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. జూన్ 27న 26 జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. అనంతరం గవర్నర్ అపాయింట్‌మెంట్ తీసుకుని ఆయనకు వినతి పత్రం అందజేయాలని నిర్ణయించారు. ముందుగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీఎస్‌ఎన్ మూర్తి అతిథులను పరిచయం చేసి రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశాన్ని వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర కోశాధికారి ఆర్.పిచ్చయ్య అభ్యుదయ గీతాలు ఆలపించారు. సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బుట్టి రాయప్ప, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్, ఆంధ్ర ప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రా నాయక్, సీపీఐ కృష్ణాజిల్లా ఇన్‌ఛార్జ్ కార్యదర్శి టి.తాతయ్య తదితరులు పాల్గొన్నారు.